Skip to main content

AP TET & TRT High Court Judgement: టెట్, టీఆర్‌టీ పరీక్షల వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష (టీఆర్‌టీ), ఏపీ టీచర్‌ అర్హత పరీక్ష (టెట్‌)ల నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే, పరీక్షల వాయిదాకు సైతం తిరస్కరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్త­ర్వులు జారీచేయడం సాధ్యం కాదంది.
AP Teacher Eligibility Test Notification  AP TET & TRT High Court Judgement   AP Teacher Replacement Test Notification

తదుపరి విచారణ వాయిదా
ఈ వ్యవ­హారంపై తుది విచారణ జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయా­లని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

AP TET/DSC Previous Papers - Click Here

 టీఆర్‌టీ, టెట్‌ పరీక్షల నోటిఫికేషన్లను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. టెట్, టీఆర్‌టీ నోటిఫికేషన్లను రద్దుచేయాలని కోరారు. రెండు పరీక్షల మధ్య తగినంత సమయంలేదని, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆ సమయం సరిపోదని వారు వివరించారు. టీఆర్‌టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్‌ పరీక్ష నిర్వహణ­కు 8న నోటిఫికేషన్లు జారీచేశారని తెలిపారు.

ఈ సమయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం
టెట్‌లో అర్హత సాధించిన వారు టీఆర్‌టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్‌ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్‌టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్‌ పరీక్ష సిలబస్‌ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంతమాత్రం సరిపోద­న్నారు. టీఆర్‌టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరారు.

నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేయడంతో పాటు పరీక్షల­ను వాయిదా వేసి తిరిగి షెడ్యూల్‌ను ఖరారు చేసే­లా ఉత్తర్వులివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వు­లు సాధ్యంకాదని, అలా ఇస్తే తుది ఉత్తర్వులు ఇచ్చినట్లేనన్నారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అవసరమని పిటిషనర్లు చెబుతున్న నేపథ్యంలో ఈనెల 28న తుది విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టంచేశారు.  

Published date : 24 Feb 2024 12:16PM

Photo Stories