Academic Calendar: సిలబస్‌ను కచ్చితంగా పూర్తి చేయాలి
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): అకడమిక్ క్యాలెండర్‌లో నిర్దేశించిన సిలబస్‌ను కచ్చితంగా పూర్తి చేయాలని అర్బన్ రేంజ్ డీఐ బి.దిలీప్‌కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం స్థానిక డీఎంహెచ్ స్కూల్‌లో జరిగిన కాంప్లెక్స్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తరగతి గదిలో మొబైల్ వాడకాన్ని నిషేధించిన నేపథ్యంలో ఉపాధ్యాయులంతా తమ ఫోన్లను సైలెంట్ మోడ్‌లో ఉంచి హెచ్‌ఎంకు అందజేయాలన్నారు. గత కాంప్లెక్స్ సమావేశంలో ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎంఎల్‌తో ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. హాజరు పుస్తకంలో కాంప్లెక్స్ పరిధిలో స్కూళ్లు, మొదటి, రెండు రోజుల్లో ఉపాధ్యాయుల హాజరు విషయాలపై పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం స్కూల్ కాంప్లెక్స్ కార్యదర్శి పరస జగన్నాథరావు అజెండా వివరించారు. కాంప్లెక్స్ చైర్మన్ ఎన్.రాజాప్రశాంత్, సీఆర్పీ జయంతి శాస్త్రి, రిసోర్స్ పర్సన్లు వరహాగిరి కృష్ణ మోహన్, కె.రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.