Skip to main content

బీటెక్ అబ్రాడ్ !

ఇంటర్మీడియెట్ తర్వాత బీటెక్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారా? అందులోనూ విదేశీ అవకాశాల కోసం అన్వేషిస్తున్నారా? అయితే ఆశయానికి అనుగుణంగా పటిష్ట ప్రణాళికతో అడుగేస్తే ఇంటర్‌తోనే ఇంటర్నేషనల్ బీటెక్ డిగ్రీ అందుకోవచ్చు! దీనికి కావల్సిందల్లా..
నిర్ణీత టెస్ట్ స్కోర్లు సాధించడమే! ప్రస్తుతం అన్ని దేశాల్లోనూ ఫాల్ సెషన్ ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఇంటర్ బీటెక్ అబ్రాడ్ అవకాశాలపై విశ్లేషణ..

సాధారణంగా స్టడీ అబ్రాడ్ అనగానే విద్యార్థుల మదిలో మెదిలేది మాస్టర్ స్థాయి కోర్సులే. కానీ, ఆలోచన, అన్వేషణా దృక్పథం ఉంటే ఇంటర్మీడియెట్‌తో విదేశాల్లో బీటెక్ పూర్తిచేసేందుకు అవకాశం ఉంటుంది.

నెం.1 అమెరికా..
ప్రస్తుతం బీటెక్ అబ్రాడ్ కోణంలో నెం.1గా నిలుస్తున్న దేశం అమెరికా. అయితే ఇక్కడి యూనివర్సిటీల్లో ప్రవేశాలకు వివిధ టెస్ట్‌ల స్కోర్లు ప్రామాణికంగా నిలుస్తున్నాయి. ఈ స్కోర్లు కేవలం అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ప్రవేశాలకూ అవకాశం కల్పిస్తున్నాయి.

స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎస్‌ఏటీ) :
యూఎస్‌లోని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో టెక్నికల్, సైన్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆధారంగా నిలుస్తున్న పరీక్ష స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎస్‌ఏటీ). ఈ టెస్ట్ స్కోర్‌ను ఇప్పుడు అమెరికాతో పాటు వివిధ దేశాలు తమ ఇన్‌స్టిట్యూట్‌లలోని బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా దాదాపు ఏడు వేల విద్యాసంస్థల్లో శాట్ స్కోర్ ఆధారంగా బీటెక్‌లో అడుగుపెట్టొచ్చు.

శాట్ విధానం :
శాట్ రెండు విభాగాల్లో జరుగుతుంది. అవి.. ఎవిడెన్స్ బేస్డ్ రీడింగ్ అండ్ రైటింగ్; మ్యాథమెటిక్స్. రీడింగ్‌కు సంబంధించి 52 ప్రశ్నలు (సమయం 65 నిమిషాలు); రైటింగ్‌కు సంబంధించి 44 ప్రశ్నలు (సమయం 35 నిమిషాలు); మ్యాథమెటిక్స్ నుంచి 58 ప్రశ్నలకు (సమయం 80 నిమిషాలు) సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షకు అదనంగా 50 నిమిషాల వ్యవధిలో ఒక ఎస్సే అంశం (ఆప్షనల్) కూడా ఉంటుంది. మొత్తం రెండు విభాగాలకు కలిపి 1600 పాయింట్లను గరిష్ట స్కోర్‌గా పేర్కొన్నారు. ఇందులో 800 పాయింట్లు మ్యాథమెటిక్స్‌కే కేటాయించడం గమనార్హం.

సబ్జెక్టు టెస్ట్‌లు కూడా..
స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో సబ్జెక్టు టెస్ట్‌ల నిర్వహణ విధానమూ అమలవుతోంది. అభ్యర్థులు తాము బ్యాచిలర్ డిగ్రీలో ఎంపిక చేసుకోనున్న కోర్సు ఆధారంగా సంబంధిత సబ్జెక్టు టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ టెస్ట్‌లు మ్యాథమెటిక్స్, సైన్స్ తదితర సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్నారు. ప్రతి సబ్జెక్టు టెస్ట్‌కు గరిష్ట స్కోరింగ్ 800 పాయింట్లు.
  • శాట్‌ను అంతర్జాతీయంగా ఏటా ఆరుసార్లు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు మెరుగైన స్కోర్లు సాధించే క్రమంలో ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావొచ్చు.
దరఖాస్తు విధానం:
https://collegereadiness.collegeboard.org/sat లో లాగిన్ అయి పేర్లు నమోదు చేసుకుని.. అందుబాటులో ఉన్న తేదీల నుంచి ఒకదాన్ని ఎంపిక చేసుకొని పరీక్షకు హాజరుకావొచ్చు.

1300 పాయింట్లతో ఉన్నతంగా..
1600 పాయింట్లకు నిర్వహించే శాట్‌లో 1300 పాయింట్లు సొంతం చేసుకుంటే అత్యున్నత సంస్థల్లో ప్రవేశం పొందొచ్చు. కొన్ని యూనివర్సిటీలు రెండు విభాగాల్లోనూ కనీస స్కోర్లను నిర్దేశిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కో విభాగంలో 600 పాయింట్లకు తగ్గకుండా స్కోర్ సాధిస్తే అవకాశాలు మెరుగవుతాయి.

మరో మార్గం ఏసీటీ :
కేవలం అమెరికా ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి అందుబాటులో ఉన్న మరో మార్గం అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ఏసీటీ). ఈ పరీక్షలో నాలుగు విభాగాలుంటాయి. అవి.. ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, రీడింగ్ ఎబిలిటీ, సైన్స్.
విభాగం ప్రశ్నలు సమయం (నిమిషాల్లో)
ఇంగ్లిష్ 75 45
మ్యాథమెటిక్స్ 60 60
రీడింగ్ ఎబిలిటీ 4 35
సైన్స్ 40 35
ఈ నాలుగు విభాగాలకు అదనంగా ఎస్సే రైటింగ్ టాస్క్ పేరుతో మరో విభాగంలోనూ పరీక్ష ఉంటుంది. దీనికి లభించే వ్యవధి 40 నిమిషాలు. శాట్ తరహాలో ఇది కూడా ఆప్షనల్ విభాగమే. అభ్యర్థులకు ఆసక్తి ఉంటేనే రాయొచ్చు.

ఏటా ఆరుసార్లు :
ఏసీటీను ఏటా ఆరుసార్లు ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్‌లో నిర్వహి స్తారు. ఔత్సాహి కులు www.act.org లో లాగిన్ అయి పేర్లు నమోదు చేసుకోవాలి. తర్వాత అందు బాటులో ఉన్న టెస్ట్ తేదీల నుంచి తమకు అనువైన స్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి. మొత్తం 36 పాయింట్లకు నిర్వహించే ఏసీటీలో అభ్యర్థులు 25 పాయింట్లు సొంతం చేసుకుంటే ఉత్తమ సంస్థల్లో ప్రవేశాలకు మార్గం సుగమం అవుతుంది.

అబ్రాడ్ బీటెక్‌కు ఉత్తమ వేదికలు..
దేశం ఏడాదికి ఫీజులు
సింగపూర్ 24 వేల డాలర్ల నుంచి 30 వేల డాలర్లు
న్యూజిలాండ్ రూ.10 లక్షలు
ఆస్ట్రేలియా 9 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల నుంచి 14 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు
కెనడా 10 వేల డాలర్ల నుంచి 20 వేల డాలర్లు
జర్మనీ 500 యూరోల నుంచి 2000 యూరోలు

యూకేలో బీటెక్ :
  • అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సులో ప్రవేశ విధానం పరంగా యూకే ప్రత్యేక, సొంత విధానాలను అమలు చేస్తోంది. అన్ని యూనివర్సిటీల ఆధ్యరంలో ఉమ్మడి కౌన్సెలింగ్ కోసం యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అడ్మిషన్ సర్వీస్ అనే వ్యవస్థ ఉంది. ఔత్సాహికులు దీనిద్వారానే ఆయా సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి.
  • యూకేలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల వ్యయం ఎనిమిది వేల నుంచి 25 వేల పౌండ్ల వరకు ఉంటుంది. ఈ ఖర్చును భరించే సామర్థ్యం లేని ప్రతిభావంతులైన విద్యార్థులకు వివిధ స్కాలర్‌షిప్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి.. కామన్వెల్త్ స్కాలర్‌షిప్ అండ్ ఫెలోషిప్ ప్లాన్, చార్లెస్ వాలేస్ ఇండియా ట్రస్ట్ అవార్డ్స్ అండ్ ఫెలోషిప్స్, ఫెలిక్స్ స్కాలర్‌షిప్స్, బ్రెండిష్ ఫ్యామిలీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్.
లాంగ్వేజ్ టెస్ట్ స్కోర్లు :
బీటెక్‌లో అడుగు పెట్టేందుకు శాట్, ఏసీటీ మాత్రమే కాకుండా లాంగ్వేజ్ టెస్ట్ స్కోర్లనూ వివిధ దేశాల విద్యా సంస్థలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు రాయాల్సిన లాంగ్వేజ్ టెస్ట్‌లు.. పొందాల్సిన కనీస స్కోర్ల వివరాలు..
టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్): అభ్యర్థుల్లోని ఇంగ్లిష్ రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ నైపుణ్యాలను పరిశీలించే పరీక్ష ఇది. ఇందులో 100 పాయింట్లు సొంతం చేసుకోవడం ద్వారా అత్యున్నత సంస్థల్లో అడుగుపెట్టేందుకు అవకాశం ఉంటుంది.
ఐఈఎల్‌టీఎస్ (ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్): ఈ పరీక్షలోనూ నాలుగు విభాగాలు (రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్) ఉంటాయి. స్కోరింగ్ విధానం బ్యాండ్స్ రూపంలో ఉంటుంది. మొత్తం పది బ్యాండ్స్ స్కేల్‌లో 6 లేదా 6.5 బ్యాండ్స్ సొంతం చేసుకుంటే అవకాశాలు మెరుగవుతాయి.

స్కాలర్‌షిప్స్ :
  • ఎస్‌ఏటీ, ఏసీటీలో ఉత్తీర్ణత సాధించి.. ఆ స్కోర్ల ద్వారా విదేశీ వర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆకర్షణీయంగా నిలుస్తున్న అంశం స్కాలర్‌షిప్ సదుపాయం. సాధారణంగా విదేశాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల వ్యయం ఏడాదికి 12 వేల నుంచి 20 వేల డాలర్ల వరకు ఉంటోంది.
  • యూనివర్సిటీలు, సంస్థల్లో ప్రవేశాలు ఖరారు చేసుకున్న విద్యార్థులకు ఇప్పుడు పలు స్కాలర్‌షిప్ పథకాలు, నీడ్ బేస్ట్ అసిస్టెన్స్ పేరుతో ఆర్థిక చేయూత అందించే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫుల్‌బ్రైట్ ఫారెన్ స్టూడెంట్ ప్రోగ్రామ్; రోటరీ ఇంటర్నేషనల్ అంబాసిడిరియల్ స్కాలర్‌షిప్స్; జేఎన్ టాటా ఎండోమెంట్‌లు ముఖ్యమైనవి.
  • ఎస్‌ఏటీ, ఏసీటీ ఆధారిత స్కాలర్‌షిప్స్ మాత్రమే కాకుండా ఇతర స్కాలర్‌షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి.. ఇన్‌సీడ్ స్కాలర్‌షిప్స్, టోఫెల్ స్కాలర్‌షిప్స్, ఐఈఎల్‌టీఎస్ స్కాలర్‌షిప్స్, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ తదితర.
బీటెక్ అబ్రాడ్ దరఖాస్తుకు అవసరమైనవి: కవరింగ్ లెటర్; అప్లికేషన్ ఫీజు, ఫామ్; స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్‌వోపీ), ఎస్సే, రికమండేషన్ లెటర్స్, ట్రాన్స్‌క్రిప్ట్స్, మార్క్‌షీట్స్ అండ్ సర్టిఫికెట్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ అఫిడవిట్, నిర్దేశ టెస్ట్ స్కోర్స్ రిపోర్ట్ కార్డ్స్.
Published date : 31 Mar 2018 02:35PM

Photo Stories