Private Schools Admissions: అప్పుడే అడ్మిషన్ల దందా!
నిజామాబాద్ అర్బన్: కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అప్పుడే అడ్మిషన్ల దందాకు తెరలేపాయి. 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి నుంచే ప్రక్రియను ప్రారంభించాయి. కనీసం పరీక్షలు కూడా కాకముందే పైతరగతులకు సంబంధించిన అడ్మిషన్లను కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రంలోని కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఈ తతంగం కొనసాగిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కొద్ది రోజుల తర్వాత ఎక్కడ అడ్మిషన్లు దొరకవేమోననే అయోమయంలో తొందరపడుతున్నారు.
రెండు నెలల నుంచి..
ప్రైవేటు విద్యాసంస్థల పీఆర్వోలు జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో రెండు నెలల క్రితమే తిష్ట వేశారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల పాఠశాలలకు వెళ్తూ పాఠశాల యాజమాన్యాలను సంప్రదించి విద్యార్థుల ఫోన్‌నంబర్లను సేకరిస్తున్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ అడ్మిషన్లు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కలుస్తూ వారి కి విందులు ఏర్పాటు చేస్తున్నారు. తమ కళాశాలకు అడ్మిషన్లు ఇప్పివ్వాలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. చదువులో మెరుగ్గా ఉన్న విద్యార్థుల వివరాలను ముందే తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కలుస్తున్నారు. కొంద రు హెచ్‌ఎంలు ప్రైవేటు విద్యా సంస్థలకు సహకరిస్తున్నారు. ఇటీవల రెండు ప్రధాన ఉపాధ్యా య సంఘాల సభ్యులకు హైదరాబాద్‌కు చెందిన ఓ కార్పొరేట్ విద్యాసంస్థ జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్‌లో రెండుసార్లు భారీగా విందులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
నిబంధనలకు వ్యతిరేకంగా..
అడ్మిషన్ల ప్రక్రియను ముందే చేపట్టడం నిబంధనకు విరుద్ధమని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్ సమ యంలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ డిసెంబర్, జనవరి నుంచే ప్రక్రియను ప్రారంభించారు. నిబంధనలను గాలికి వదిలి అడ్మిషన్లు తీసుకుంటున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు ఇప్పటికై నా స్పందించి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నిత్యం ఫోన్‌కాల్స్
హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్ కళా శాలల సిబ్బంది పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి ప్రతిరోజూ ఫోన్‌కాల్స్ చేస్తున్నారు. తమ కళాశాలలో మెరుగ్గా సౌకర్యాలు ఉన్నాయని, ఫలితాలు బాగున్నాయని అడ్మిషన్లు తీసుకోవాలని చెబుతున్నారు. ముందే అడ్మిషన్లు తీసుకుంటే ఫీజులో రాయితీ ఉంటుందని, వివిధ విభాగాల్లో మంచి సీటు లభిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు సైతం విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్ల కోసం గాలం వేస్తున్నాయి. అనుమతి లేకుండా ప్రచారా న్ని కొనసాగిస్తున్నాయి. మొబైల్ ఫోన్ల ద్వారా కళాశాల ప్రచార కరపత్రాలు పంపుతూ అడ్మిషన్లను కొనసాగిస్తున్నాయి.
అడ్మిషన్లు చేపట్టరాదు
ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపట్టరాదు. ప్రైవేటు కళాశాలల్లో ముందస్తుగా అడ్మిషన్లు చేపడితే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని కళాశాలపై తప్పకుండా చర్యలు ఉంటాయి.
– రఘురాజ్, డీఐఈవో