Mega Parents-Teachers Meet2024 : నవంబర్ 14న మెగా ఉపాధ్యాయుల – తల్లిదండ్రుల సమావేశాలు
పార్వతీపురం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 14న మెగా ఉపాధ్యాయుల – తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా మెగా పేరెంట్ – టీచర్స్ సమావేశాలు జిల్లాలోని ప్రతి పాఠశాలలో చేపట్టాలన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడం, మెరుగైన ఫలితాలు సాధించడం, పాఠశాల అభివృద్ధి కోసం సరికొత్త ఆలోచనలు చేయడం దీని ముఖ్య ఉద్దేశమన్నారు. సమావేశాల్లో విద్య, క్రీడలు, న్యూట్రీ గార్డెన్, మై స్కూల్ – మై ప్రైడ్ వంటి అంశాలపై చర్చించి విద్యార్థులకు, తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. 10వ తరగతి ఫలితాల్లో గత రెండేళ్లుగా రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారని, ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. ఇందుకు ఈ సమావేశాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. మై స్కూల్ – మై ప్రైడ్ ఇప్పటికే జిల్లాలో కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లా అధికారి ఒక పాఠశాలను దత్తత తీసుకోవడం జరిగిందని చెప్పారు.
ఇదీ చదవండి: ఏపీ పదో తరగతి పరీక్ష ఫీజు అపరాధ రుసుం లేకుండా చివరి తేదీ నవంబరు 11
విద్యార్థులు మంచి విద్యను అభ్యసించాలంటే పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అవసరమన్నారు. అందుకే ప్రతి పాఠశాలలో న్యూట్రీ గార్డెన్ పేరిట పోషక విలువలు కలిగిన ఆకుకూరలు పండించడంతో పాటు విద్యార్థులు తీసుకునే ఆహారంలో వాటిని వినియోగించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెరిగేలా అవగాహన కల్పించాలన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం లభిస్తుందన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.