Skip to main content

Model school: భవితకు భరోసా.. మోడల్‌ స్కూల్‌

వరంగల్‌ జిల్లా: ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా మోడల్‌ స్కూళ్లు విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నాయి. అనుభవజ్ఞలైన ఉపాధ్యాయులు, అధ్యాపకుల బోధనతో విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు.
Model schools

తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో 2024–25 విద్యాసంవత్సరానికి ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆరో తరగతిలో వంద సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం 2013లో గవిచర్ల, వంచనగిరి, అమీనాబాద్‌, పర్వతగిరి, బుధరావుపేట, నెక్కొండలో ఆదర్శ పాఠశాలలను నెలకొల్పింది.

దరఖాస్తు చేయడం ఇలా..
ఆరో తరగతితోపాటు ఇతర తరగతుల్లో ఆడ్మిషన్ల కోసం మార్చి 2లోగా http://telanganams.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. విద్యార్థులు తమ ఆధార్‌కార్డు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్‌, కుల ధ్రువీకరణ జిరాక్స్‌ కాపీలు, పాస్‌పోర్టుసైజ్‌ ఫొటోను ఆన్‌లైన్‌ దరఖాస్తుకు జతచేసి మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు అందజేయాలి. ఓసీలు రూ.100, బీసీ, ఎస్సీ, ఎస్టీలు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్‌ 1 నుంచి 6 వరకు హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని ఏప్రిల్‌ 7న నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం ..
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అబ్జెక్టివ్‌ విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఐదో తరగతి సిలబస్‌, మిగిలిన తరగతులకు ప్రస్తుతం చదువుతున్న తరగతుల నుంచి తెలుగు, గణితం, సైన్స్‌, సోషల్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల నుంచి 20 చొప్పున ప్రశ్నలు ఇస్తారు.

మోడల్‌ స్కూల్‌లో ప్రత్యేకతలు..

  • 6 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత బోధన
  • పక్కా భవనంలో సరిపడా తరగతి గదులు
  • ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాం పంపిణీ
  • అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ప్రొజెక్టర్‌ ద్వారా పాఠాలు
  • విశాలమైన ఆటస్థలం, సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీ సదుపాయం
  • అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ద్వారా రోబోటిక్స్‌లో ప్రత్యేక శిక్షణ
  • ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులకు తర్ఫీదు
  • నాణ్యమైన మధ్యాహ్న భోజనం
  • 8వ తరగతి విద్యార్థులకు జాతీయ ఉపకార వేతనాల కోసం ప్రత్యేక శిక్షణ
  • పదో తరగతి విద్యార్థులకు ఎన్‌టీఎస్‌ఏకు ప్రత్యేక తరగతులు
  • వృత్తివిద్య, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బ్యూటీషన్‌ కోర్సుల్లో శిక్షణ

సద్వినియోగం చేసుకోవాలి
ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించాం. 7 నుంచి 10 వతరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం కూడా దరఖాస్తులు చేసుకోవాలి. అన్ని సదుపాయాలతో కూడిన మోడల్‌ స్కూల్‌లో నాణ్యమైన విద్య లభిస్తుంది. ఆంగ్ల మాధ్యమంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మోడల్‌ స్కూళ్లు వరం లాంటివి. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన ఉంటుంది. విద్యార్థుల ఉన్నతికి ప్రభుత్వం నుంచి చక్కటి సహకారం లభిస్తుంది. మండల పరిధిలోని విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. స్థానికులు లేకుంటే ఇతర మండలాల వారికి అవకాశం కల్పిస్తాం. ఈ చక్కటి అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి.
– ముజుబూర్‌ రహమాన్‌, ప్రిన్సిపాల్‌, గవిచర్ల మోడల్‌ స్కూల్‌

Published date : 26 Feb 2024 07:03PM

Photo Stories