Transfers: వీవీపీ ఉద్యోగులకు స్థానచలనం
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు, పారామెడికల్, నర్సింగ్, నాలుగో తరగతి, మినిస్టీరియర్ సిబ్బందిని బదిలీకి రంగం సిద్ధమైంది. ఈమేరకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దాస్పత్రి నుండి పూర్తిస్థాయిలో ఉద్యోగులను జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిల్లో బదిలీ చేయనుండగా, వారు ఆప్షన్స్ ఇస్తున్నారు.
చదవండి: Dr Mansukh Mandaviya: 2014 నుంచి 110% పెరిగిన సీట్లు
మెడికల్ కాలేజీ మంజూరుతో..
ఖమ్మం జిల్లా ఆస్పత్రికి అనుసంధానంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. పాత కలెక్టరేట్, ఆర్‌అండ్‌బీ, పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయం స్థలాలను కలుపుకుని మెడికల్ కళాశాల ఏర్పాటు చేయనుండగా, పనులు చివరి దశకు చేరాయి. ఈ విద్యాసంవత్సరమే 100 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయనుండడంతో నీట్ ర్యాంకర్లకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది.
ఈమేరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధి లోకి వెళ్లడంతో క్రమంగా మెడికల్ కాలేజీలో కావాల్సిన ఉద్యోగులను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, 23మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 27మంది సీని యర్ రెసిడెంట్లు, ఐదుగురు హౌస్ సర్జన్లు, 15మంది డీఆర్‌పీలను కేటాయించారు. మరో 60 మంది సీనియర్ రెసిడెంట్లు, 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది త్వరలో రానున్నారు.
చదవండి: Medical Health Department: వైద్య విద్య యూజీ కోర్సుల ఫీజుల ఖరారు
199 మందికి స్ధానచలనం
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లడంతో ఇన్నాళ్లు ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్య విధా న పరిషత్ ఉద్యోగులను క్రమంగా బదిలీ చేయను న్నారు. వీరిని శాఖ పరిధిలోని ఇతర ఆస్పత్రులకు బదిలీ చేయనుండగా.. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో ఆప్షన్లు పెట్టుకుంటున్నారు.
మొత్తంగా జిల్లా ఆస్పత్రి నుంచి 199 మందికి స్థానచలనం కలగనుంది. వీరిలో 15 మంది మినిస్టీరియల్ సిబ్బంది, 25మంది నాలుగో తరగతి ఉద్యోగులు, 12మంది ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్ తదితర పారామెడికల్ సిబ్బంది, వంద మంది నర్సింగ్ ఉద్యోగులేకాక 47 మంది వైద్యులు ఉన్నారు.