Balkonda Government High School: బడికి వెళ్లాలంటేనే భయం..
కానీ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాత్రం పరిస్థితి భిన్నం. అక్కడ బడి గంటలు మోగవు.. విద్యార్థుల కేరింతలు పెద్దగా వినబడవు.. ఒకప్పుడు అధిక సంఖ్యలో కనిపించే ఆ పాఠశాల ప్రస్తుతం విద్యార్థులు లేక వెలవెలబోతుంది. దీనికి ప్రధాన కారణం పాఠశాల పక్కనే పోస్టుమార్టం గది ఉండడంతో పాటు విపరీతమైన కంపు వాసన వస్తోంది. దీంతో విద్యార్థులు ఈ పాఠశాలలో విదన్యభ్యసించడానికి వెనుకంజ వేస్తున్నారు.
చదవండి: Education: విద్యార్థుల ఎదుగుదలే ప్రభుత్వ ‘సంకల్పం’
మండల కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో ఉన్న భవనంలో ప్రాథమికోన్నత పాఠశాల కొనసాగుతోంది. ఇందులో ఏడు తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది ఈ భవనాన్ని మైనార్టీ గురుకుల పాఠశాలకు గత ప్రభుత్వం కేటాయించింది. దీంతో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రాథమికోన్నత పాఠశాలకు కేటాయించింది. ఈ స్కూల్ పక్కనే పోస్టుమార్టం గది ఉండడంతో విపరీతమైన కంపు కొడుతోంది. పాఠశాల భవనం వైపే కిటికిలు ఉండడంతో మృతదేహాలను పోస్టుమార్టానికి తీసుకువచ్చినప్పుడు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
చదవండి: Talent Competitions: విద్యార్థులకు ప్రతిభా పరీక్షల నిర్వాహణ..
విద్యార్థుల అనాసక్తి..
ఈ పాఠశాలలో ఏడో తరగతి వరకు విద్యనభ్యసించేందుకు అవకాశం ఉన్నా ఆరుగురు విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. ఈ పాఠశాలలో చదివేందుకు ఎక్కువగా పాత జాతీయ రహదారి అవతలి వైపు నుంచి ఎక్కువగా వచ్చేవారు. కాని పోస్టుమార్టం గదికి ఆనుకుని ఉండడంతో గతంలో 36 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య క్రమంగా 6కు చేరింది. ఒకే టీచర్‌తో విద్య అభ్యాసన కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 200 మీటర్ల దూరంలోనే ఈ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. దీంతో ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ పాఠశాలను కలపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ప్రాథమికోన్నత పాఠశాల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ పాఠశాలను సమీప పాఠశాలలో కలిపే యోచనలో ఉన్నట్లు తెలిసింది. త్వరలో నిర్ణయం జరుగుతుంది.
– రాజేశ్వర్, ఎంఈవో, బాల్కొండ