Skip to main content

PRC: ఉద్యోగుల ఆశలకు అనుగుణంగానే పీఆర్సీ

వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) విషయంలో ఉద్యోగులకు స్పష్టత ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు.
PRC
ఉద్యోగుల ఆశలకు అనుగుణంగానే పీఆర్సీ

రాష్ట్రంలో ఉద్యోగుల ఆశలకు అనుగుణంగానే పీఆర్సీ అమలు ఉంటుందన్నారు. సచివాలయ ప్రాంగణంలో నవంబర్‌ 11న ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్‌ 29న జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇచ్చిన తర్వాతే ప్రభుత్వంతో చర్చిస్తామని సీఎస్‌కు ఉద్యోగ సంఘాలు చెప్పాయని, దీంతో.. వారంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి నివేదికపై స్పష్టత ఇస్తామని సీఎస్‌ చెప్పారన్నారు. కొన్ని అనివార్య కారణాలతో సీఎం మాట్లాడడం కుదర్లేదని.. దీంతో ఉద్యోగ సంఘాల వినతి మేరకే నవంబర్‌ 11న సాయంత్రం సీఎస్‌ ముఖ్యమంత్రిని కలిశారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో.. గత జేఎస్‌సీ సమావేశానంతరం పరిణామాలు, సీఎంతో చర్చించిన అంశాలను వివరించేందుకు నవంబర్‌ 12న మధ్యాహ్నం మరోసారి అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం నివేదిక ఇవ్వకుండా పీఆర్సీ అమలు సాధ్యంకాదన్నారు. నివేదికపై అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి చర్చించుకుని సమావేశంలో వ్యక్తమైన సలహాలు, సూచనలను తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని వివరించారు. కేంద్రం హెచ్‌ఆర్‌ఏను తగ్గించడం, తెలంగాణ కూడా తక్కువ ఇస్తున్నందున రాష్ట్రంలో హెచ్‌ఆర్‌ఏ విషయంలో ఉద్యోగులకు నష్టం జరగకుండా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుండటంతో పీఆర్సీ నివేదిక ఆలస్యమవుతోందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగులందరూ పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సానుకూల పరిస్థితులను అర్థంచేసుకోకుండా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం, అధికారులపై ఆరోపణలు చేయడం బాధాకరమని విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కేవలం మైలేజీ పెంచుకునేందుకు అనవసర నిరసనలు చేస్తున్నారన్నారు. తాము పీఆర్సీపై ఆందోళన చెందడంలేదన్నారు.

చదవండి:

EWS: ఈడబ్ల్యూఎస్‌ సీట్లన్నీ కన్వీనర్‌ కోటాలోనే

Good News: ఉద్యోగాల్లో పదేళ్ల వయోపరిమితి సడలింపు

Published date : 12 Nov 2021 01:13PM

Photo Stories