Fake Website: ఫేక్ వెబ్‌సైట్‌తో ఫీజు వసూలు
లేబరేటరీ టెక్నీషియన్స్, లేబరేటరీ అటెండెంట్ పోస్టుల భర్తీ పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండటంతో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు రంగంలోకి దిగి నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ఇటీవలే 168ల్యాబ్ టెక్నీషియన్స్, 168 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసింది. కాస్త పేరు మార్చి ఇవే పోస్టులు భర్తీ చేస్తున్నట్టుగా నిరుద్యోగులకు టోకరా వేసేందుకు పశుసంవర్ధక శాఖ పేరిట క్రియేట్ చేసిన ఓ వెబ్‌సైట్ ద్వారా వసూళ్లు చేపట్టారు. ఆసక్తి కల్గిన వారు రూ.950 చొప్పున ఫీజులు చెల్లించాలంటూ ఆ వెబ్‌సైట్‌లో పేర్కొనడంతో వేలాది మంది నిరుద్యోగులు ఫీజు చెల్లించారు. కొంతమందికి అనుమానం వచ్చి విజయవాడలోని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి ఆరాతీయగా.. అసలు విషయం తెలిసింది. అధికారులు ఆధారాలతో సహా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు కంప్యూటింగ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు నోటీసులివ్వడం ద్వారా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయించారు. ఇస్మాత్ శంకర్ పేరిట బెంగళూరు చిరునామాతో ఈ ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ అయినట్టుగా గుర్తించామని సైబర్ క్రైమ్ ఎస్‌ఐ రచన తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను బెంగళూరు పంపినట్టుగా తెలిసింది. ఇదిలా ఉండగా, పోస్టుల భర్తీ పేరిట డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న ఫేక్ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ చెప్పారు.
చదవండి:
1,271 Jobs in TSSPDCL: విద్యుత్ కొలువులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు!
AFCAT 2022: వైమానిక దళంలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి... నెలకు రూ.1,77,500 వరకు వేతనం..