TS Gurukulam Jobs : వారంలోపు.. 11000లకు పైగా గురుకుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..! టెట్‌తో ముడి.. కానీ..
ప్రభుత్వం అనుమతించిన పోస్టుల భర్తీకీ సంబంధించిన ప్రతిపాదనలను గురుకుల సొసైటీలు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు సమర్పించాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనల మేరకు పోస్టుల వారీగా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాలను పరిశీలించేందుకు నియామకాల బోర్డు సన్నద్ధమైంది. ఈ ఏడాదికి మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మంత్రిమండలి ఆమోదించిన దాదాపు 2,591 ఖాళీ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు వచ్చిన పది రోజుల్లోపు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ముందస్తు కసరత్తు పూర్తిచేసింది.
చదవండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు
ఆర్థికశాఖ నుంచి..
సంక్షేమశాఖల వారీగా ప్రతిపాదనలు పరిశీలించిన బోర్డు, బీసీ గురుకులాలకు సంబంధించి ఆర్థికశాఖ నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అదనపు పోస్టులకు త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నది. ఈ ఉత్తర్వులు వచ్చిన వెంటనే ప్రతిపాదనలు నియామక బోర్డుకు పంపించేలా.. బీసీ గురుకుల సొసైటీ ఇప్పటికే రోస్టర్, జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులను గుర్తింపు పూర్తిచేసింది.
☛ త్వరలో టీఎస్ గురుకులం.. ఈ టిప్స్ పాటిస్తే మీకు జాబ్ తథ్యం..||TGT Best Preparation Tips
గురుకుల విద్యాసంస్థలలో..
సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్‌ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో సొసైటీలవారీగా మంజూరు చేసిన పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రూపొందించిన సొసైటీలు బోర్డుకు సమర్పించాయి.
ఎక్కువ ఉద్యోగాలు..
ప్రస్తుతం గురుకుల కొలువుల్లో అత్యధికంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 9,096 పోస్టులకు అనుమతులు ఇవ్వగా వాటిలో మూడో వంతుకు పైబడిన ఖాళీలు మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో ఉన్నాయి.
టెట్‌తో ముడి.. కానీ..
గురుకుల టీజీటీ పోస్టులకు టెట్ మెరిట్‌తో ముడిపడి ఉంది. ఈ క్రమంలో టెట్ ఫలితాలు సైతం వెలువడటంతో ఆయా పోస్టుల నియామకాలకు మార్గం సుగమమైంది.
పోస్టుల వివరాలు ఇవే..
కొత్తగా ఏర్పాటైన బీసీ గురుకులాల్లో 2,591 వేలకు పైగా పోస్టులను గుర్తించి ప్రతిపాదనలకు సీఎం, మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో బీసీ గురుకులాల్లో అప్పటికే ఆమోదించిన పోస్టులు 3,870తో కలిపి అత్యధికంగా 6,461 పోస్టులు రానున్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖలో 2,267, గిరిజన సంక్షేమశాఖలో 1,514, మైనార్టీ సంక్షేమశాఖలో 1,445 పోస్టులు భర్తీ కానున్నాయి.
ఒకేసారి ఉద్యోగ ప్రకటనలు..
అదనపు పోస్టులతో కలిపి ఒకేసారి ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి. ఇవి వెలువడిన తరువాత కనీసం మూడు నెలల సమయం ఉండేలా బోర్డు జాగ్రత్తలు పడుతోంది. గురుకులాల్లో ఒక్కో అభ్యర్థి అర్హతల మేరకు రెండు, ఆపైన ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో అన్ని పోస్టులకు సన్నద్ధమై, పరీక్షలు రాసేలా షెడ్యూలు రూపొందించనుంది. ఉద్యోగ ప్రకటనలు ఒకేసారి ఇచ్చినప్పటికీ తొలుత పై నుంచి దిగువ స్థాయి పోస్టులకు పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షల ఫలితాల్లోనూ తొలుత ఉన్నత స్థాయి పోస్టులకు వెలువరించనున్నది. ఆ పోస్టుల నియామకాలు పూర్తైన తరువాత దిగువ స్థాయి పోస్టుల ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా గురుకులాల్లో ఖాళీలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.