TS Government Jobs 2023 : వెంటనే ఉద్యోగ నియామకాలకు సీఎస్ కీలక ఆదేశాలు.. అలాగే పోలీసు ఉద్యోగాలను కూడా..
సర్వీసు అంశాలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లకు సంబంధించిన పలు శాఖలలో పెండింగ్ అంశాలను తక్షణమే పరిష్కరించి ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఉద్యోగ నియామకాలపై బీఆర్‌కేఆర్ భవన్‌లో ఆమె ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
పోలీసు ఉద్యోగాలను సెప్టెంబర్‌లోగా..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 17,516 పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా, ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేశామని, ఏప్రిల్‌లో రాత పరీక్షలు పూర్తి చేసి సెప్టెంబర్‌లోగా నియామకాలు జరుపుతామని సీఎస్ పేర్కొన్నారు. మెడికల్, హెల్త్ సర్వీస్ బోర్డు ద్వారా ఆగస్టులోగా 10 వేల మేర వివిధ ఉద్యోగ ఖాళీలను నింపనున్నట్టు తెలిపారు.
గ్రూప్ 2, 3, 4 రాత పరీక్షలను..
రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 10 వేల పోస్టులకు సెప్టెంబరులోగా నియామక ప్రక్రియ పూర్తిచేయనున్నట్టు వివరించారు. అలాగే గ్రూప్ 2, 3, 4 రాత పరీక్షలు జులై నెలాఖరులోగా పూర్తిచేస్తామని అధికారులు సీఎస్‌కు తెలిపారు. నవంబరు నెలాఖరు నాటికి సర్వీస్ కమిషన్‌కు సంబంధించిన అన్ని రాతపరీక్షలు పూర్తిచేస్తామని చెప్పారు. ఈ భేటీలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, రోనాల్డ్ రోస్, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ శ్రీనివాసరావు, వర్సిటీ కామన్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పాల్గొన్నారు.
ప్రభుత్వం సీరియస్‌గా..
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం దుమారం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సంబంధించి పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. లీకేజీపై లోతైన దర్యాప్తు కోసం కేసును నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్షలకు సంబంధించిన పేపర్ల లీకేజీ అంశాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.