Skip to main content

Sainik School Entrance Exam: త్రివిధ దళాలకు దారి.. సైనిక్‌ స్కూల్స్‌.. సీట్లు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ ఇలా..

ఆరో తరగతి నుంచే విద్యార్థులను సాయుధ దళాల్లో చేరేలా సన్నద్ధం చేస్తున్న పాఠశాలలు.. సైనిక్‌ స్కూల్స్‌! భావి భారత పౌరులు.. త్రివిధ దళాల్లో అడుగు పెట్టి దేశ సేవ చేసేలా శిక్షణనిస్తున్న.. ఈ సైనిక్‌ స్కూల్స్‌లో చేరాలని ఎంతోమంది కోరుకుంటారు!! 2025–26 విద్యా సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్‌ స్కూల్స్‌లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(ఏఐఎస్‌ఎస్‌ఈఈ) నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. సైనిక్‌ స్కూల్స్‌ ప్రాధాన్యత, ప్రవేశాలు, పాఠశాలలు, సీట్లు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
sainik school entrance exam guidance

సైనిక్‌ స్కూల్స్‌..పాఠశాల స్థాయి నుంచే త్రివిధ దళాల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ఏర్పాటైన విద్యా సంస్థలు. వీటి పర్యవేక్షణకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ప్రత్యేకంగా సైనిక్‌ స్కూల్‌ సొసైటీని సైతం నెలకొల్పారు.

ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన సాగిస్తూ.. విద్యార్థులకు ధైర్య సాహసాలు నూరిపోయడమే కాకుండా.. త్రివిధ దళాల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నాయి సైనిక్‌ స్కూల్స్‌.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 33

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో 33 సైనిక్‌ స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో ఆరో తరగతిలో 3,156 సీట్లు, తొమ్మిదో తరగతిలో 379 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 2025–26 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా పీపీపీ విధానంలో మరో 40 సైనిక్‌ స్కూల్స్‌కు అనుమతించారు. వీటిలో 1,590 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

చదవండి: TG CET 2025 : గురుకుల పాఠ‌శాల‌లో ప్ర‌వేశాల‌కు టీజీసెట్‌-2025.. ఈ విద్యార్థులే అర్హులు!

ఆంధ్రప్రదేశ్‌లో కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ఆరో తరగతిలో 93 సీట్లు, తొమ్మిదో తరగతిలో 22 సీట్లు, కలికిరిలో ఆరో తరగతిలో 105 సీట్లు, తొమ్మిదో తరగతిలో 16 సీట్లు ఉన్నాయి. పీపీపీ విధానంలో.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో సైనిక్‌ స్కూల్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. ఏపీలోని సైనిక్‌ స్కూల్స్‌కు ఏపీ, తెలంగాణ విద్యార్థులు పోటీ పడొచ్చు.

అర్హతలు

  • ఆరో తరగతి: మార్చి 31, 2025 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్యలో ఉండాలి. (ఏప్రిల్‌ 1, 2013–మార్చి 31, 2015 మధ్యలో జన్మించాలి).
  • తొమ్మిదో తరగతి: మార్చి 31, 2025 నాటికి 13 నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉండాలి. 
  • తొమ్మిదో తరగతి అభ్యర్థులు ప్రవేశ సమయానికి ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

రాత పరీక్షలో ప్రతిభ

జాతీయ స్థాయిలో నిర్వహించే ఏఐఎస్‌ఎస్‌ఈఈలో ప్రతిభ ఆధారంగా సైనిక్‌ స్కూల్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌టీఏ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష ఆరు, తొమ్మిది తరగతులకు వేర్వేరుగా నిర్వహిస్తారు. 

చదవండి: University Grants Commission News: యూనివర్సిటీలపై యూజీసీ కొరడా!

ఆరో తరగతి ప్రవేశ పరీక్ష

సైనిక్‌ స్కూల్స్‌లో ఆరో తరగతిలో ప్రవేశానికి 125 ప్రశ్నలు–300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు, మ్యాథమెటిక్స్‌ 50 ప్రశ్నలు–150 మార్కులకు, ఇంటెలిజెన్స్‌æ25 ప్రశ్నలు–50 మార్కులకు, జనరల్‌ నాలెడ్జ్‌ 25 ప్రశ్నలు– 50 మార్కులకు ఉంటాయి. మ్యాథమెటిక్స్‌ విభాగంలో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు, మిగతా విభాగాల్లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.

9వ తరగతి ప్రవేశ పరీక్ష

తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు 150 ప్రశ్నలు–400 మార్కులకు అయిదు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్‌ 50 ప్రశ్నలు–200 మార్కులకు, ఇంటెలిజెన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు, ఇంగ్లిష్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు, జనరల్‌ సైన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు, సోషల్‌ సైన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు ఉంటాయి. మ్యాథమెటిక్స్‌ విభాగంలో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు, మిగతా విభాగాల్లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.

ఓఎంఆర్‌ షీట్‌ విధానం

ఆరు, తొమ్మిది తరగతులకు జరిపే రెండు పరీక్షలు కూడా పేపర్‌ పెన్సిల్‌ విధానంలోనే ఉంటాయి. అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్‌లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు రెండున్నర గంటలు, తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్షకు మూడు గంటల సమయం కేటాయిస్తారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్షను ఇంగ్లిష్, హిందీ, అస్సా­మీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన భాషలో పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తెలు­గు, ఉర్దూ మీడియంలను ప్రాంతీయ భాషలుగా పేర్కొని పరీక్ష రాసే అవకాశం ఉంది. తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్షను మాత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే నిర్వహిస్తారు.

హోంస్టేట్‌ కోటా

సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశాల విషయంలో హోంస్టేట్‌ కోటా విధానాన్ని అమలు చేస్తున్నారు. సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటైన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఆయా పాఠశాలలోని మొత్తం సీట్లలో 67 శాతం సీట్లను కేటాయిస్తారు. మిగతా 33 శాతం సీట్లను అదర్‌ స్టేట్‌ కోటా పేరుతో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. అదే విధంగా హోం స్టేట్, అదర్‌ స్టేట్‌ కోటాల్లో అందుబాటులో ఉండే సీట్లలో.. 25 శాతం సీట్లను త్రివిధ దళాల్లో విధులు నిర్వహిస్తున్న వారి పిల్లలకు కేటాయిస్తారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ప్రాధాన్యత ఆధారంగా

ఏఐఎస్‌ఎస్‌ఈఈలో సాధించిన ప్రతిభ, విద్యార్థులు దరఖాస్తు సమయంలో ప్రాథమ్యంగా పేర్కొన్న పాఠశాలల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి సీట్లు ఖరారు చేస్తారు. ఆ తర్వాత దశలో విద్యార్థులు సదరు పాఠశాలలో నిర్దేశిత తేదీలోపు జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

సాయుధ దళాల్లో చేరేలా

త్రివిధ దళాల్లోని కొలువుల్లో సైనిక్‌ స్కూల్స్‌ నుంచి ఉత్తీర్ణత సాధించిన వారి ప్రాతినిథ్యం కొంత ఎక్కువగా ఉంటోందని చెప్పొచ్చు. ఎన్‌డీఏ పరీక్షలో ప్రతి ఏటా  30 శాతం వరకు సైనిక్‌ స్కూళ్ల విద్యార్థులు ఎంపికవుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. హైస్కూల్‌ స్థాయి నుంచే ఆ దిశగా శిక్షణనివ్వడం, ఎన్‌సీసీ శిక్షణ, ఇతర ఫిజికల్‌ ట్రైనింగ్‌ యాక్టివిటీస్‌ నిలుస్తున్నాయి.

మంచి మార్కులు సాధించాలంటే

జాతీయ స్థాయిలో నిర్వహించే ఏఐఎస్‌ఎస్‌ఈఈలో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థులు అధ్యయనం చేయాల్సిన అంశాలు..

  • విద్యార్థులు ముందుగా తాము దరఖాస్తు చేసుకుంటున్న తరగతి ఆధారంగా అంతకు ముందు తరగతుల­కు సంబంధించిన అకాడమీ పుస్తకాలు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అభ్యసించడం ఉపయుక్తంగా ఉంటుంది. 
  • ఆరో తరగతి ప్రవేశ పరీక్ష అభ్యర్థులు ప్రధానంగా నాలుగు, అయిదు తరగతుల మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌ పుస్తకాలను చదవాలి.
  • తొమ్మిదో తరగతి అభ్యర్థులు అయిదు నుంచి ఎనిమిది తరగతుల పుస్తకాలను ముఖ్యంగా మ్యాథమెటిక్స్, జనరల్‌ సైన్స్‌ అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. 
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి గ్రామర్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా యాంటానిమ్స్, సినానిమ్స్, ఆర్టికల్స్, ప్రిపొజిషన్స్, వెర్బ్స్‌పై దృష్టి పెట్టాలి.
  • జనరల్‌ సైన్స్‌కు సంబంధించి సైన్స్‌లోని ప్రాథమిక అంశాలు, మొక్కలు, బ్యాక్టీరియా, వ్యాధులు–కారకాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
  • సోషల్‌ సైన్స్‌కు సంబంధించి పర్యావరణం, హిస్టరీ, జాగ్రఫీ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా సివిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక భావనలు తెలుసుకోవాలి. ఎకనామిక్స్‌లో జనాభా, జన గణన గణాంకా­లు, పంటలు –ఉత్పత్తులు.. అవి ఎక్కువగా పండే ప్రదేశాలు తదితర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
  • జనరల్‌ నాలెడ్జ్‌లో ముఖ్యమైన వ్యక్తులు, అవార్డులు–విజేతలు, ముఖ్యమైన ప్రదేశాలు, క్రీడలు–విజేతలు, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతి వంటి పదవులు చేపట్టిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2025, జనవరి 13.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులో సవరణలు: 2025, జనవరి 16 నుంచి 18 వరకు.
  • ఏఐఎస్‌ఎస్‌ఈఈ పరీక్ష తేదీ: 2025, జనవరి 19.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/AISSEE
Published date : 07 Jan 2025 04:50PM

Photo Stories