Skip to main content

నైపుణ్యార్జనకు జర్మనీ ఫినిషింగ్ స్కూల్

పరిశోధనలకు పెట్టింది పేరు.. ఎన్నో ఆవిష్కరణల కార్యక్షేత్రం.. నోబెల్ బహుమతి గ్రహీతల చిరునామా.. అక్కడ చదువు పూర్తి చేసి బయటకు వస్తే.. ఎక్కడైనా పనిచేయగల వృత్తి నైపుణ్యం సొంతం..ఆ దేశం జర్మనీ..! ఆ విధానం.. ఫినిషింగ్ స్కూల్! దీని విశేషాలేమిటో తెలుసుకుందాం..!
ఫినిషింగ్ స్కూల్
కోర్సు నైపుణ్యాలతో పాటు క్షేత్రస్థాయి శిక్షణనందించడమే జర్మనీ ‘ఫినిషింగ్ స్కూల్’ ఉద్దేశం. వాస్తవిక దృక్పథ (రియల్ టైం) బోధనకు ప్రాధాన్యమిచ్చే అక్కడి విద్యా సంస్థలు ఈ విధానం అనుసరిస్తున్నాయి. ప్రభుత్వ స్థాయిలో ఇన్‌స్టిట్యూట్లు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు క్షేత్ర పరిజ్ఞానం ఉండాలనే యోచన ఫలితంగా ఆవిష్కృతమైందిది. దీని ప్రకారం.. ఒక కోర్సులో చేరిన విద్యార్థులకు నిర్దిష్ట వ్యవధిలో వృత్తి శిక్షణ సదుపాయం కల్పిస్తారు. ఇది ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ పద్ధతుల్లో ఉంటుంది.
ఫుల్‌టైమ్: విద్యార్థి కోర్సు వ్యవధిలో కొన్ని నెలల పాటు కళాశాల/ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలో శిక్షణలో పాల్గొనాల్సి ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఈ వ్యవధి ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. మరికొన్నింటిలో కోర్సు ముగిసిన తర్వాత శిక్షణ ఇస్తారు.
పార్ట్‌టైమ్: కోర్సు అభ్యసిస్తున్నప్పుడే తరగతుల అనంతర సమయం లేదా వారాంత, ఇతర సెలవు రోజుల్లో ఆయా సంస్థల్లో శిక్షణలో పాల్గొంటారు.

విదేశీ విద్యార్థులకు ఊతం
ఫినిషింగ్ స్కూల్ ముఖ్యంగా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే ఎక్కువగా అమలవుతోంది. ఇది జర్మనీలో చదివే విదేశీ విద్యార్థులకు ప్రయోజనకరమని చెప్పొచ్చు. ముఖ్యంగా కోర్సు పూర్తయ్యాక శిక్షణనిప్పించే ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశించిన విద్యార్థులు.. అది పూర్తయ్యే వరకు అక్కడే నివసించే సదుపాయం లభిస్తుంది. ఆ సమయంలో వారు ఉద్యోగాన్వేషణ సాగించే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు బాగా అనువైన అంశం.. ప్రాక్టికల్ నైపుణ్యాలు లభించడం. ముఖ్యంగా సాంకేతిక విద్య కోర్సుల్లో చేరినవారికి.. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితుల కు అన్వయించే అవకాశం కలుగుతుంది.

ప్రవేశం ఎలా?
ఫినిషింగ్ స్కూల్, వృత్తి విద్య శిక్షణ (ఒకేషనల్ ట్రైనింగ్) సదుపాయం అందుబాటులో ఉన్న జర్మనీలోని ఇన్‌స్టిట్యూట్‌లలో రెండు స్థాయిల్లో ప్రవేశించొచ్చు. అవి.. బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ.
బ్యాచిలర్ డిగ్రీ ఔత్సాహికులు 10+2 తత్సమాన అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్‌స్టిట్యూట్‌లు ప్రత్యేకంగా నిర్వహించే ఫ్రెష్‌మన్ అడ్మిషన్ టెస్ట్‌లలో వీరు నిర్దేశిత స్కోర్‌తో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
మాస్టర్ డిగ్రీ ఔత్సాహికులు.. స్టెమ్ ప్రోగ్రామ్‌లకు జీఆర్‌ఈ, మేనేజ్‌మెంట్ కోర్సుల కైతే జీమ్యాట్ స్కోర్లు సొంతం చేసుకోవాలి.
వీటితోపాటు ఐఈఎల్‌టీఎస్, టోఫెల్ స్కోర్లు పొందాలి.
కొన్ని యూనివర్సిటీలు ప్రవేశాల క్రమంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్‌లతో పాటు జర్మనీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి డీఏఎఫ్ సంస్థ నిర్వహించే ‘టెస్ట్ ఆఫ్ జర్మన్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్ స్కోర్’, ఇన్‌స్టిట్యూట్‌లు స్వయంగా ఏర్పాటు చేసే డీఎస్‌హెచ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

ఖర్చు తక్కువే!
జర్మనీలో విద్య పరంగా విదేశీ విద్యార్థులకు కలిసొస్తున్న మరో అంశం.. తక్కువ ఖర్చుతో చదువుకునే అవకాశం. ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీలు ఎలాంటి ట్యూషన్ ఫీజులు వసూలు చేయవు. కానీ.. అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ పేరుతో సెమిస్టర్‌కు 170 నుంచి 200 యూరోల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు యూనివర్సిటీల్లో మాత్రం ఫీజులు ఉంటాయి. చక్కటి విద్యా నేపథ్యం ఉండి, అన్ని రకాల స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్‌లో మంచి పాయింట్లు సొంతం చేసుకుని.. ఏడాది ముందుగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తే ప్రభుత్వ సంస్థల్లో ఉచితంగా ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు దక్కుతాయి. అమెరికా, యూకేలతో పోల్చినప్పుడు జర్మనీలో నివాస వ్యయం కూడా తక్కువే. నెలకు 700 నుంచి వెయ్యి యూరోల మధ్య ఉంటుంది. చదువుకుంటూ పని చేసుకుంటే ఈ వ్యయ భారం 200 యూరోల వరకు తగ్గుతుంది.

ఉపకార వేతన సదుపాయాలు
జర్మనీలో ఉన్నత విద్య ఔత్సాహికులకు ఆర్థికంగా లాభిస్తున్న మరో అంశం.. స్కాలర్‌షిప్ సదుపాయాలు. అవి..
DAAD: జర్మనీలో ఉన్నత విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు అత్యున్నత స్కాలర్‌షిప్ సదుపాయం కల్పించే పథకం.. ‘డాడ్’. దీంతో రీసెర్చ్, ట్యూషన్ ఫీజు, ట్రావెల్ గ్రాంట్స్ లభిస్తాయి.
జవహర్‌లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్‌స్టాండింగ్- డాక్టర్ ఏంజెలా మెర్కెల్ స్కాలర్‌షిప్: న్యాయ విద్యలో మాస్టర్ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు దీన్ని అందిస్తారు.
కోఫీ అన్నన్ ఎంబీఏ స్కాలర్‌షిప్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్: కనీసం ఏడాది వ్యవధి ఉన్న మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశించే విద్యార్థులకు వీటిని అందిస్తారు.

ఉన్నత విద్య.. ప్రవేశ కసరత్తు
జర్మనీలో ఉన్నత విద్యకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఏడాది ముందుగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. ఈ క్రమంలో వారు జత చేయాల్సిన పత్రాలు..
  • అకడమిక్ సర్టిఫికెట్లు
  • రికమండేషన్ లెటర్
  • లెటర్ ఆఫ్ మోటివేషన్ (స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్‌నే లెటర్ ఆఫ్ మోటివేషన్‌గా పిలుస్తారు)
  • రెజ్యూమె
  • నిర్ణీత స్టాండర్డ్ టెస్ట్ స్కోర్లు

వీసా ఇలా
దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి ఒక యూనివర్సిటీ నుంచి ప్రవేశం సొంతం చేసుకుంటే.. ఆ వర్సిటీ ఇచ్చే అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ ఆధారంగా వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీసా జారీకి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది.

వీసా దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన పత్రాలు..
అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్
అకడమిక్ సర్టిఫికెట్స్
ఆర్థి్ధక ధ్రువీకరణ పత్రాలు
స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్
వెబ్‌సైట్: www.vfs-germany.co.in, https://www.study-in.de

చదువుతూనే సంపాదన
జర్మనీలో చదువుతూనే పార్ట్‌టైం జాబ్ చేసుకునే అవకాశముంది. వారానికి 20 గంటల పని చూసుకోవచ్చు. ఆ పని నేపథ్యం అకడమిక్ అనుబంధ విభాగాలకు సంబంధించినదైతే.. అటు యూనివర్సిటీ, ఇటు ఇమిగ్రేషన్ అధికారుల నుంచి మరింత సులువుగా అనుమతి లభిస్తుంది.

పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు
చదువు తర్వాత కూడా ఏడాది నుంచి ఏడాదిన్నర వ్యవధిలో తమ కోర్సుకు సంబంధించిన రంగంలో ఉద్యోగం పొంది పనిచేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. దీంతో ఇటీవల జర్మనీ వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలపై నిబంధనలు విధించడం ఇందుకు మరో కారణంగా నిలుస్తోంది.

టాప్ వర్సిటీలకు నెలవు
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2018 ప్రకారం జర్మనీలోని టాప్ యూనివర్సిటీల వివరాలు..
టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యునిచ్
లడ్‌విగ్ మాక్స్‌మిలియన్స్ యూనివర్సిటీ
రుప్రెచ్ కార్ల్స్ యూనివర్సిటీ
కార్ల్‌స్రుహె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
హంబోల్ట్ యూనివర్సిటీ
ఫ్రెయె యూనివర్సిటీ
ఆర్.డబ్ల్యు.టి.హెచ్. ఆచెన్ యూనివర్సిటీ
టెక్నిన్సే యూనివర్సిటీ
ఎబెర్‌హార్డ్ యూనివర్సిటీ
ఆల్‌బెర్ట్-లడ్‌విగ్స్ యూనివర్సిటీ

జర్మనీలో భారతీయ విద్యార్థులు

సంవత్సరం

విద్యార్థులు

2011-12

6500

2012-13

7532

2013-14

9495

2014-15

10,500

2015-16

13,470

Published date : 07 Oct 2017 12:29PM

Photo Stories