Children's Education: చిన్నారుల చదువుకు మెరుగులు
రాయవరం: ఒక భవనం నిర్మాణం చేసేటప్పుడు పునాది బలంగా ఉండే విధంగా చూస్తారు. పునాది బలంగా ఉంటే భవనంపై ఎన్ని అంతస్తుల నిర్మాణమైనా చేయవచ్చు. ఇదే విధానం విద్యార్థికి వర్తిస్తుంది. ఒక విద్యార్థికి పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో పునాది బలం ఉంటే ఆ విద్యార్థి అభ్యసనా సామర్థ్యాలను సులభంగా పెంచుకుంటాడు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో విద్యార్థి అభ్యసనా సామర్థ్యాల పెంపుదలకు ఫౌండేషన్ లిటరసీ, న్యుమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమాన్ని చేపట్టింది. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్(సాల్ట్)లో భాగంగా ఎన్‌జీవో సంస్థ ప్రథమ్ భాగస్వామ్యంతో ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాన్ని పూర్వ ప్రాథమిక, ప్రాథమిక పాఠశాలల్లో అమలుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.
ఈసీసీఈలో భాగంగా..
నూతన విద్యా విధానం–2020లో భాగంగా ప్రభుత్వం పలు విద్యా సంస్కరణలను ప్రవేశ పెట్టింది. నిపుణ్ భారత్ లక్ష్యాలను సాధించే క్రమంలో భాగంగా ఎర్లీ చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)ను ప్రవేశ పెట్టారు. ఇందులో ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2ను అమలు చేస్తున్నారు. ప్రీ ప్రైమరీ–1లో 3–4 ఏళ్ల చిన్నారులకు, ప్రీ ప్రైమరీ–2లో 4–5 ఏళ్ల చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యాబోధన చేస్తారు. ప్రీ ప్రైమరీలోనే పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాలను అమలు చేస్తారు. ఐదేళ్లు నిండిన చిన్నారులకు ప్రైమరీ తరగతులు నిర్వహిస్తారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీలో 1,2 తరగతులకు ఫౌండేషన్ లిటరసీ, న్యుమరసీ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి రెండో తరగతి నుంచి మూడో తరగతికి వెళ్లే విద్యార్థులందరూ ఆయా తరగతుల అభ్యసనా సామర్థ్యాలను కచ్చితంగా పొందాల్సి ఉంటుంది.
చదవండి: NCC: క్రమశిక్షణకు మారు పేరు ఎన్‌సీసీ
ఎఫ్‌ఎల్‌ఎన్ ఎందుకంటే
ప్రతి విద్యార్థి ఆయా తరగతుల అభ్యసనా సామర్థ్యాలను పొందాల్సి ఉంటుంది. అయితే పదో తరగతికి చేరుకుంటున్న విద్యార్థులు తెలుగు, గణితంలో ప్రాథమిక భావనలు ఉండడం లేదన్న కఠోర వాస్తవాలను అసర్, నాస్, శ్లాస్ తదితర నివేదికలు బహిర్గతం చేశాయి. దీంతో ప్రభుత్వం పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను సాధించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే ఫౌండేషన్ లిటరసీ, న్యుమరసీ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి 1,2 తరగతులు పూర్తి చేసి మూడవ తరగతిలో చేరే సమయానికి తెలుగులో చదవడం, రాయడం, వినడం, మాట్లాడడం రావాల్సి ఉంటుంది. గణితంలో చతుర్విధ ప్రక్రియలైన కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారంపై నైపుణ్యాలను సాధించాల్సి ఉంటుంది.
విజయవంతంగా శిక్షణ
ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమంలో ఎంపికయిన డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్(డీఆర్పీ)లకు మొదటి బ్యాచ్‌కు శిక్షణ ఇస్తున్నాం. మొదటి విడతలో సామర్లకోట వైటీసీలో కోనసీమ, అనకాపల్లి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు శిక్షణ పొందుతున్నారు. రెండవ విడతలో కాకినాడ జిల్లాకు చెందిన డీఆర్పీలకు శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పొందిన డీఆర్పీలు త్వరలో ఆయా జిల్లాల్లో 1,2 తరగతులు బోధన చేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.
– జి.నాగమణి, ఆర్‌జేడీ,
పాఠశాల విద్యాశాఖ, కాకినాడ జ్ఞాన జ్యోతి, జ్ఞాన ప్రకాష్‌గా..
ఎఫ్‌ఎల్‌ఎన్ అమల్లో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను జ్ఞాన జ్యోతిగా, ప్రాథమిక విద్యను జ్ఞాన ప్రకాష్‌గా పేర్కొన్నారు. తొలుతగా ప్రాథమిక విద్యను బోధన చేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు డీఆర్పీలకు తర్ఫీదు ఇస్తున్నారు. మండలానికి ముగ్గురు ఎస్‌జీటీ ఉపాధ్యాయులను డీఆర్పీలుగా ఎంపిక చేసిన వారికి రెసిడెన్షియల్ మోడ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి జిల్లాలో మండలానికి ముగ్గురు ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నారు. కోనసీమ జిల్లా నుంచి 66 మంది డీఆర్పీలకు శిక్షణనిస్తున్నారు. కోనసీమ జిల్లాకు చెందిన డీఆర్పీలు సామర్లకోట యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో ఈ నెల 28 నుంచి శిక్షణ పొందుతున్నారు. అనంతరం జ్ఞాన జ్యోతి డీఆర్పీలుగా ఎంపిక చేసిన వారికి కూడా తొమ్మిది రోజుల రెసిడెన్షియల్ ట్రైనింగ్ అందజేస్తారు. త్వరలో జ్ఞానజ్యోతి డీఆర్పీలకు శిక్షణ ఇవ్వనున్నారు.
చదవండి: ZPH School: కలెక్టర్ విజయరామరాజు విద్యార్థులకు పాఠాలు..