Skip to main content

Inspire Manak Program: బైసైకిల్ అంబులెన్స్ ను రూపొందించిన విద్యార్థి

ఈనెల మూడు రోజుల పాటు నిర్వ‌హించిన ఇన్‌స్పైర్‌ మనక్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఏపీ నుంచి ఎంపికైన విద్యార్థులు త‌మ స‌త్తా చాటారు. ఈ న‌లుగురిలో ఒక‌రె అద్దంకి గోవర్ధన నాయుడు. ఇత‌ను ప్ర‌ద‌ర్శించిందే తాను రూపొందించిన బైసైకిల్.
Student Govardhan Naidu receiving certificate
Student Govardhan Naidu receiving certificate

సాక్షి ఎడ్యుకేషన్‌: విద్యారంగంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రపంచ దేశాల ముందు ప్రతిభ చాటుతున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌లోనూ సత్తా చాటారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఈనెల 9,10,11 తేదీల్లో కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి నలుగురు విద్యార్థులు రాష్ట్రపతి భవన్‌కు ఎంపికయ్యారు.

ANM Training Courses: కోర్సుల అవ‌కాశం.. మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే

వారిలో ఒకరిగా గుంటూరు జిల్లాలోని కొల్లిపర మండలం అత్తోట జెడ్పీ హైస్కూలు 10వ తరగతి విద్యార్థి అద్దంకి గోవర్ధన నాయుడు అర్హత సాధించారు. గతేడాది టెన్త్‌ విద్యార్థిగా ఉన్న అతడు ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు. గత మార్చిలో కాకినాడలో ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌లో ప్రతిభ చూపి, జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. మూడు రోజుల పాటు న్యూఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ ప్రదర్శనలో తాను రూపొందించిన ప్రాజెక్టును ప్రదర్శించాడు. రవాణా సదుపాయం లేని మారుమూల గిరిజన, కొండ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు వీలుగా తయారు చేసిన ‘‘బై సైకిల్‌ అంబులెన్స్‌’ ప్రాజెక్టు జాతీయస్థాయిలో అర్హత సాధించింది.

National Awards: ఉత్తమ విద్యార్థులకు జాతీయ పురస్కారాలు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి హాజరైన 600 మంది విద్యార్థులతో పోటీ పడి, రాష్ట్రపతి భవన్‌కు ఎంపికైన 60 మంది విద్యార్థుల్లో నలుగురు ఏపీకి చెందిన విద్యార్థులు ఉండగా, వారిలో ఒకరిగా గుంటూరు జిల్లా నుంచి గోవర్ధన నాయుడు ఉన్నారు. ప్రాజెక్టు రూపకల్పనలో గురజాల మండలం జంగమహేశ్వరపురం జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం రాయపాటి శివనాగేశ్వరరావు గైడ్‌ టీచర్‌గా వ్యవహరించారు.

IIIT Basara: ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల క్షేత్ర పర్యటన

రూ.10వేలతో బైసైకిల్‌ అంబులెన్స్‌

అంబులెన్స్‌ వెళ్లలేని అటవీ, కొండ ప్రాంతాల నుంచి గర్భిణులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఆస్పత్రికి త్వరగా చేర్చేందుకు రూపొందించిన బై సైకిల్‌ అంబులెన్స్‌లో ప్రత్యేకంగా రూపొందించిన స్ట్రెచర్‌కు రెండు చక్రాల్ని తగిలించారు. దీనిని సైకిల్‌కు అమర్చి రోగులను ఆస్పత్రికి తీసుకుని వెళ్లవచ్చు. ఇందులో ప్రథమ చికిత్స అందించే కిట్‌తో పాటు ఆక్సిజన్‌ సిలిండర్‌, సోలార్‌ విద్యుత్‌తో పని చేసే ఫ్యాన్‌, లైట్లు, సైరన్‌ ఉంటాయి. ఇరుకు రోడ్లలోనూ రోగిని ఇబ్బంది లేకుండా వైద్యశాలకు తరలించవచ్చు. రూ.10వేల ఖర్చుతో రూపొందించగలిగే బైసైకిల్‌ అంబులెన్స్‌ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తే, ఈ వాహనాలను తయారు చేసి గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు అందించవచ్చునని విద్యార్థి గోవర్ధన నాయుడు, గైడ్‌ టీచర్‌ రాయపాటి శివనాగేశ్వరరావు చెబుతున్నారు.

Gaganyaan Mission: అక్టోబ‌ర్ 21న గగన్‌యాన్‌

కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రం

న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాస్త్ర మంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్‌ చేతుల మీదుగా గోవర్ధన నాయుడు ప్రశంసాపత్రం అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్‌కు ఎంపికైన విద్యార్థులందరినీ త్వరలో జపాన్‌లోని సకురాల సైన్స్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రాంకు కేంద్ర ప్రభుత్వం పంపనుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో డీఎస్టీ డైరెక్టర్‌ కులందకర్‌, ఎన్‌ఐఎఫ్‌ డైరెక్టర్‌ పీఎస్‌ గోయల్‌, ఏపీ ఎస్సీఈఆర్టీ నోడల్‌ అధికారి డాక్టర్‌ భాగ్యశ్రీ, ఉపాధ్యాయులు పి. మేరీ, శారద పాల్గొన్నారు. జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థి గోవర్ధన నాయుడుతో పాటు గైడ్‌ టీచర్‌ ఆర్‌.శివనాగేశ్వరరావు, జిల్లా సైన్స్‌ అధికారి ఏఏ మధుకుమార్‌ను పాఠశాల విద్య ఆర్జేడీ వీఎస్‌ సుబ్బారావు, డీఈవోలు పి.శైలజ, కె.శ్యామ్యూల్‌ అభినందించారు.
 

Published date : 12 Oct 2023 04:03PM

Photo Stories