Skip to main content

School Children: డ్రాప్‌ అవుట్‌.. నో చాన్స్‌!

All school children are in schools this academic year

సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లలందరినీ బడుల్లోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో (2023–24) ఇప్పటి వరకు గుర్తించిన 38,677 డ్రాప్‌ అవుట్‌ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో డ్రాప్‌ అవుట్‌ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించడం ఒక సూచికగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బడి ఈడు పిల్లలందరినీ నూరు శాతం బడుల్లో చేర్పించేలా ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేసింది.

గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వలంటీర్ల ద్వారా ప్రత్యేకంగా 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు బడుల్లో ఉన్నారా.. లేక బడి బయట ఉన్నారా అనే అంశంపై సర్వే నిర్వహించడం ద్వారా డ్రాప్‌ అవుట్‌ పిల్లలను గుర్తించారు. ఇప్పటి వరకు 38,677 మంది డ్రాప్‌ అవుట్‌ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించినట్లు ఇటీవల జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. 1వ తరగతిలో చేరిన పిల్లలు ఆ మరుసటి సంవత్సరం రెండో తరగతి.. ఆ మరుసటి సంవత్సరం ఆపై తరగతిలో.. ఇలా 8వ తరగతి వరకు చేరుతున్నారా లేక మధ్యలో డ్రాప్‌ అవుట్‌ అవుతున్నారా.. అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.  

చ‌ద‌వండి: ISRO: అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థుల్లో అవగాహన

ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహణలో అసలు బడిలో చేరని, డ్రాప్‌ అవుట్, బాల కార్మికులను గుర్తించి వారి కోసం ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పిల్లలను బడుల్లో చేర్పించడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించడం ద్వారా అవగాహన కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. తద్వారా బడి ఈడు పిల్లలందరూ బడుల్లో ఉండేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది.

తద్వారా ఇప్పటి వరకు మొత్తం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్కూల్స్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్య 56,34,974కు చేరింది. ఈ విద్యా సంవత్సరంలో అత్యధికంగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బడుల్లో చేరిన పిల్లలు కర్నూలు జిల్లాలో 3,78,564 మంది ఉండగా, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 3,06,667 మంది, నంద్యాల జిల్లాలో 2,29,280 మంది బడుల్లో చేరారు.

చ‌ద‌వండి: 10th Class Exam: టెన్త్‌లో నూరుశాతం మార్కులసాధనే లక్ష్యం

Published date : 06 Oct 2023 05:26PM

Photo Stories