AP Govt Schools: భాషా పాఠాలకూ 'డిజిటల్' రూపం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధించే భాషా పాఠాలు డిజిటల్ రూపం సంతరించుకున్నాయి. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు అనువుగా ఈ–పాఠాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సెల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రూపొందించింది. ఇప్పటికే సబ్జెక్టు పాఠ్యాంశాలను ఈ కంటెంట్‌లో బోధిస్తుండగా, ఇప్పుడు తెలుగు, ఇంగ్లిష్, హిందీ డిజిటల్ పాఠ్యాంశాలను సైతం సిద్ధం చేసింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారి ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు ఆయా భాషల పాఠ్యాంశాలను తయారు చేసింది.
పదో తరగతి మినహా మిగిలిన తరగతుల కంటెంట్‌ను ప్రభుత్వ పాఠశాలలకు అందించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది నుంచి ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్‌పీ) ద్వారా డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. సబ్జెక్టు పాఠాలను డిజిటల్ రూపంలోకి మార్చి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించింది. ఇప్పటివరకు ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. వచ్చే ఏడాది పదో తరగతి ఇంగ్లిష్ మీడియం పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆ తరగతి పాఠాలను సైతం డిజిటల్ రూపంలో సిద్ధం చేశారు.
చదవండి: NAAS Exams for Students: విద్యార్థులకు నాస్ పరీక్షలు
యూట్యూబ్‌లోనూ..
విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి కలిగించేందుకు డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ‘ఈ–విద్య’ చానెళ్ల ద్వారా టీవీల్లో కూడా ప్రసారం చేస్తోంది. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానెల్ ద్వారాను, ఆరు నుంచి 9వ తరగతి వరకు మరో చానెల్ ద్వారాను పాఠ్యాంశాలను టెలీకాస్ట్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్‌లోని ‘ఈ–పాఠశాల’ చానెల్ ద్వారా ఎప్పుడు కావాలన్నా పాఠాలు వినేందుకు అవకాశం కల్పిస్తూ అన్ని పాఠాలను అప్‌లోడ్ చేశారు.
ఆన్‌లైన్‌లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్‌ను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్‌పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. అన్ని మాధ్యమాల్లోను ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను ఉంచారు.
చదవండి: Literature Competitions: విద్యార్థులకు సాహిత్య పోటీలు
అందుబాటులోకి వీడియో కంటెంట్
పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని పాఠాల కంటెంట్‌ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని విద్యార్థులకు ఐఎఫ్‌పీల్లో బోధించడంతో పాటు, ట్యాబ్స్‌లోను అప్‌లోడ్ చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్, కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్–ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు తెలుగు, ఇంగ్లిష్, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వారికి తెలుగు, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాల కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చారు.
Tags
- AP Govt Schools
- Interactive Flat Panel
- teaching
- Education News
- andhra pradesh news
- Youtube
- E-lessons
- english medium
- Digital lessons
- Students
- Andhra Pradesh State Council for Education Research and Training
- E-textbooks
- Digital education
- Language curriculum digitalization
- Government teachers' involvement
- lass 3 to Class 9 syllabus
- Telugu language
- english language
- Hindi Language
- Digital learning materials
- Education technology
- Sakshi Education Latest News