ISRO: అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థుల్లో అవగాహన
బీచ్‌రోడ్డు: చంద్రయాన్–3 విజయం భారతీయుల్లో కొత్త శక్తిని, అంతరిక్ష పరిశోధనలపై యువతలో ఆసక్తిని కలిగించిందని డీసీపీ–2 కె.ఆనందరెడ్డి అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో), సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్), రఘు విద్యా సంస్థలు సంయుక్తంగా గురువారం బీచ్‌రోడ్డులో వాక్ ఫర్ స్పేస్ వీక్ నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని ఆర్.కె.బీచ్‌లోని కాళీమాత ఆలయం వద్ద డీసీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అద్భుత విజయాలు సాధిస్తోందన్నారు. భవిష్యత్‌లో దీనిని మరింత అభివృద్ధి చేసి, ముందుకు నడిపించే బాధ్యత యువత తీసుకోవాలన్నారు. అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయుక్తంగా నిలుస్తాయన్నారు. షార్ శాస్త్రవేత్త, విశాఖ రీజియన్ కార్యక్రమ నిర్వహణ సబ్ కమిటీ చైర్మన్ జి.అప్పన్న మాట్లాడుతూ అంతరిక్ష విజ్ఞానంతోనే మానవ అభివృద్ధి సాకారమవుతుందన్నారు. రఘు విద్యాసంస్థల చైర్మన్ కలిదిండి రఘు మాట్లాడుతూ షార్, ఇస్రో నిర్వహిస్తున్న నాలుగు రోజుల ప్రత్యేక కార్యక్రమాలను విద్యార్థులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. షార్, ఇస్రో శాస్త్రవేత్తలు, రఘు విద్యా సంస్థల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, పోలీస్ అధికారులు, కళాశాల సిబ్బంది పాల్గొన్న ర్యాలీ ఆర్కేబీచ్ నుంచి వైఎంసీఏ వరకు సాగింది.
చదవండి: Women Entrepreneurs Conference: ఔత్సాహికులకు దిశానిర్దేశం