Skip to main content

Transfers: ఉద్యోగులకు తీపికబురు.. నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు..

కై లాస్‌నగర్‌: దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ బదిలీ కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు తీపికబురు అందించింది.
employees Orders lifting ban on general transfers

సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ జూలై 4న‌ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులకు బదిలీ అనివార్యం కానుంది.

ఈ క్రమంలో జిల్లాలో పలువురు జిల్లాస్థాయి అధికారులతో పాటు ఉద్యోగులకు స్థానచలనం కలిగే అవకాశముంది. సర్కారు నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

చదవండి: TSPSC Group-1 Mains 2024 Selection Ratio : 1:50 నిష్పత్తిలోనే గ్రూప్-1 మెయిన్స్‌కి ఎంపిక‌.. ఫ‌లితాలు విడుద‌ల ఎప్పుడంటే..?

40శాతానికి మించకుండా బదిలీలు

12ఏళ్లుగా ఎలాంటి బదిలీలు లేకపోవడంతో పలువురు జిల్లా స్థాయి అధికారులతో పాటు ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకే చోట పాతుకుపోయారు. కొన్ని శాఖల్లోని అధికారులైతే 20 ఏళ్లుగా అదే చోట పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి రెండేళ్ల సర్వీస్‌ పూర్తి కాని ఉద్యోగులను బదిలీ చేయవద్దని సూచించిన ప్రభుత్వం ఒక స్థానంలో నాలుగేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారిని మాత్రం తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపునిచ్చింది.

అయితే కార్యాలయ విధులకు అటంకం కలగకుండా ఉండేలా ఏ క్యాడర్‌లోనైనా 40శాతానికి మించి బదిలీలు చేయవద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో దీర్ఘకాలంగా పాతుకుపోయిన వారితో పాటు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ తప్పనిసరిగా బదిలీ అయ్యే అవకాశం ఉంది.

గతంలో పలుమార్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేక నిరాశలో ఉన్న ఉద్యోగులు, అధికారులు సర్కారు నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుకూలమైన చోటుకు వెళ్లేందుకు నెల ముందు నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టిన వారు ప్రస్తుతం ముమ్మరం చేశారు.

ఆ అధికారుల పరిస్థితేంటో...

ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన, ఇతర జిల్లాల నుంచి మన జిల్లాకు బదిలీపై వచ్చిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌ అధికారులు తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఎన్నికల నిర్వహణ కోసమే ప్రభుత్వం తమను బదిలీ చేసినందున తిరిగి పాత పోస్టింగ్‌ చోటికే పంపించేలా చర్యలు ఉంటాయనే గంపెడాశతో ఉన్నారు. అయితే ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం వీరి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. వారిని తమ సొంత ప్రాంతాలకు బదిలీ చేస్తుందా.. లేక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు కొనసాగిస్తుందా అనేది ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

15 రోజుల పాటు అవకాశం

ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు 15 రోజుల పాటు గడువు విధించింది. జూలై 5న బదిలీల ప్రక్రియను ప్రా రంభించి 20వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించింది. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ప్రక్రియ జూలై 5 నుంచి మొదలు కానుంది.

ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సూచించింది. సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలను కార్యాలయ నోటీసుబోర్డుపై ఉంచడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ ఆయా శాఖల వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా పొందుపరచాలని సూచించింది.
 

Published date : 05 Jul 2024 10:00AM

Photo Stories