NCC: క్రమశిక్షణకు మారు పేరు ఎన్‌సీసీ
కూడేరు: ఎన్‌సీసీ అంటే ఐక్యత, క్రమశిక్షణకు మారుపేరని ఎన్‌సీసీ క్యాంప్ కమాండర్ కల్నల్ సందీప్ ముంద్రా అన్నారు. కూడేరు మండలంలోని ఎన్‌సీసీ నగర్‌లో సీఏటీసీ–6 ఆంధ్రా బెటాలియన్ శిక్షణా తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్యాడెట్లనుద్దేశించి కమాండర్ ముంద్రా మాట్లాడారు. నాయకత్వ లక్షణాలు, సేవా గుణం, ఇతర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ క్యాడెట్ల జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుందన్నారు. కార్యక్రమంలో మేజర్ సుఖ్‌దేవ్ సింగ్, అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన 525 మంది క్యాడెంట్లు, ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.
చదవండి: Written Test: 235 మంది మహిళలు రాత పరీక్షకు ఎంపిక
గ్రంథాలే శాస్త్రసాంకేతిక విద్యకు మూలం
అనంతపురం: ఆధునిక శాస్త్ర సాంకేతిక విద్యా వ్యవస్థకు మూలం పూర్వీకులు సంస్కృతంలో రచించిన గ్రంథాలేనని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ వీసీ ఎస్‌ఏ కోరి అన్నారు. ప్రపంచ సంస్కృత దినోత్సవాన్ని సంప్రదాయం ఉట్టిపడేలా గురువారం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ.. సుశ్రుతుడు రచించిన గ్రంథం ఆధారంగానే సర్జరీలు మొదలయ్యాయన్నారు. అనేక ముఖ్యమైన వైజ్ఞానిక, గణిత భావనలను శతాబ్దాల క్రితమే సంస్కృత గ్రంథాలు మొదట పేర్కొన్నాయన్నారు. అలాంటి పూర్వీకుల మేథోసంపత్తిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైజ్ఞానిక సాహిత్యంలో అనేక ఆధునిక భాషలు నేరుగా సంస్కృతం నుంచి తీసుకున్నవేనన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ సంస్కృత విద్యా కేంద్రం అధ్యాపకులు డాక్టర్ విశాల్ ప్రసాద్ భట్ పాల్గొన్నారు.