Skip to main content

ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌

ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
Green signal for compassionate appointments in APSRTC
ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌

కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న 896 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, జిల్లా కలెక్టర్ల పూల్‌ కింద కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు Principal Secretary, Andhra Pradesh Transport Department MT Krishna Babu జూలై 12న ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ముందు సర్వీసులో ఉండగా.. 896 మంది ఉద్యోగులు మరణించారు. 2016 నుంచీ సర్వీసులో ఉండి.. మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. విలీనమైన తరువాత సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టింది. కాగా అంతకుముందు 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న 896 కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, కలెక్టర్‌ పూల్‌కింద ఉన్న ఉద్యోగాల్లో నియమించేందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

  • పెండింగ్‌లో ఉన్న 896 మంది కారుణ్య నియామకాల జాబితాను ఆర్టీసీ ఎండీ సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపుతారు.
  • వారిలో అర్హులను గుర్తించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కలెక్టర్లు నియమిస్తారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఆర్టీసీ ఎండీకి పంపిస్తారు.
  • అలా మిగిలిన వారి జాబితాలోని అర్హతలను బట్టి ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లుగా నియమిస్తారు. అప్పటికి ఇంకా మిగిలి ఉంటే ఆ జాబితాను తిరిగి సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపుతారు.
  • ఆర్టీసీ ఎండీ నుంచి వచ్చిన జాబితాలో ఉన్నవారికి కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలలో భర్తీ చేస్తారు. 

సీఎం గొప్ప నిర్ణయం తీసుకున్నారు

ఆర్టీసీలో 2016 నుంచి పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపుతూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప విషయం.
– చెంగయ్య, అధ్యక్షుడు, ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ యూనియన్

సీఎం జగన్ కు కృతజ్ఞతలు

పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలపై సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. ప్రభుత్వంలో విలీనానికి ముందు సర్వీసులో ఉండి మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల పట్ల సానుకూల దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకున్నారు.
– పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు

Published date : 13 Jul 2022 02:07PM

Photo Stories