Skip to main content

10th Class Exam Fee Dates: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

telangana 10th Class Exam Fee Dates

భువనగిరి : పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ కల్పిస్తున్న ఫీజు రాయితీ ఉపయోగపడటం లేదు. వార్షిక పరీక్షల కోసం చెల్లించవల్సిన ఫీజు కోసం ప్రభుత్వం రాయితీ పథకం అమలు చేస్తోంది. కానీ, ఇందులో ఉన్న నిబంధనల కారణంగా ఏ ఒక్క విద్యార్థి ఈ పథకాన్ని అందుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 2023–24 విద్యా సంవత్సరానికి పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్‌ విడుదలైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 17వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. అపరాధ రుసుముతో డిసెంబర్‌ 20వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దీంతో విద్యార్థులు ఫీజు చెల్లించే పనిలో నిమగ్నలయ్యారు.

ఇచ్చేది తక్కువ.. ఖర్చు ఎక్కువ
వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఒక్కో విద్యార్థి రూ.125 ఫీజు చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇందులో 100 శాతం రాయితీ పొందే అవకాశం ఉంది. అయితే ఆయా వర్గాల విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించవల్సి ఉంటుంది. ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కాగా విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో వారికి రూ.20వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.25వేలు ఉండాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనలతో విద్యార్థులకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు రెవెన్యూ అధికారులు ఆసక్తి చూపడం లేదు. రాయితీకి పెట్టిన నిబంధనల ప్రకారం ఇంత తక్కువ ఆదాయంతో సర్టిఫికెట్‌ ఇచ్చే పరిస్థితి లేదు. రూ.125ల ఫీజు రాయితీ కోసం ఆదాయం సర్టిఫికెట్‌ తీసుకునేందుకు ముందుగా దరఖాస్తు ఫారం, మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ఫీజు చెల్లింపు, రెండు సార్లు సర్టిఫికెట్‌ కోసం మీసేవ కేంద్రాలు చుట్టూ తిరగడానికి రూ. 250 వరకు ఖర్చు వస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. ఈ కారణాలతో విద్యార్థులు రాయితీ పొందడానికి అసక్తి చూపడం లేదు.

చ‌ద‌వండి: TS 10th Class TM Study Material

ఏటా 7 వేలకు పైగా విద్యార్థులు
జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు 213 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ప్రతి సంవత్సరంసుమారు ఏడు వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా మార్చిలో వార్షిక పరీక్షలు రాయవల్సి ఉంటుంది. మొత్తం విద్యార్థుల్లో 70 శాతం మేర బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉంటారు. వీరంతా ఫీజు రాయితీ పొందే అవకాశం ఉంది.కానీ, ఆదాయ సర్టిఫికెట్‌ల జారీలో నిబంధనలు సవరించకపోవడంతో ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశం ఉపయోగపడడం లేదు.

Published date : 07 Nov 2023 04:09PM

Photo Stories