Skip to main content

Robotics: సర్కారు బడుల్లో.. రోబో‘టిప్స్‌’

ప్రపంచంలో కీలక రంగాల్లో మానవ రహితంగా అనేక పనులు చక్కదిద్దే వ్యవస్థ క్రమంగా విస్తరిస్తోంది.
Robotics
సర్కారు బడుల్లో.. రోబో‘టిప్స్‌’

నవ శకానికి నాంది పలికేలా రోబోటిక్స్‌ పాత్ర సైతం పెరుగుతోంది. ఐఐటీతో పాటు ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో ఇప్పటికే రోబోటిక్స్‌ విద్యను అందిస్తున్నారు. కాగా, పాఠశాల దశ నుంచే విద్యార్థులకు ఎల్రక్టానిక్స్‌ పరిజ్ఞానాన్ని అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన సోహం అకడమిక్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ప్రభుత్వ స్కూళ్లలో ఈ సంస్థ ఎల్రక్టానిక్స్‌లో భాగమైన రోబోటిక్స్‌ విద్యను ఉచితంగా అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లాల్లోని 60 ప్రభుత్వ పాఠశాలల్లో 7 నుంచి 9వ తరగతి చదివే 7,679 మంది విద్యార్థులకు ఈ తరగతులు బోధిస్తున్నారు. 

చదవండి: Eagle: మరబొమ్మ సాక్షాత్‌.. గురు బ్రహ్మ..

మూడు దశల్లో శిక్షణ 

ఎలక్ట్రానిక్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రోబోలు, వివిధ రకాల ఇతర పరికరాలకు రూపకల్పన చేయడం, ఉత్పత్తి చేయడం రోబోటిక్స్‌ కిందకు వస్తాయి. ఈ రంగంలో విద్యార్థులకు మూడు దశల్లో శిక్షణ ఇచ్చేందుకు సోహం ఎక్స్‌లెన్స్‌ సంస్థ ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా పుస్తకాన్ని ప్రచురించి విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు సూచనతో తొలుత సిద్దిపేట జిల్లాలోని ఇందిరానగర్‌ జిల్లా ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోహం సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ రోబోటిక్స్‌(ల్యాబ్‌)ను ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ ఎల్రక్టానిక్‌ పరికరాలను అందుబాటులో ఉంచారు. సిద్దిపేట జిల్లాలో 10 పాఠశాలలు, హైదరాబాద్‌–28, మేడ్చల్‌–10, రంగారెడ్డి–1, యాదాద్రి–1, మెదక్‌–1, నాగర్‌కర్నూల్‌–3, సంగారెడ్డి–2, కామారెడ్డిలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 125 మంది ఇన్‌స్ట్రక్టర్‌లను నియమించి ఈ విద్యాసంవత్సరం నుంచి రోబోటిక్స్‌ను బోధిస్తున్నారు. 

చదవండి: Maa Robot: దివ్యాంగురాలైన కూతురి కోసం రోబో

మొదటి దశలో బోధన ఇలా 

కోర్సు మొదటిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 21 అంశాలపై పాఠాలు బోధిస్తారు. ఈ మేరకు విద్యార్థులకు బేసిక్‌ రోబోటిక్‌ కిట్‌ను అందజేస్తారు. పిల్లలకు సెన్సర్లు, చిన్నపాటి మోటార్లు, డోర్‌ లాక్‌ సిస్టమ్, డిస్‌ప్లే వంటి పరికరాల పనితీరును వివరిస్తారు. మొదటి దశలో కొంతకాలం వివిధ అంశాలపై ప్రయోగాలు చేసి చూపిస్తారు. 

చదవండి: Tesla Robo ‘ఆప్టిమస్‌’

రెండో దశలో.. 

మొదటి దశ శిక్షణ పొందిన పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను పరిశీలించి వారిలో నుంచి మెరిట్‌ విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక చేసిన వారికి ప్రతి నెలలో నాలుగు ప్రత్యక్ష తరగతులు, జూమ్‌లో నాలుగు తరగతులు నిర్వహిస్తున్నారు. వీరికి 8 టాస్క్‌లు ఇచ్చి వివిధ ఎలక్టాన్రిక్‌ పరికరాలు తయారు చేయిస్తారు. 

చదవండి: AI: ప్రపంచంలో మొట్టమొదటి రోబో CEOగా టాంగ్‌ యూ

మూడో దశలో.. 

విద్యార్థులు ఇన్నోవేటివ్‌గా తయారు చేసిన ప్రాజెక్ట్‌లతో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇలా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్‌లను ఏర్పాటు చేసి రోబోటిక్స్, ఎలక్టాన్రిక్స్‌పై వారికి మరింత పరిజ్ఞానం లభించేలా కృషి చేయనున్నారు. ఇలా పాఠశాల దశ నుంచే ఎల్రక్టాన్రిక్స్‌వైపు విద్యార్థులను మళ్లించడంతో వారు హార్డ్‌వేర్‌ రంగంలో రాణించగలుగుతారని నిర్వాహకులు చెపుతున్నారు. 

చదవండి: MIT scientists: ఇన్సులిన్‌ కు ప్రత్యామ్నాయంగా రోబోటిక్‌ మాత్ర

టాస్క్ లు అన్నీ చేస్తున్నాం.. 
రోబోటిక్స్‌ క్లాస్‌ ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం. ఇన్నోవేటివ్‌గా తయారు చేసేందుకు ఇచ్చిన టాస్క్ లన్నీ చేస్తున్నాం. స్పీడ్‌ డిటెక్షన్‌ సిస్టమ్, పాస్‌వర్డ్‌తో డోర్‌ ఓపెన్‌ చేయడం లాంటివి చాలా చేశాం. ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్‌ చేసి కొత్త పరిశోధనలు చేస్తాను. 
చండీశ్రీ, 8వ తరగతి, ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల 

ఎంతో ఉపయోగకరం 
పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్‌పై శిక్షణ ఇవ్వడం ఎంతో ఉపయోగకరం. రోబోటిక్స్‌లో శిక్షణ ద్వారా విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్‌ పై మక్కువ పెరుగుతుంది. ఇందిరానగర్‌ పాఠశాలలో ల్యాబ్‌ను సైతం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్‌ రంగం గురించి చెబుతున్నారు. 
–శ్రీనివాస్‌రెడ్డి, డీఈఓ 

ఆసక్తి పెంచే విధంగా.. 
ఎల్రక్టానిక్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంచే విధంగా కృషి చేస్తున్నాం. విద్యా సంవత్సరం మొత్తం దశలవారీగా తరగతులు నిర్వహిస్తాం. శిక్షణ అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేస్తాం. 
–కె.సహదేవ్, ఫౌండర్, సోహం అకడమిక్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ 

Published date : 20 Oct 2022 03:55PM

Photo Stories