AISSEE Results 2024: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో మేధర్షికి మొదటి ర్యాంకు
అచ్యుతాపురం : మండలంలోని నునపర్తి గ్రామానికి చెందిన రెడ్డి మేధర్షి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు. ఇటీవల ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన పరీక్షలో మేధర్షి 300 మార్కులకు గానూ 283 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్, జాతీయ స్థాయిలో 43వ ర్యాంక్ సాధించాడు. ఈ బాలుడు హైదరాబాద్‌లోని సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. మేధర్షి మల్టీ టాలెంటెడ్ విద్యార్థి. నృత్యం,పాటల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.
తల్లిదండ్రులు సాప్ట్‌వేర్ ఉద్యోగులు
రెడ్డి మేధర్షి తండ్రి రాజేష్, తల్లి స్వర్ణలతలు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కాంపీటేటివ్ స్పిరిట్ పెరగాలనే లక్ష్యంతో మేధర్షికి విశాఖలోని వైజాగ్ సైనిక్ అకాడమీలో ఆన్‌లైన్ ద్వారా నాలుగు నెలల పాటు శిక్షణ ఇప్పించారు.
ఈ బాలుడు రాణిస్తున్న తీరును చూసిన అకాడమీ ఇన్‌చార్జ్ భాస్కర్ సూచనల మేరకు స్కూల్‌కి రెండు నెలల పాటు సెలవు పెట్టి ఏఐఎస్‌ఎస్‌ఈఈ పరీక్షకు ఆఫ్‌లైన్‌లోనూ శిక్షణ ఇప్పించారు. భాష,మేధస్సుకు సంబంధించిన విభాగంలో యాభైకి యాభైకి మార్కులు పొందిన మేధర్షి మొత్తం 300 మార్కులకు గానూ 283 మార్కులు సాధించి ఆలిండియా స్థాయిలో 43వ ర్యాంక్,ఏపీ స్థాయిలో మొదటి ర్యాంక్ సాఽధించాడు.
ఈ పరీక్ష కోసం రోజుకి పదిగంటలకు పైగా శ్రమించిన మేధర్షి సివిల్స్,ఎంబీబీఎస్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. మేధర్షికి ఏపీలో మొదటి ర్యాంక్ రావడంతో నునపర్తిలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.