school teachers: క్రమశిక్షణ పేరుతో కఠిన దండన
రెడ్డిగూడెం: క్రమశిక్షణ పేరుతో పిల్లలకు మండుటెండలో మోకాళ్లదండ వేయించారు పాఠశాల ప్రిన్సిపాల్. నొప్పి తాళలేక బాలికలు రోదిస్తున్నా కనికరం చూపలేదు. గంట పాటు కాళ్లు బొబ్బలు తేలే వరకు శిక్ష అమలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులను ప్రిన్సిపాల్(ఎస్‌ఓ) శ్యామల మోకాలదండ వేయించారు.
ఎండ తీవ్రంగా ఉండటంతో గంటపాటు అలాగే ఉన్న పిల్లలకు మోకాళ్లు వాచి పుండ్లు పడ్డాయి. విద్యార్థులను దసరా సెలవులకు ఇళ్లకు తీసుకు వెళ్లేందుకు శుక్రవారం కస్తూర్బా స్కూలుకు వచ్చిన తల్లిదండ్రులు విద్యార్థులు మోకాళ్లకు అయిన గాయాలు చూసి తల్లడిల్లిపోయారు. విషయం ఆరాతీసి, ఎస్‌వో తీరుపై రెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్లోనూ, మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు.
అసలే జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఇచ్చే పనిష్మెంట్లతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎస్‌వోపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై ఎస్‌వో శ్యామలను వివరణ కోరగా క్రమశిక్షణ చర్యల కోసం తాను మోకాలుదండ వేయించిన మాట వాస్తవమేనని చెప్పారు.