Teachers at school: చదువు చెప్పని ఉపాధ్యాయులు మాకొద్దు: Gurukula girls schools
చదువు చెప్పని ఉపాధ్యాయులు మాకొద్దు’ అని కాటారం మండలం దామెరకుంట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కారు. పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు దామెరకుంట–గంగారం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పాఠశాలలో పలువురు ఉపాధ్యాయులు సరిగ్గా బోధించడం లేదని ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు ఆరోపించారు.
Also read: JNTU-N: క్రమశిక్షణతోనే ఉన్నత స్థానాలకు.. Additional Sr. Civil Judge K. Madhuswamy
పాఠశాల, కళాశాలలో మూడ్రోజులుగా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, మరుగుదొడ్లు సరిపడా లేవని, ప్రహరీ చిన్నగా ఉండడంతో ఆకతాయిలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించట్లేదని, విజిటింగ్ కోసం వచ్చిన తల్లిదండ్రులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు కించపర్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు మూడు గంటలు ఆందోళన కొనసాగింది. వారికి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు యువకులు మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న ట్రైనీ ఎస్సై ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
Also read: Anganwadi Employees: అంగన్‌వాడీలకు వేరే బాధ్యతలు వద్దు
ఆర్‌సీఓ విచారణ..
విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ గురుకులాల ఆర్‌సీఓ విద్యారాణి పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ మైథిలీతో, విద్యార్థులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆర్‌సీఓ హామీ ఇచ్చారు.