Open School Admissions: ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై అవగాహన కల్పించాలి
ఏలూరు (మెట్రో): విద్య ద్వారా సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడమే కాకుండా సమాజంలో నూతన మార్పులు తీసుకురావడం సాధ్యమవుతుందని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై సోమవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలపై అవగాహన కలిగించే పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2023–24 విద్యా సంవత్సరంలో పాఠశాలలు, కళాశాలల్లో చేరి చదువుకోవడానికి వీలుకాని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓపెన్ స్కూల్ విద్యకు ప్రోత్సహించాలన్నారు. ఆగస్టు 5 వరకు జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో అధ్యాయన కేంద్రాల నిర్వాహకులతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. విద్యాశాఖాధికారి శ్యామ్ సుందర్, జెడ్పీ సీఈఓ కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.