Telangana: బడిలో సేంద్రియ సాగు..
వీటిలో ప్రధానమైనవి తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉంటాయి. నేటి జనాభా డిమాండ్‌కు తగ్గట్టుగా పంట ఉత్పత్తులు సరిపోకపోవడంతో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు వివిధ రకాల రసాయన ఎరువులు వినియోగించి కూరగాయలు పండిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది.
దండేపల్లి మండలంలోని పెద్దపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, పాఠశాల ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు అందరూ కలిసి పాఠశాల ఆవరణలో గల ఖాళీ స్థలంలో పెరటితోటలు పెంచుతున్నారు. వీరుచేపట్టిన పెరటి తోటల సాగు మంచి సత్ఫాలితాలనిస్తుందని ప్రధానోపాధ్యాయురాలు చెబుతున్నారు.
చదవండి: Success Story : లక్ష జీతం వదులుకున్నా.. జామకాయలు అమ్ముతున్నా.. కారణం ఇదే
కూరగాయలు, ఆకు కూరలు...
పాఠశాలలో 52మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో బాగంగా పాఠశాల విద్యార్థులకు తాజా ఆకు కూరలు, కూరగాయలతో భోజనం వండిపెట్టేందుకు, పాఠశాలలోని పెరటి తోటలో టమాట, మిర్చి, వంకాయ, ఆకుకూరలు, చిక్కుడుకాయ, బీరకాయలు పండిస్తున్నారు. వీటితో పాటు పోపులో ఉపయోగించేందుకు వెల్లుల్లి ఆకులు, కొత్తిమీర ఆకు, వంటి రకాలను పెరటి తోటలో సాగు చేస్తున్నారు.
పెరటితోటలో సాగుచేస్తున్నవి సరిపోని సమయంలో వారసంతలోని కూరగాయలు కొనుగోలు చేస్తారు. పెరటితోట సాగులో పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయురాలితో పాటు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు కూడా పాల్పంచుకుంటున్నారు. పైగా పెరటితోటల సాగుపై పాఠశాల విద్యార్థులకు కొంత అవగాహన కూడా కల్పిస్తున్నట్లు హెచ్‌ఎం తెలిపారు.