Tenth Class Public Exams Evaluation :నేటి నుంచి ‘పదో తరగతి’ స్పాట్ ..ఏర్పాట్లు పూర్తి
ఆదిలాబాద్ : పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్పాట్ నిర్వహించనున్నారు. ఈనెల 11వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. విధులు కేటాయించిన ఉపాధ్యాయులంతా స్పాట్‌కు హాజరు కావాలని విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాకు చేరిన 1.90లక్షల జవాబుపత్రాలు..
వివిధ జిల్లాల నుంచి మూల్యాంకనం కోసం 1లక్షా 90వేల పదో తరగతి జవాబు పత్రాలు జిల్లాకు వచ్చాయని డీఈవో ప్రణీత, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. వీటిని మూల్యాంకనం చేసేందుకు దాదాపు 900 మంది ఉపాధ్యాయులకు విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. 600 మందికి ఏఈలుగా, 192 మందికి స్పెషల్ అసిస్టెంట్లుగా, 90 మందికి సీఈలుగా, ఏడుగురికి ఏసీఓలుగా విధులు కేటాయించారు. క్యాంప్ ఆఫీసర్‌గా డీఈవో, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌గా ఏసీ, ఏడీలు వ్యవహరించనున్నారు.
ఏర్పాట్లు ఇలా..
మూల్యాంకనం కోసం వచ్చే ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేశారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే ప్రథమ చికిత్స అందించేందుకు వైద్యారోగ్య శాఖ ద్వారా ఏఎన్‌ఎం, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, తిరిగి 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్పాట్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఇతర వ్యక్తులను లోనికి అనుమతించరు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మూల్యాంకన విధానాన్ని పరిశీలించేందుకు అన్ని గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ప్రతిరోజు ఒక్కో ఉపాధ్యాయుడికి మూల్యాంకనం కోసం 40 పేపర్లు ఇవ్వనున్నారు. మూల్యాంకనం కేంద్రంలోనికి సెల్‌ఫోన్ తీసుకురావద్దని డీఈవో ప్రణీత పేర్కొన్నారు. స్పాట్‌ను పకడ్బందీగా నిర్వహిస్తామని వెల్లడించారు.
Also Read: 10వ తరగతి ఫలితాలు విడుదల తేదీ ఇదే..? అత్యంత వేగంగానే టెన్త్ పరీక్షల వాల్యూయేషన్..!