Skip to main content

Asha Workers Demands: ఆశ వర్కర్లు డిమాండ్లు ఇవే.. ఫిక్స్‌డ్‌ వేతనం ఇన్ని వేలు?

సుల్తాన్‌బజార్‌ (హైదరాబా ద్‌): వైద్య ఆరోగ్యశాఖలో ఆశ వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనాలు చెల్లించాలని కోరుతూ జూలై 30న‌‌ ఆశ వర్కర్లు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Asha Workers

వేలాది మంది ఒక్కసారిగా కోఠి మహిళా కళాశాల చౌరస్తాలో బైఠాయించడంతో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో స్తంభించిపోయాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ ఆందోళనలో పోలీసులకు, ఆశ వర్కర్లకు తీవ్ర వాగ్వివాదం, తోపులాటలు జరిగాయి. ఆశ  వర్కర్లు గేట్లు ఎక్కి డీఎంహెచ్‌ఎస్‌ క్యాంపస్‌లోకి దూసుకుపోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. క్యాంపస్‌లోకి దూసుకుపోయిన వారు కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించారు.

అక్కడ కూడా నినాదాల హోరు కొనసాగింది. దీంతో కమిషనర్‌ బయటకు వచ్చి ఆశ వర్కర్ల నాయకురాలితో చర్చలు జరిపారు. వారి సమస్యలన్నీ తమ దృష్టిలో ఉన్నాయని, అన్ని సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామని కమిషనర్‌ హామీ ఇవ్వడంతో ఆశాలు తమ ఆందోళన విరమించుకున్నారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

చదవండి: ASHA Workers: ఆశాలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు.. ప్ర‌స్తుతం వారి వేత‌నం ఎంతంటే..?

ఈ సందర్భంగా తెలంగాణ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి మాట్లాడుతూ, ఆశ వర్కర్లకు 15 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు, ఫిబ్రవరి 9న ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆశ వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర సమస్యలు పరిష్కరించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రతి సంవత్సరం 20 రోజుల వేతనంతో కూడా సాధారణ సెలవులు ఇవ్వాలన్నారు. డిమాండ్లపై కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు జయలక్ష్మి తెలిపారు.

Published date : 31 Jul 2024 04:12PM

Photo Stories