Skip to main content

Inspirational Story: తండ్రిని చెంపదెబ్బ కొట్టిన పోలీస్‌... జడ్జిగా మారి రివెంజ్‌..?

అధికారం ఉందనే అహం కావొచ్చు. మనల్ని ఎవడ్రా ఆపేదనే బలుపు ఉండొచ్చు. ఖాకీ డ్రస్‌ వొంటిమీద ఉంటే కొందరు ఎక్కడ లేని మిడిసిపాటు ప్రదర్శిస్తుంటారు. కనీసం మాట్లాడనీయకుండా కొడుతుంటారు. ఇలాంటి ఓ ఘటనే ఆ యువకునికి స్ఫూర్తినింపింది.
Bihar Judge Kamalesh

అన్యాయంగా తన తండ్రిని కొట్టిన పోలీసులను శిక్షించాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్లు మార్గాన్ని అన్వేషించాడు. తాను అనుకున్నట్లే అన్యాయంగా వ్యవహరించే పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇదేదో రీల్‌ స్టోరీ కాదు... రియల్‌ స్టోరీ 
నాలుగేళ్ల వయసులో తండ్రికి చెంపదెబ్బ...
నిజ జీవితంలో ఇలాంటి రివేంజ్‌ స్టోరీలు జరుగుతాయా? అని మనం అనుకుంటాం. కానీ సినిమాని తలపించే రియల్‌ రివెంజ్‌ స్టోరీలు కూడా ఉంటాయి. పెద్ద పెద్ద ప్రభుత్వ స్థలాలని కబ్జా చేస్తే ఏమీ చేయలేని ఈ పోలీసులు.. రోడ్డు పక్కన తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసే అమాయకుల మీద తమ ప్రతాపం చూపిస్తుంటారు. వాళ్లని కొట్టి అక్కడ నుంచి తరిమేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే కమలేష్‌ అనే యువకుడి జీవితంలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల వయసులో కళ్ల ముందు తండ్రిని పోలీసులు అన్యాయంగా కొడుతుంటే ఆ కుర్రాడు తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఈ అన్యాయాన్ని ఎదిరించాలని అనుకున్నాడు. దీని కోసం కష్టపడి చదివి ఏకంగా జడ్జి అయిపోయాడు.
ఎర్రకోట వెనకాల గుడిసెలో జీవనం
అది 1992వ సంవత్సరం. బీహార్‌ లోని మారుమూల ఉండే సహర్సా అనే గ్రామంలో చంద్రశేఖర్‌ యాదవ్‌ అనే ఒక పేదవాడు ఉన్నాడు. బతుకుదెరువు కోసం దేశ రాజధాని ఢిల్లీకి వలస వెళ్లాడు. కుటుంబంతో కలిసి ఎర్రకోట వెనకాల ఉన్న గుడిసెలో ఉండేవాడు. పొట్ట కూటి కోసం ఒక తోపుడు బండి మీద స్నాక్‌ ఐటమ్స్‌ అమ్ముతూ జీవనం సాగించేవాడు. తండ్రికి నాలుగేళ్ల కుమారుడు కమలేష్‌ కూడా చేదోడువాదోడుగా ఉండేవాడు. అయితే ఒక పోలీస్‌ అధికారి వచ్చి అతని తండ్రిని చెంప దెబ్బ కొట్టి తోపుడు బండిని తొలగించాలని చెప్పాడు. ఆ సమయంలో కమలేశ్‌కి ఆ పోలీస్‌ని కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఆ పోలీసోడ్ని వెనక్కి నెట్టాలని అనుకున్నాడు. కానీ తానేమీ చేయలేనని రియలైజ్‌ అయ్యాడు.
లాయర్‌ అవ్వాలనుకుని... 
అన్యాయాన్ని ఎదురించి, బాధితులు పక్షాల నిలబడాలని తపన అప్పుడే తనలో మొదలైంది. లాయర్‌ అయితే న్యాయం కోసం వాదించవచ్చు అని అనుకున్నాడు. ఒకసారి తన తండ్రి తనను కొట్టిన పోలీస్‌ ఆఫీసర్‌ మీద కోర్టులో కేసు వేశాడు. ఆ సమయంలో జడ్జి ఆ పోలీస్‌కు చుక్కలు చూపించాడు. అప్పుడు కమలేష్‌ తండ్రి.. ‘చూసావా, ఆ జడ్జి ఆ పోలీసోడికి ఎలా చెమటలు పట్టించాడో. అదే అధికారానికి ఉన్న పవర్‌’ అని చెప్పాడు. దీంతో లాయర్‌ అవుదామనుకున్న కమలేష్‌.. ఆ ఒక్క ఇన్సిడెంట్‌ తో జడ్జి అవ్వాలని ఫిక్స్‌ అయ్యాడు. తన తండ్రికి జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదంటే జడ్జి అవ్వాలని అనుకున్నాడు. అన్యాయాన్ని ఎదిరించాలంటే జడ్జి అవ్వడమే సరైనదని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా కష్టపడి చదివి జడ్జి అవ్వాలని నిర్ణయించుకున్నాడు.
జడ్జిగా ఎంపికై....
పేదరికాన్ని సైతం లెక్కచేయకుండా కష్టపడి చదివాడు. 2017లో బీహార్‌ లో న్యాయమూర్తుల నియామకం కోసం నిర్వహించిన జ్యుడిషియల్‌ సర్వీస్‌ పరీక్షలు రాశాడు. కరోనా కారణంగా 3 సంవత్సరాలు వృథా అయ్యింది. కానీ కమలేష్‌ నిరుత్సాహపడలేదు. మరోసారి ప్రయత్నించి బీహార్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌ ఎగ్జామ్స్‌లో 64వ ర్యాంక్‌ సాధించి జడ్జిగా ఎంపికయ్యాడు. ఏ పోలీస్‌ ఐతే తన తండ్రిని కొట్టాడో.. అదే పోలీస్‌ ఇప్పుడు కమలేష్‌ ఎదురైతే సెల్యూట్‌ కొట్టాల్సిందే. అదే జడ్జికి ఉన్న పవర్‌. పోలీస్‌ చేతిలో దెబ్బ తిన్న తండ్రి పగని.. జడ్జి అయ్యి పోలీసులు సైతం సెల్యూట్‌ చేసేలా కమలేష్‌ ఎదిగిన తీరు ఎంతో ఆదర్శనీయం. బస్తీ నుంచి కోర్టులో న్యాయం చెప్పే న్యాయమూర్తి స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు.

Published date : 09 Dec 2022 03:31PM

Photo Stories