Good News For TS Anganwadi Workers : శుభవార్త..ఇకపై 15000 అంగన్‌వాడీలకు...
ఈ సందర్భంగా అధికారులు అంగన్‌వాడీ కేంద్రాల ఉన్నతీకరణ వివరాలను మంత్రికి వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో కొనసాగుతున్న దాదాపు 15 వేల అంగన్‌వాడీ కేంద్రాలను తొలిదశలో ఉన్నతీకరించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్య (ప్రీప్రైమరీ) పాఠశాలలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంగన్‌వాడీ కేంద్రాల్లోనే..
2024-25 విద్యాసంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కార్యాచరణను రూపొందించింది. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లోనే చిన్నారులకు అక్షరాలు, పదాలను నేర్పించడం ప్రారంభిస్తే.. పాఠశాలల్లో చదవడం, రాయడం లాంటి ఇబ్బందులను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
అంగన్‌వాడీ భవనాలన్నీ ఒకే రంగు, ఒకే డిజైన్‌తో..
పూర్వ ప్రాథమిక విద్యాబోధనలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో కుర్చీలు, ఆట, పాటల వస్తువులు, పుస్తకాల కోసం ప్రభుత్వం రూ.30 కోట్ల వరకు ఖర్చుచేయనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదైన మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు ప్రత్యేక యూనిఫాం ఇవ్వనుంది. ఇందుకోసం డిజైన్లను పరిశీలిస్తోంది. అంగన్‌వాడీ భవనాలన్నీ ఒకే రంగు, ఒకే డిజైన్‌తో ఉండేలా ప్రణాళికలు తయారు చేస్తోంది.
పిల్లలను ఆకట్టుకునేలా భవనాలకు పెయింటింగ్ వేస్తూ గర్భిణులు, బాలింతలకు సూచనలు ఇచ్చేలా వివరాలను పొందుపరచనుంది. కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం.. శిశు సంక్షేమ శాఖ ద్వారా మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుపైనా అధ్యయనం చేయిస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించింది.
అంగన్‌వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యాబోధనపై శిశు సంక్షేమ శాఖ శిక్షణను ప్రారంభించింది. ప్రతి జిల్లాకు 10 మంది చొప్పున 330 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటికే 165 మందికి పూర్తయింది. మరో 105 మంది శిక్షణలో ఉన్నారు. మూడో దశలో మిగిలిన 60 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరంతా జిల్లాల్లోని మిగిలిన టీచర్లకు శిక్షణ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలను ఆగస్టులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బాలల విద్యపై ఇప్పటికే పనిచేస్తున్న పలు సంఘాలు, ఎన్జీవోలతో కూడిన కమిటీ.. సిలబస్, ప్రత్యేక మాడ్యూళ్లను ఖరారు చేసింది. కొత్త సిలబస్ ఆధారంగా పుస్తకాలను కూడా ముద్రిస్తోంది.
ఇక అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గతంలో తెలిపారు.
అలాగే రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను కేవలం మహిళల చేత భర్తీ చేయనున్నారు. ఏడవ తరగతి, పదో తరగతి అర్హతతో జిల్లా స్థానికత గల పెళ్లి అయిన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్ ఉంటే.. మినీకేంద్రాల్లో మాత్రం ఒక టీచర్ ఉంటారు. ఇక్కడ హెల్పర్ ఉండరు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో అక్కడ హెల్పర్ పోస్టు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు అప్‌గ్రేడ్ వివరాలు పంపింది. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చడంతో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ కూడా పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్ల నియామకం చేపట్టొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్ పాలసీతో దాదాపు రెండున్నర వేలమంది టీచర్లు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఈ క్రమంలో అన్ని రకాల్లో కలిపి నాలుగువేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే కొన్ని జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నోటిఫికేషన్లు జారీ చేసి.. భర్తీ ప్రక్రియ ప్రారంభించింది.అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.
మినీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌తో హెల్పర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, అంతకుముందే అంగన్‌వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది.
Tags
- anganwadi jobs
- telangana anganwadi jobs recruitment 2024
- telangana anganwadi benefits
- telangana anganwadi centers development
- telangana minister seethakka
- minister seethakka anganwadi jobs
- minister seethakka anganwadi jobs news
- ts anganwadi jobs 2024
- AnganwadiCentres
- GovernmentSchools
- Upgradation
- FirstPhase
- 15
- 000 centres
- Women and Child Welfare Minister Sitakka
- sakshieducation updates