Skip to main content

Good News: ఈ శాఖలోని 14,200 ఉద్యోగాల భ‌ర్తీకి సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌

సాక్షి, తాడేపల్లి: వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండకూడదనే ఉద్దేశంతో వైద్య, ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.  ఈ మేరకు అక్టోబరు 1 నుంచి ప్రక్రియ మొదలుపెట్టి నవంబరు 15 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. 


కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సెప్టెంబ‌ర్ 24వ తేదీన‌(శుక్రవారం) సమీక్ష చేపట్టారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుతం ఉన్న అవసరాలు తదితర వివరాలను కూడా సీఎం తెలుసుకున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ...
ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నాం, తీరా అక్కడ చూస్తే.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం. ఇకపై దీనికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలి. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని' అధికారులకు సీఎం జగన్‌ నిర్దేశం చేశారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాలి. ఒక డాక్టరు సెలవులో వెళ్తే ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా.. తగిన సంఖ్యలో వైద్యులను నియమించండి. డాక్టరు సెలవు పెడితే.. రోగులకు వైద్యం అందని పరిస్థితి కానీ, తోటి డాక్టర్లపై భారం పడే పరిస్థితి కానీ ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. 

భారీ రిక్రూట్‌మెంట్‌కు..
వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ దాదాపు 14,200కు పైగా పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ తెలిపారు. ఈ ప్రక్రియను అక్టోబర్‌ 1న మొదలు పెట్టి నవంబర్‌ 15 నాటికి కార్యాచరణ పూర్తిచేసేలా ఉండాలన్నారు.

Published date : 25 Sep 2021 06:44PM

Photo Stories