Skip to main content

నైపుణ్యానికి స్వాగతం పలుకుతున్న జర్మనీ

జర్మనీ.. ఐరోపా ఖండం పశ్చిమ, మధ్య ప్రాంతంలో నెలవైన దేశం.. శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆ దేశం సాధించిన విజయాలు ఎంతో విలువైనవి.. ఒక రకంగా జర్మనీ ఆర్థిక వృద్ధికి పరిశోధనలు-అభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) రంగం ఇంధనంగా పని చేస్తోంది.. సైన్స్ రంగంలో అత్యధిక నోబెల్ బహుమతులు అందుకున్న ఘనత కూడా ఈ దేశం సొంతం.. అటువంటి జర్మనీ ఇప్పుడు భారతీయ యువత కలలకు వేదికగా మారుతోంది.. విజ్ఞాన సముపార్జనకు నిలయంగా మారుతోంది.. అమెరికా, యూకేల కంటే జర్మనీలో ఉన్నత విద్యనభ్యసించడానికి భారతీయ విద్యార్థులు ప్రాధాన్యతనిస్తున్నారు.. ఇందుకు దోహదం చేస్తున్న కారణాలు, ఏయే కోర్సులకు డిమాండ్ ఉంటోంది తదితర అంశాలపై విశ్లేషణ...

నాటి నుంచి నేటి వరకు జర్మనీ అంటే సహజంగానే శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆ దేశం సాధించిన విజయాలు స్ఫూరణకు వస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా కూడా ఈ ఐరోపా దేశం భాసిల్లుతోంది. మారుతున్న అవసరాలకనుగుణంగా టెక్నాలజీని మెరుగుపరచడం, రూపొందించడంలో అన్ని దేశాల కంటే ఒక అడుగు ముందు ఉంటుంది. పరిశోధనల్లో ప్రపంచవ్యాప్తంగా పైచేయి.. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థలు.. ప్రవేశాల విషయంలో సరళీకృత నిబంధనలు.. ఇదీ జర్మనీలో ఉన్నత విద్య కోసం ఆసక్తి చూపించడానికి దోహదపడుతున్న అంశాలు ఇటువంటి నేపథ్యం ఉండడంతో ఇక్కడి యూనివర్సిటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు ఉత్సాహం చూపిస్తుంటారు.

పరిశోధనలే.. ప్రధానం
భారతీయ విద్యార్థులు ఆకర్షితులవ్వడానికి ప్రధాన కారణం అక్కడి వర్సిటీ పరిశోధనలే. ఆయా యూనివర్సిటీల్లో ప్రవేశ దరఖాస్తులను డాక్టరేట్ కమిటీలే పరిశీలిస్తాయి. అంతేకాకుండా ప్రొఫెసర్లతో ఒక్కొక్క రీసెర్చ్ స్కాలర్ పనిచేసే సదుపాయం కూడా పరిశోధన మరింత మెరుగ్గా చేయడానికి దోహద పడుతుంది. దీంతోపాటు కొంత మంది స్కాలర్స్‌కు ఒక గ్రూప్ చొప్పున పరిశోధనలపై కసరత్తులు నిర్వహించడం ఇక్కడ అమల్లో ఉంది. మరో ప్రధాన అంశం.. ఇక్కడి అనుసరిస్తున్న ఇంటర్నేషనలైజేషన్ స్ట్రాటజీ. ఇందులో భాగంగా అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులను ఆకర్షించడానికి పలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇందుకోసం జర్మనీ యూనివర్సిటీలు నిబంధనలను సైతం సరళతరం చేస్తున్నాయి.

పోస్ట్ స్టడీ ఎంప్లాయిమెంట్
మరో కీలాకాంశం.. పోస్ట్ స్డడీ ఎంప్లాయిమెంట్. విదేశీ విద్యకు ప్రధాన కేంద్రాలుగా నిలుస్తోన్న దేశాలు..పోస్ట్ స్డడీ ఎంప్లాయిమెంట్ అంశంలో నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. దీంతో చాలా మంది దృష్టి జర్మనీపై పడింది. జర్మనీలో చదువు పూర్తయిన తర్వాత కూడా అక్కడే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా ఈ విషయంలో ఎటువంటి నిబంధనలను విధించడం లేదు. వారి అర్హతకు సరిపడ ఉద్యోగాన్ని వెతుక్కునే స్వేచ్ఛను కల్పించింది. అంతేకాకుండా జర్మనీ యూనివర్సిటీలను ప్రపంచంలోనే ఉత్తమమైనవిగా భావిస్తారు. ఐరోపా కేంద్రంగా పని చేస్తున్న సంస్థలు అమెరికా, యూకే కంటే జర్మనీ వర్సిటీల్లో చదివిన విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ అంశం కూడా భారతీయ విద్యార్థుల నిర్ణయాన్ని అమితంగా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా గ్రాడ్యుయేట్లు చదువు తర్వాత 18 నెలలపాటు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వొకేషనల్ శిక్షణ తీసుకున్న వారు ఏడాది వరకు అక్కడే ఉండొచ్చు.

ఫీజు మినహాయింపు
జర్మనీలో భారతీయ విద్యార్థుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా భావించాల్సిన అంశం..ఉచిత విద్య. ప్రతిభావంతులను ఆకర్షించే ఉద్దేశంతో భారతీయ విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు (కొన్ని యూనివర్సిటీల్లో). ఈ క్రమంలో ట్యూషన్ ఫీజు చెల్లించనక్కర్లేదు. బోర్డింగ్, లాడ్జింగ్ ఫీజులను చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడి అధిక శాతం యూనివర్సిటీలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఇక్కడి యూనివర్సిటీలు ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ఎన్నో రకాల స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నాయి. భారతీయ విద్యార్థుల్లో అధిక శాతం ఈ సదుపాయం ద్వారా లబ్ధి పొందుతున్నారు. జర్మనీ ప్రభుత్వం కూడా నైపుణ్యం ఉన్న యువతను ఆకర్షించే ఉద్దేశంతో వసతి, ఎంట్రీ పర్మిట్ నిబంధనలను అవసరాలకనుగుణంగా సరళతరం చేస్తోంది.

120 రోజులు
విదేశాల్లో ఉన్నత విద్య అంటే.. సాధారణంగా విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్ గురించి ఆలోచిస్తుంటారు. ఈ విషయంలో మిగతా దేశాల కంటే జర్మనీలో పరిస్థితి చాలా మెరుగ్గా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ క్రమంలో రెండేళ్ల కిత్రం కొన్ని సవరణలు చేశారు. ఇవి కూడా భారతీయులను ఆకర్షించాయని చెప్పొచ్చు. గతంలో కేవలం 90 రోజులు మాత్రమే పని చేసుకునేందుకు అవకాశం ఉండేది. సవరించిన నిబంధనల మేరకు సంవత్సరానికి 120 రోజులు పని చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక్కడ కొన్ని యూనివర్సిటీలు మాత్రం సెలవుల్లోనే ఈ సౌలభ్యం కల్పిస్తాయి.

అతి స్వల్ప స్థాయిలో
ఉన్నత విద్య కోసం జర్మనీకి ప్రాధాన్యతనివ్వడానికి మరో కారణం.. ట్యూషన్ ఫీజులు. అమెరికా, యూకే వంటి దేశాలతో పోల్చితే ఇక్కడ ట్యూషన్ ఫీజులు చాలా స్వల్పం. ఫీజులను సెమిస్టర్ వారీగా చెల్లించాలి. ఎంచుకున్న కోర్సును బట్టి 250 నుంచి 500 యూరోల వరకు ట్యూషన్ ఫీజును చెల్లించాలి. అంతేకాకుండా ఇతర అంశాల్లో ఖర్చు కూడా స్వల్పంగా ఉంటోంది. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. వసతి, స్టడీ మెటీరియల్, దుస్తులు, ఇతర అవసరాల కోసం నెలకు 700 యూరోలు సరిపోతాయి.

డీఏఏడీ
జర్మనీలో విద్యకు సంబంధించి..జర్మన్ అకడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్(డీఏఏడీ) చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు కూడా భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. చాలా మంది ఔత్సాహికులకు అక్కడి విద్య, యూనివర్సిటీలు సంబంధిత అంశాలపై సరైన అవగాహన ఉండడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని డీఏఏడీ దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో ఏయే యూనివర్సిటీలు ఏయే కోర్సులను అందిస్తున్నాయి, వాటి ప్రవేశ ప్రక్రియ, వీసా తదితర అంశాలను క్షుణ్నంగా వివరిస్తారు. అంతేకాకుండా అక్కడి యూనివర్సిటీలు ప్రతిభావంతులకు అందజేస్తున్న స్కాలర్‌షిప్‌ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. ఈ అంశం కూడా భారతీయ విద్యార్థులను ప్రభావితం చేస్తుంది.

వీటికే ఓటు
భారతదేశం నుంచి ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్తున్న విద్యార్థుల్లో అత్యధిక మంది సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను ఎంచుకుంటున్నారు. వీటిలో మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, లైఫ్ సెన్సైస్, బయో సెన్సైస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సంబంధిత కోర్సులకు సరైన వేదిక జర్మనీ అని భారతీయ విద్యార్థులు భావిస్తున్నారు. ఈ కోర్సులు బ్యాచిలర్, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి

నాలుగు రకాల
జర్మనీలోని యూనివర్సిటీలను నాలుగు రకాలుగా విభజించారు. అవి.. యూనివర్సిటీస్ ఆఫ్ అప్లయిడ్ సెన్సైస్, కాలేజ్ ఆఫ్ ఆర్ట్, ఫిల్మ్ అండ్ మ్యూజిక్, ప్రైవేట్ యూనివర్సిటీలు/చర్చిలు నిర్వహించే యూనివర్సిటీలు, యూనివర్సిటీలు. ఈ యూనివర్సిటీలు ఇంగ్లిష్ మాధ్యమంగా దాదాపు 1,600 ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.

స్కోర్లు తప్పనిసరి
జర్మనీలో మాస్టర్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే టోఫెల్ (80/120), ఐఈఎల్‌టీఎస్ (6.5/9) స్కోర్ తప్పనిసరి. కొన్ని కోర్సులకు మాత్రం జీఆర్‌ఈ స్కోర్ అవసరం. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ ఆవశ్యకం.

జర్మన్ భాష
ఇక్కడి కంపెనీల్లో ఉద్యోగం చేయాలంటే జర్మన్ భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అయితే మాస్టర్ డిగ్రీ పూర్తి చేసే సరికి ఉద్యోగం పొందడానికి సరిపోయే జర్మన్ భాష వస్తుంది.

6-9 నెలల ముందు
జర్మనీ యూనివర్సిటీల్లో బోధన రెండు సెమిస్టర్ల విధానంలో కొనసాగుతోంది. ఇందులో సమ్మర్ సెమిస్టర్ ఏప్రిల్ నుంచి సె ప్టెంబర్ ఆఖరు వరకు..వింటర్ సెమిస్టర్ అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటోంది. కాబట్టి. ఆ సెషన్‌కు 6 నుంచి 9 నెలల ముందుగా సన్నాహాకాలను ప్రారంభించడం మంచిది.

వీసా
జర్మనీ ఎంబసీ లేదా కన్సల్టెన్సీ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, అకడమిక్ సర్టిఫికెట్లు, కావల్సిన పరీక్షల స్కోర్లు, జర్మన్ భాష పరిజ్ఞానం లేదా కోర్సులో భాగంగా నేర్చుకుంటానని నిరూపించే ధ్రువపత్రాలు, నివాస, వసతికి సరిపడ ఆర్థిక వనరులను చూపే పత్రాలతో వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. జర్మనీ చేరుకున్నాక విదేశీ విద్యార్థులు తప్పనిసరిగా రెసిడెన్స్ పర్మిట్ కలిగి ఉండాలి. ఇందుకోసం సంబంధిత రిజిస్ట్రేషన్ అథారిటీని సంప్రదించాలి.

టాప్ నైన్
భారతీయ విద్యార్థులు అత్యధిక మంది జర్మనీలో టాప్ నైన్ టెక్ యూనివర్సిటీలను (టీయూ) ఎంచుకుంటున్నారు. వీటిని మన దగ్గరి ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లతో సమానంగా భావించవచ్చు. వీటిలో ఆర్‌డ బ్ల్యూటీ హెచ్ ఆచెన్, టీయూ బెర్లిన్, టీయూ బ్రౌస్క్వేంగ్, టీయూ డ్రమ్స్‌స్టాడ్ట్, టీయూ డ్రెస్డెన్, లైబ్నిజ్ యూనివర్సిటట్ హనోవర్, కార్ల్సుచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టీయూ మ్యూనికన్, యూనివర్సిటట్ స్టుట్‌గార్ట్ యూనివర్సిటీలు ఉన్నాయి.

ముఖ్యమైన వెబ్‌సైట్లు:
Published date : 04 Oct 2014 11:20AM

Photo Stories