Skip to main content

టీచర్ల బదిలీల గడువు పొడిగించే చాన్స్‌!

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ పద్ధతిలో లోపాలు.. అప్‌గ్రేడ్‌ కాని ఆప్షన్లు.. కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు.. ఇలా ఉపాధ్యాయుల బదిలీల్లో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా దరఖాస్తు చేసుకునే గడువును పెంచాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తోంది.
A chance to extend the deadline for teacher transfers
టీచర్ల బదిలీల గడువు పొడిగించే చాన్స్‌!

ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంది. గడువు పొడిగింపు విషయాన్ని జనవరి 30న అధికారికంగా వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది. టీచర్ల బదిలీలు, పదోన్నతికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసింది. జనవరి 28 నుంచి టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ గడువు జనవరి 30తో ముగుస్తుంది. 

చదవండి: ఉపాధ్యాయుల నియామకం నాణ్యమైన విద్యకు సహాయపడుతుంది

ఇప్పటికి 27 వేలమంది.. 

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 29 వరకూ 27,668 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన వెల్లడించారు. ఒకే స్కూల్‌లో 8 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్లను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. 5 ఏళ్లు ఒకేచోట పనిచేస్తున్నవాళ్లు బదిలీ సీనియారిటీలో ఉంటారు. ఇలా మొత్తం 70 వేలమంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే, గడువు సమీపిస్తున్నప్పటికీ సగంమంది కూడా దరఖాస్తు చేసుకోలేకపోవడం గమనార్హం. గతంలో ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌నే ఇప్పుడూ వాడుతున్నారని, దీనిని అప్‌గ్రేడ్‌ చేయలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీనివల్ల కొన్ని ఆప్షన్లు కన్పించడంలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ఆర్‌ఏ కేటగిరీలు గతంలో నాలుగు ఉండగా, ఇప్పుడు మూడింటికి కుదించారు. కానీ, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయలేదు. స్పౌజ్‌ 8 ఏళ్లుగా బదిలీ అవకాశాన్ని వాడుకున్నారా? అనే ఆప్షన్‌లో వాడుకోలేదనే ఆప్షన్‌కు టిక్‌ పెడితే దరఖాస్తును తీసుకోవడం లేదని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. మారుమూల గ్రామాల్లో తొలిరోజు ఆన్‌లైన్‌ విధానం పనిచేయలేదనే ఫిర్యాదులొచ్చాయి. దరఖాస్తు గుడువు ఒకరోజు మాత్రమే ఉండటంతో మిగిలిన 40 వేలమంది ఒకేసారి దరఖాస్తు చేస్తే సర్వర్‌ స్తంభించే అవకాశముందని విద్యాశాఖలోని సాంకేతిక వర్గాలు అంటున్నాయి. 

చదవండి: సార్‌.. మేడమ్‌ పిలుపులు ఇకపై నిషిద్ధం... ఏ రాష్ట్రంలోనో తెలుసా..?

ఎస్జీటీల సంగతేంటి? 

స్కూల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 615 మంది స్పౌజ్‌లు వారి ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించినా సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్టీటీ) విషయంలో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఖాళీలున్నా తమకు ఎందుకు న్యాయం చేయడంలేదని వారు జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నారు. వాస్తవానికి అన్ని జిల్లాల్లోనూ పోస్టులున్నాయి. సంగారెడ్డి జిల్లాల్లో కేవలం ముగ్గురు స్పౌజ్‌లే బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ 242 పోస్టులున్నా అనుమతించలేదు. ఖమ్మంలో 341 పోస్టులుంటే 41 మంది స్పౌజ్‌లే దరఖాస్తు చేశారు. అన్ని జిల్లాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఖాళీలున్నా ఎందుకు బదిలీచేయడం లేదని స్పౌజ్‌ ఫోరం నేతలు ప్రశి్నస్తున్నారు. 

చదవండి: School Education Department: గురువుల సేవలు ఇక పూర్తిగా విద్యకే పరిమితం

గడువు పెంచాల్సిందే... 
సాఫ్ట్‌వేర్‌ సమస్యల కారణంగా అనేకమంది టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి 1 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. టీచర్ల దరఖాస్తులు డీఈవోలకు సమర్పించేందుకు మూడు రోజుల గడువిచ్చారు. కాకపోతే ఈ సమయాన్ని తగ్గించి, టీచర్లు ఆన్లైన్‌ దరఖాస్తులు పెట్టుకునే గడువు పెంచాలి. 
– చావా రవి, టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

Published date : 30 Jan 2023 01:56PM

Photo Stories