Police Officer Noujisha: సాయం కోసం స్టేషన్‌కి వెళ్లిన ఆమె.. ఇప్పుడు పోలీస్ ఆఫిసర్..
కాలం.. ఎప్పటిలాగే తన ప్రయాణాన్ని సాగించింది. కాలంతోపాటే పరుగెత్తిన నౌజిషాకు పెళ్లి వయసొచ్చింది. కలలు కనింది ఆమె... తన భర్తను గురించి, భవిష్యత్‌ను గురించి. కాబోయే భర్తకు తనకు కెరీర్ పట్ల ఉన్న ఆకాంక్షను తెలియచేసింది. అతడు అంగీకరించాడు... అప్పుడు ఆమె ముఖంలో వెన్నెల వెలుగులు మెరిశాయి. ఇంతలో పెళ్లయింది. జీవితంలో ఎదురుకాకూడని కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి. మునిగిపోతున్నా.. ఊపిరి ఆగిపోతున్నా.. లెక్క చేయకుండా.. ఆ కష్టాల కడలిని ఈదింది. ఈ రోజు ఆమె కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పూర్తి చేసి పోలీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తోంది. కష్టాన్ని జయించాలి, జీవితాన్ని గెలవాలి. తననే ఆదర్శంగా తీసుకోమని కూడా చెబుతోంది. తననే ఆదర్శంగా తీసుకోమని కూడా చెబుతోంది 32 ఏళ్ల నౌజిషా.
బావిలో దూకేయాలనుకుంది..
నౌజిషాది కేరళలోని కోజికోడ్. ఆమె జీవితంలో 2016 అత్యంత క్లిష్టమైన సంవత్సరం. అప్పటికి మూడేళ్ల వైవాహిక జీవితంలో అత్తింటి వారి హింస, వేధింపులతో జీవితం మీద విరక్తి చెందిన నౌజిషా బావిలో దూకేయాలనుకుంది. ఆ క్షణంలో కాని ఆమెకు తన కొడుకు గుర్తుకు రాకపోయి ఉంటే జరగరాని ఘోరం జరిగిపోయేది. బిడ్డతోపాటు తన చదువు, తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న ఆశలు... అన్నీ గుర్తుకువచ్చాయి. అత్తింటి వారి ఆదరణ పొందలేకపోయినంత మాత్రాన జీవితాన్ని బలి తీసుకోవాలా? అనే ఆలోచన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. వెంటనే భర్తకు విడాకుల నోటీస్ పంపించింది. తన చదువును కొనసాగించింది.
ఉన్నత ఉద్యోగాలకు టాటా చెప్పి.. పల్లెకు హాయ్ చెప్పిన యువజంట..ఎందుకంటే..?
ఆమెను అంధకారంలో ఉంచడమే అత్తింటి వారి..
నౌజిషా పెళ్లి నాటికి బీఎస్సీ మాథ్స్, కంప్యూటర్స్‌లో మాస్టర్స్ చేసి ఏడాది పాటు ఓ కాలేజ్‌లో గెస్ట్ లెక్చరర్‌గా ఉద్యోగం చేసింది. పెళ్లి చూపుల సందర్భంగా ఆమె వరుడితో తనకు కెరీర్ పట్ల ఉన్న ఆకాంక్షను తెలియచేసింది. అప్పుడందరూ అంగీకరించారు. పెళ్లి అయిన తర్వాత మాట మార్చేయడంతో నౌజిషాకి ఏమీ పాలుపోలేదు. పైగా వంటగది తప్ప మరేమీ ఆలోచించకు అని తెగేసి చెప్పేశాడు భర్త. ఎందుకిలా చేస్తున్నారో మొదట అర్థం కాలేదు. తర్వాత తెలిసిందేమిటంటే... భర్తకు ఉన్న వివాహేతర సంబంధం గురించి నౌజిషాకు తెలియనివ్వకుండా ఆమెను అంధకారంలో ఉంచడమే అత్తింటి వారి దురాలోచన అని.
ఏ బంధం ఆపిందో కానీ..
నౌజిషా నోరు తెరిచి మాట్లాడితే కొట్టేవరకు వెళ్లింది ఇంట్లో వాతావరణం. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ... ‘‘పుట్టింటికి వెళ్తే... కూతురు పుట్టింటికి వచ్చేయడాన్ని మా అమ్మానాన్న అవమానంగా భావిస్తారేమోనని ఆందోళన పడ్డాను. దాంతో ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదనిపించింది. అయితే ఏ బంధం ఆపిందో కానీ, నేను ఆ పని చేయలేదు. బిడ్డతో అమ్మ వాళ్లింటికి వెళ్లిపోయాను. పుట్టింటి వాళ్లు నా కష్టాన్ని అర్థం చేసుకుని నన్ను కడుపులో దాచుకున్నారు. ఆ క్షణంలో నేను తెలివిగా వ్యవహరించానని ఆ తర్వాత చాలాసార్లు అనిపించింది’’ అంటోంది నౌజిషా.
తండ్రి కూరగాయాల వ్యాపారి.. కొడుకు అమెజాన్ కంపెనీలో పెద్ద ఉద్యోగం.. వీళ్ల స్టోరీ చూస్తే..
విజయం ఆమెకు దూరంగా..
నౌజిషా పుట్టింటికి వెళ్లింది కానీ పుట్టింటి వాళ్ల మీద ఆధారపడి బతికేయాలనుకోలేదు. లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరింది. పగలు ఉద్యోగం చేస్తూ, సాయంత్రం కేపీఎస్‌సీ కోచింగ్ క్లాసులకు హాజరైంది. 2018లో తొలి ప్రయత్నంలో రాత పరీక్ష పూర్తయింది, కానీ ఫిజికల్ ఎగ్జామ్‌లో విజయం ఆమెకు దూరంగా ఉండిపోయింది. మరో ప్రయత్నంలో 2020లో విజయం సాధించింది. గతేడాది ఏప్రిల్‌లో ట్రైనీ పోలీస్ ఆఫీసర్‌గా విధుల్లో చేరింది.
నేను చెప్పేది ఒక్కటే... వేధింపులను..
‘‘భర్త వేధింపుల నుంచి రక్షించమని పోలీసులను ఆశ్రయించిన నేను ఇప్పుడు పోలీస్ అధికారినయ్యాను. వేధింపులకు గురవుతున్న మహిళలకు నేను చెప్పేది ఒక్కటే... వేధింపులను మౌనంగా భరించకండి. నోరు తెరవండి. గొంతు పెగల్చండి. మిత్ర హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయండి’ అని ధైర్యం చెబుతోంది నౌజిషా.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్