Skip to main content

School Fee: ఎల్‌కేజీకి లక్షన్నర!.. సగం ముందే కట్టాలని డిమాండ్‌..

Schools
ఎల్‌కేజీకి లక్షన్నర!.. సగం ముందే కట్టాలని డిమాండ్‌..
  • హైదరాబాద్‌ శివార్లలో ఉన్న ఓ కార్పొరేట్‌ స్కూల్‌ కోవిడ్‌కు ముందు ఎల్‌కేజీకి రూ.78 వేలు తీసుకుంది. ఇప్పుడు ఏకంగా రూ. 1.50 లక్షలు అడుగుతోంది.  
  • వరంగల్‌కు సమీపంలోని ఓ స్కూల్‌ యూకేజీకి 2020కి ముందు రూ. 35 వేలు తీసుకుంది. ఇప్పుడేమో రూ.98 వేలు అడుగుతోంది. కోవిడ్‌ వల్ల టీచర్లు దొరకడం లేదని, అదనపు జీతాలు ఇవ్వాల్సి వస్తోందని చెబుతోంది. 
  • ఖమ్మంలోని ఓ ప్రైవేటు బడి వార్షిక ఫీజును ఏకంగా 40 శాతం పెంచింది. దీనికి తోడు కొత్తగా చేరేవారి నుంచి డొనేషన్లు వసూలు చేస్తోంది. కోవిడ్‌ తర్వాత పరిస్థితులు మారడమే దీనికి కారణమని చెబుతోంది.   

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలలు ఈసారి ఫీజులు భారీగా పెంచినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. కొన్ని బడుల్లో ఏకంగా 50 శాతం వరకూ ఫీజులు పెంచారని వాపోతున్నారు. కోవిడ్‌ తర్వాత గత ఏడాది నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీన్ని అదనుగా చేసుకుని తల్లిదండ్రుల నుంచి అందినంతా దోచేస్తున్నాయి. అదీగాక, సగం ఫీజును ముందుగానే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఫీజులతోపాటు పుస్తకాలు, యూనిఫాం అంటూ అదనపు బాదుడు సరేసరి. ఇంకోవైపు డీజిల్‌ ధర విపరీతంగా పెరిగిందంటూ రవాణా చార్జీలూ 30 శాతం వరకూ పెంచారు. దీంతో పేదవాడికి ప్రైవేటు విద్య తడిసి మోపెడవుతోంది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టినా అంతంతమాత్రంగానే చదువు సాగుతోందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ల బాట పడుతున్నారు.

చదవండి: Free breakfast For Students: విద్యార్థుల‌కు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్‌... సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం

నియంత్రణ ఏమైనట్టు?

ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణలో కూడా ఇదే బాట పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. దాదాపు 11 వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించింది. దీంతో ఫీజుల నియంత్రణ కోసం 2016లో ఆచార్య తిరుపతిరావు కమిటీని నియమించింది. ఈ కమిటీ 2017లో ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. స్కూల్లో విద్యార్థిని చేర్చేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరమే ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నట్లు, కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకూ పెంచుతున్నట్లు కమిటీ దృష్టికొచ్చింది. స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ. 4 లక్షల వరకూ వార్షిక ఫీజు వసూలు చేస్తున్నట్లు కమిటీ గుర్తించింది. ఇష్టానుసారం కాకుండా మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచాలని కమిటీ సూచించినా అది కార్యాచరణకు నోచుకోలేదు.

చదవండి: Schools: అభివృద్ధిలో వీరే కీలకం

ఆ విధానం కనుమరుగు...

రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకుపైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. ఫీజుల నియంత్రణను బడ్జెట్‌ స్కూళ్లు (వార్షిక ఫీజు రూ. 20 వేలలోపు ఉండేవి) స్వాగతించాయి.

చదవండి: Admissions: ప్రైవేటు స్కూళ్లలో ఇంత మందికి ఉచిత ప్రవేశాలు

స్కూల్‌ డెవలప్‌మెంట్‌ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి

15% ఏటా పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలిచ్చారు. ఇక్కడే సమస్య వస్తోంది. పెద్ద స్కూళ్లు అవసరం లేని ఖర్చును అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక స్కూల్లో ప్రతీ గదిలో అత్యాధునిక సౌండ్‌ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేశారు. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపి 25 శాతం ఫీజు పెంచారు.

  • ఫీజుల పెంపును పరిశీలించేందుకు 2018లో తిరుపతిరావు కమిటీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దాదాపు 4,500 స్కూళ్లు తమ ఖర్చులను ఆన్‌లైన్‌ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతం లోపు ఫీజులు పెంచేందుకు అర్హత పొందాయి. ఈ విధానం ఆ తర్వాత కనుమరుగైంది.
  • ప్రతీ స్కూలు 10 శాతం వరకు ఫీజు పెంచుకోవచ్చు. 10 శాతం పైగా ఫీజు పెంచే స్కూళ్లు విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల నియంత్రణ కమిటీ పరిశీలిస్తుంది. పాఠశాల యాజమాన్యం ఎక్కడ తప్పు చేసినా భారీ జరిమానాతోపాటు గుర్తింపు రద్దు చేయొచ్చని కమిటీ సిఫార్సు చేసింది.
  • ఫీజుల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం గత ఏడాది ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫీజుల నియంత్రణ కార్యాచరణకు నోచుకోలేదు.
Published date : 19 May 2023 01:23PM

Photo Stories