Job Security: ఉద్యోగ భద్రతపై త్వరలోనే నిర్ణయం
సచివాలయంలోని తన చాంబర్‌లో కాంట్రాక్ట్ లెక్చరర్ల యూనియన్ ప్రతినిధులతో సెప్టెంబర్ 27న ఆయన సమావేశమయ్యారు. డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్ల సమస్యలపై యూనియన్లు వినతులు సమర్పించిన నేపథ్యంలో మంత్రి వారితో చర్చించారు. తమ సమస్యలపై వెంటనే స్పందించి చర్చలు జరిపిన మంత్రికి యూనియన్ల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక వేతనాలు, ఇతర అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నామన్నారు. ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని కోరారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరమైనా వెళతారన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై వర్కింగ్ కమిటీ వేశామని, ఈలోగా కోవిడ్ రావటంతో పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు. మార్చి 2022 వరకు కాంట్రాక్ట్ ఉన్నందున అప్పటివరకు ఇబ్బంది లేదని, ఈ లోగా ముఖ్యమంత్రితో మాట్లాడి తదుపరి విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పారు. ఎయిడెడ్ పోస్టుల ద్వారా ఎంతమంది వస్తున్నారో? ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఎటువంటి ఇబ్బందులు వస్తాయో సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ 28న తలపెట్టిన ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి:
Good News: ఈ శాఖలోని 14,200 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్