Skip to main content

FAQ-UPSC: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సంబంధించిన‌ 28 ముఖ్యమైన సందేహాలు - స‌మాధానాలు... మీ కోసం

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు.. కొందరికి జీవితమంతా పోరాడినా అందని ద్రాక్ష పండులా ఊరిస్తూ ఉంటుంది, మరికొందరేమో సింగిల్‌ అటెంప్ట్‌లోనే క్లియర్‌ చేస్తారు.


ఎందుకీ వ్యత్యాసం.. ఎక్కడ తప్పులో కాలేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలియక సతమతమవుతున్నారా? భయపడకండి... మీ సందేహాలకు నిపుణులు సిద్ధపరచిన సమాధానాలు ఈ క్రింద పొందుపరిచాము. ఇక ప్రారంభిద్దామా...

1. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా జరిగే నియామకాల్లో ఎన్ని సర్వీసులకు నాకు అర్హత ఉంటుంది ?
జ. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా మొత్తం 24 సర్వీసుల్లో సాధారణంగా నియామకాలు జరుగుతాయి.

  • ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపీఎస్‌), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ పీ–టీ అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌) (ఐఏఎస్‌), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ డిఫెన్స్‌ అకౌంట్స్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐటీ), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ ఆర్డనెన్స్‌ ఫ్యాక్టరీస్‌ సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ రైల్వే అకౌంట్స్‌ సర్వీస్,గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ రైల్వే పర్సనల్‌ సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • పోస్ట్‌ ఆఫ్‌ అసిస్టెంట్‌ సెక్యురిటీ కమిషనర్, గ్రూప్‌ ‘ఏ’ ఇన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌
  • ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్, జూనియర్‌ గ్రేడ్‌ గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ ట్రేడ్‌ సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’ (గ్రేడ్‌ – 3)
  • ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • ఆర్మ్‌›్డ ఫోర్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌ సివిల్‌ సర్వీస్, గ్రూప్‌ ‘బి’ (సెక్షన్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌)
  • ఢిల్లీ, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ ద్వీపాలు, లక్షద్వీప్, డామన్‌ అండ్‌ డయ్యూన్‌ దాద్రా అండ్‌ నగర్‌ హవేలీ సివిల్‌ సర్వీస్, గ్రూప్‌ ‘బి’
  • ఢిల్లీ, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ ద్వీపాలు, లక్షద్వీప్, డామన్‌ అండ్‌ డయ్యూన్‌ దాద్రా అండ్‌ నగర్‌ హవేలీ పోలీస్‌ సర్వీస్, గ్రూప్‌ ‘బి’
  • పుదుచ్ఛేరి సివిల్‌ సర్వీస్, గ్రూప్‌ ‘బి’
  • పుదుచ్ఛేరి పోలీస్‌ సర్వీస్, గ్రూప్‌ ‘బి’

2. సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా జరిగే నియామకాల్లో టెక్నికల్‌ సర్వీసులు ఏవి ?
జ. టెక్నికల్‌ సర్వీసులకు కంటి చూపు, ఎత్తు, చాతి విస్తీర్ణం వంటి ప్రత్యేక‌ కొలతలు అవసరమవుతాయి.
సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్స్‌లో కింది టెక్నికల్‌ సర్వీసులు ఉంటాయి
  • ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • ఢిల్లీ, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ ద్వీపాలు, లక్షద్వీప్, డామన్‌ అండ్‌ డయ్యూన్‌ దాద్రా అండ్‌ నగర్‌ హవేలీ పోలీస్‌ సర్వీస్, గ్రూప్‌ ‘బి’
  • పుదుచ్ఛేరి పోలీస్‌ సర్వీస్, గ్రూప్‌ ‘బి’
  • ఇండియన్‌ ఆర్డనెన్స్‌ ఫ్యాక్టరీస్‌ సర్వీస్‌ (ఐఓఎఫ్‌ఎస్‌), గ్రూప్‌ ‘ఏ’

3. సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా జరిగే నియామకాల్లో నాన్‌ టెక్నికల్‌ సర్వీసులు ఏవి ?
జ. ఈ కింది పేర్కొన్నవి నాన్‌ టెక్నికల్‌ సర్వీసులు..
  • ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌) (ఐఏఎస్‌), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐటీ), గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ రైల్వే అకౌంట్స్‌ సర్వీస్,గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ రైల్వే పర్సనల్‌ సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్, జూనియర్‌ గ్రేడ్‌ గ్రూప్‌ ‘ఏ’
  • ఇండియన్‌ కార్పొరేషన్‌ లా సర్వీస్, గ్రూప్‌ ‘ఏ’
  • ఢిల్లీ, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ ద్వీపాలు, లక్షద్వీప్, డామన్‌ అండ్‌ డయ్యూన్‌ దాద్రా అండ్‌ నగర్‌ హవేలీ సివిల్‌ సర్వీస్, గ్రూప్‌ ‘బి’

4. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌లో ఏదైనా ఒక సర్వీస్‌కు ఎంపికైన అభ్యర్ధి, ఇంప్రూవ్‌మెంట్‌ కోసం మరొకమారు సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ రాయవచ్చా ?
జ. రాయవచ్చు. అయితే ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌)/ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)కు ఎంపికైన అభ్యర్ధులు మినహాయించి మిగతావారంతా రాయవచ్చు.

5. జనరల్‌ మెరిట్‌ (జిఎమ్‌)/మెరిటోరియస్‌ రిజర్వ్డ్‌ కేటగిరి అభ్యర్ధులని ఎవరిని పిలుస్తారు ?
జ. రిజర్వేషన్‌ కేటగిరికి సంబంధించిన అభ్యర్ధి అయ్యి ఉండి, గరిష్ఠ వయసు, అటెంప్ట్‌ పరిమితి వంటి సడలింపుల ద్వారా కాకుండా తన సొంత ప్రయత్నంతో సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌లో అర్హత (మెరిట్‌) సాధించిన అతను/అమెను జిఎమ్‌ లేదా మెరిటోరియస్‌ రిజర్వ్డ్‌ కేటగిరి అభ్యర్ధి అని అంటారు.

6. ఒక అభ్యర్ధిని నిర్ధిష్టమైన సర్వీస్‌కు కేటాయించేటప్పుడు ఏఏ కొలమానాలు ప్రాతిపదికగా తీసుకుంటారు?
జ. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా నిర్ధిష్ట సర్వీస్‌ను నిర్ధిష్ట అభ్యర్ధికి కేటాయించడం జరుగుతుంది. అంటే అతను/ఆమె ఎంచుకున్న సర్వీస్‌ ఆధారంగా, వారి కేటగిరిలోని ఖాళీల సంఖ్యను బట్టి, మెడికల్‌ బోర్డు లేదా అప్పిల్లేట్‌ బోర్డు ఇచ్చే ఫలితాలను బట్టి నిర్ణయించబడుతుంది.

7. అనేక ప్రయత్నాల తర్వాత మాత్రమే సివిల్‌ సర్వీస్‌ పరీక్షలను క్లియర్‌ చేయడం జరుగుతుంది?
జ. ఇది నిజం కాదు. సరైన ప్లానింగ్, స్మార్ట్‌ వర్క్‌ ద్వారా నిర్ధిష్ట కాలవ్యవధిలో సింగిల్‌ అటెంప్ట్‌లో సివిల్‌ సర్వీస్‌ పరీక్షలను క్లియర్‌ చేయవచ్చు. ఒక వేళ అది మీ చివరి ప్రయత్నం అయినాసరే సాధ్యమౌతుంది.

8. అధిక సంఖ్యలో పుస్తకాలను చదవలసిన అవసరం ఉంటుందా ?
జ. అవసరం లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు అధిక మొతాదులో చదవవలసి ఉంటుందనడం నిజమేకానీ, ప్రతిదీ చదవలసిన అవసరం లేదు. పరీక్షకు సంబంధించిన అంశాల్లో (టాపిక్స్‌) పరిమితులు ఉంటాయి. మీరు ప్రిపరేషన్‌కు సిద్ధం చేసుకున్న ప్లాన్‌ ప్రకారంగా ఎంత సమయం వెచ్చించగలరో మీ శక్తి సామర్ధ్యాలను బట్టి సబ్జెక్ట్ మొత్తం కవర్‌ చేయడానికి ప్రయత్నించాలి.

9. ప్రతి సబ్జెక్టులో పాండిత్యం సాధించేంతగా ప్రిపేర్‌ అవ్వాలా ?
జ. అంతగా అవసరం లేదు. ప్రతి సబ్జెక్టులోని కాన్‌సెప్ట్స్‌కు సంబంధించిన బేసిక్‌ విషయాలతోపాటు కొంచెం లోతుగా చదివితే సరిపోతుంది. ప్రతి సబ్జెక్టుపై ఎటువంటి స్పెషలైజేషన్‌ కానీ, స్కాలర్‌ రీసెర్చ్‌ కానీ అవసరం లేదు.

10. ప్రతి రోజు నేను ఎన్ని గంటలు చదవాలి ?
జ. గుడ్‌ ప్రిపరేషన్‌ ఎన్ని గంటలు చదివాం అనే దానిపై ఆధారపడదు. విస్తృత స్థాయిలో ఉన్న సిలబస్‌ మొత్తం కవర్‌ చేయాలంటే కావల్సింది శ్రద్ధ, స్వయం కృషి మాత్రమే. దానికి గంటల సంఖ్యతో అవసరం లేదు. కాన్‌సెప్ట్‌ వారీగా అన్ని టాపిక్‌లను పూర్తిచేయడానికి ఎంత సమయం కేటాయించాలో అంత కేటాయిస్తే సరిపోతుంది.

11. నోట్స్‌ తయారు చేయడం అవసరమా ? పరీక్షలకు ముందు వేగంగా రివిజన్‌ చేయాలంటే నోట్స్‌ ఏవిధంగా తయారు చేయాలి ?
జ. పరీక్షలకు ముందు త్వరగా రివిజన్‌ చేయడానికి నోట్స్‌ అవసరమని భావిస్తే తయారుచేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేయాలనే నిబంధన ఏమీ లేదు. మీరు టెక్ట్స్‌ బుక్స్‌లలో, ఇంటర్‌నెట్‌ లేదా ఇతర పద్ధతుల్లో చదువుతున్నట్లయితే మీకు సౌలభ్యంగా ఉండే విధానం ద్వారా రివిజన్‌ చేయవచ్చు. ఏదేమైనా, అనేక మంది అభ్యర్ధులు సూచించేదేంటంటే.. పరీక్షకు ముందు త్వరగా రివిజన్‌ చేయడానికి నోట్స్‌ తయారు చేసుకోవడం ఉత్తమం.

12. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఏ విధంగా చదవాలి, నోట్స్‌ ఎలా తయారు చేసుకోవాలి ?
జ. ఎన్సీఈఆర్టీ పుస్తకాలనైతే, నవలలను చదివినట్టు చదవడానికి ప్రయత్నించాలి. ప్రతిదీ గుర్తుంచుకోవాలనే దృక్పధంతో చదవొద్దు. ఏందుకంటే వాటిని బాగా అర్ధం చేసుకోవడం ముఖ్యం. అలాగే కాన్‌సెప్ట్స్‌ అర్ధమవ్వడానికి మల్టిపుల్‌ రీడింగ్‌ కూడా ఉపయోగపడవచ్చు.

13. మెయిన్స్‌ పరీక్షలకు ఏ నెల నుంచి కరెంట్‌ అఫైర్స్‌/మ్యాగజైన్స్‌/న్యూస్‌ పేపర్ల రివిజన్‌ ప్రారంభించాలి ?
. మెయిన్స్‌ పరీక్షలకైతే, ఏడాది మొదటి నెల నుంచే కరెంట్‌ అఫైర్స్‌ రివిజన్‌ ప్రారంభించాలి. ఫిబ్రవరి లేదా మార్చి నుంచి ప్రారంభిస్తే ఇంకా మంచిది.

14. ఫస్ట్‌ అటెంమ్ట్‌లోనే సివిల్స్‌ సాధించడానికి ఎంత సమయం కేటాయించాలి ?
జ. ఫస్ట్‌ అటెంమ్ట్‌లోనే సివిల్స్‌ సాధించడానికి కనీసం 12 నుంచి 18 నెలల ప్రిపరేషన్‌ అవసరం అవుతుంది. కొంత మందికి ఎక్కువ సమయం కూడా తీసుకుంటారు.

15. ఇంటర్వ్యూ పార్ట్‌ నిజంగానే డిసైడింగ్‌ ఫ్యాక్టరా? మెయిన్స్‌లో ఒక వ్యక్తి ఆసామాన్యమైన ప్రతిభ కనపరచినప్పటికీ, ఇంటర్వ్యూ అతని విజయావకాశాలను నిర్ణయిస్తుందా?
జ. అవును. సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌లో ప్రతి విభాగానికి తనదైన ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా చాలా ముఖ్యమైన విభాగం.

16. కొంత మంది జీవితమంతా పోరాడినా సివిల్స్‌లోవిజయం సాధించలేరు. కొందరు విద్యార్ధులు ఇతర సర్వీసుల్లో జాయిన్‌ అయినప్పటికీ కేవలం రెండు అటెంప్ట్‌లలో సాధిస్తారు. వారు భిన్నంగా ఏం చేస్తారు ?
జ. ఎవరైతే తమ అన్ని ప్రయత్నాల్లో సివిల్స్‌లో విజయం సాధించలేకపోతారో అది వారి అదృష్టమో లేదా దురదృష్టమో అయ్యి ఉంటుంది. దయచేసి గుర్తుంచుకోండి యూపీఎస్సీ ఆశించేది ‘ది బెస్ట్‌ ఆఫ్‌ ది టాలెంట్‌’ మాత్రమే. కేవలం నిబద్ధత, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి మొదలైనవి ఉన్నంత మాత్రాన ఎంపికకాలేరు. అన్ని పరీక్షల్లో కూడా వారు అసాధారణమైన ప్రతిభ కనబరచడం చాలా ముఖ్యం.
ఒకసారి విజయం సాధించినవారికి, రెండోసారి కూడా విజయం సాధించడం అంత కష్టమేమీకాదు. అటువంటి వారికి ప్రిపరేషన్‌ అవసరం లేదు. ఎందుకంటే వారి ఆత్మవిశ్వాసం అధికమోతాదులో ఉంటుంది. తమ ప్రతిభకు కొద్ది పాటి మెరుగులు దిద్దుకుంటే చాలు, మెరుగైన ర్యాంక్‌ సాధించి, చాలా సులువుగా వారుకోరుకునే క్యాడర్‌ను పొందుతారు.

17. పరీక్ష ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వయోపరిమితి ప్రభావితం చేస్తుందా ? 20 ప్రారంభంలో లేదా చివరిలో ప్రయత్నించినా ఏ మార్పు ఉండదా? అధిక వయసు వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందా ?
జ. అది నిజం కాదు. వయసు పట్టింపు ఉండదు. ఇంటర్వ్యూ దశలో కూడా వయసు కారణంగా చేదు అనుభవాలు చవిచూసిన దాకలాలు ఇంతవరకూ లేవు.

18. సమాధానం ఎంత నిడివిలో రాయాలి ? ఒకవేళ గరిష్ట నిడివిని మించి రాస్తే మార్కుల్లో కోత విధిస్తారా?
జ. మ్యాగ్జిమమ్‌ లెన్త్‌ను కొంచెం క్రాస్‌ చేస్తే మార్కుల్లో కోత విధించరు. కానీ పరిమితికి మించితే మాత్రం సూచనలు పాటించని కారణంగా మార్కులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా, మీరు ఎందుకు మాగ్జిమమ్‌ లిమిట్‌ ను దాటాలని అనుకుంటున్నారు? ప్రశ్నల సరళి రోజురోజుకు టఫ్‌గా మారుతున్న కారణంగా సూచించిన సమయంలో పేపర్‌ రాయడానికే సరిపోతుంది. అధనంగా రాస్తే సమయం వృధా అవుతుంది కాబట్టి ఆ సమయంలో ఇతర ప్రశ్నలను రాయడానికి ప్రయత్నించండి. ప్రశ్నాపత్రంలో సూచించిన విధంగా పదాల పరిమితికిలోబడి సమాధానాలు రాయాలి. మీరు చాలామటుకు గరిష్ఠ పరిమితికి లోబడే సమాదానాలు పూర్తిచేయవచ్చు. గుర్తుంచుకోండి... పదాలను నింపడానికి మాత్రం అసలు ప్రయత్నించవద్దు.

19. నా ప్రధాన సబ్జెక్టు (కోర్‌ సబ్జెక్ట్‌)లను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవచ్చా?
జ. మీకు ఆసక్తి ఉన్న ఏ సబ్జెక్టునైనా ఎంపిక చేసుకోవచ్చు. కోర్‌ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడం చాలా మంచి ఆలోచన.

20. సైన్స్‌ గ్రాడ్యుయేట్లు ఆంత్రొపాలజీ లేదా సోషల్‌ సైన్స్‌లను ఎందుకు ఎంపిక చేసుకుంటారు ?
జ. ఆప్షనల్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు, ఈ కింది అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించుకోవాలి.
1. సిలబస్‌ పరిమాణం
2. ఇన్‌స్టిట్యూట్స్, సీనియర్స్, సోర్సెస్‌ లేదా మెటీరియల్‌ లభ్యత
3. అ సబ్జెక్ట్‌ జనరల్‌ స్టడీస్‌కు ఉపయోగకరంగా ఉండాలి
4. ఎంచుకున్న సబ్జెక్టుపై ఆసక్తి ఉండాలి

21. ప్రభుత్వ వెబ్‌సైట్‌లను ఎలా ఉపయోగించుకోవచ్చు ? వాటిని ఎలా చదవాలి?
జ. పరీక్షాకోణంలో లేదా న్యూస్‌కు సంబంధించిన డేటా, ఫ్యాక్ట్‌ లేదా సమచారానికి చెందిన ఏ లింక్‌ అయినా ఉపయోగపడుతుంది. వెబ్‌లింక్‌ సెక్షన్‌లను చెక్‌ చెయ్యడం ద్వారా న్యూస్‌ పేపర్‌ లేదా మ్యాగజైన్‌లలో మీరు ఇది వరకే ఇదివిన (పునరావృతమయ్యే) సమాచారాన్ని కనుగొనవచ్చు. అదేవిధమైన సమాచారాన్ని కనుగొన్నప్పుడు మీరు ఆ సమాచారాన్ని ఇదివరకే కవర్‌ చేశారని గుర్తిస్తారు.

22. నాకు జాబ్‌ లేదా ఇన్‌కమ్‌ సోర్స్‌ ఏదీ లేదు. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ సందిగ్ధంతో కూడుకున్నది. ఒక సంవత్సరమంతా చదివే దైర్యసాహసాలు నాకు లేవు. ఇప్పుడు నేనేమి చెయ్యాలి?
జ. నీకు నమ్మకం (కాన్ఫిడెన్స్‌) అవసరమని దానర్ధం. నీ శక్తిసామర్ధ్యాలను గురించి కూడా నీవు తెలుసుకోవాలి. నిజానికి, ఈ ఎగ్జాం ప్రతి ఒక్కరూ రాయాలనే నియమమేమీలేదు. ఇది కాన్ఫిడెన్స్‌ (నమ్మకం)తో ఉన్న వారి కోసమే. అలాగే ఇతరుల్లో నమ్మకాన్ని నింపగలిగే వారికోసం కూడా. మీ పూర్తి సమయాన్ని, మైండ్‌ను ప్రిపేర్‌ అవ్వడానికి కేటాయించగలరో లేదో ముందుగా నిర్ణయించుకోవాలి.

23. సివిల్‌ సర్వీస్‌కు సన్నద్ధమయ్యే మొత్తం ప్రోసెస్‌లో నన్నునేను ఏ విధంగా మోటివేట్‌ చేసుకోవాలి? ఫియర్‌ ఆఫ్‌ ఫెయిల్యూర్‌ను ఏ విధంగా అధిగమించాలి? ఫెయిల్యూర్‌ (వైఫల్యాల)తో ఏ విధంగా పోటీపడాలి?
. తనను తాను ప్రతి సందర్భంలో ప్రోత్సహించుకోవడం లేదా ఉత్సాహపరచుకోవడం అంత సులువు కాదు. మన మోటివేషన్‌ లెవెల్స్‌లో ఎత్తుపల్లాలు ఉంటాయి. మనం పడిపోయినప్పుడు మనల్ని మనం పునర్నవీకరించుకోవడం చాలా ముఖ్యం. జీవితంలో ఎత్తుపల్లాలు చాలా సహజం, కానీ దానినుంచి బయటపడి మీకై మీరు స్వయం కృషితో ముందుకు సాగడానికి ప్రయత్నించాలి.
అలాగే మోటివేషనల్‌ పుస్తకాలు కూడా చదవాలి. అంటే ఆరిజన్‌ స్వెట్‌ మార్డెన్‌ రచించిన ‘‘ఎవ్రివన్‌ ఏ కింగ్‌’’, నెపొలియన్‌ హిల్‌ రచించిన ‘‘థింక్‌ అండ్‌ గ్రో రిచ్‌’’ వంటి పుస్తకాలు చదవాలి. ప్రతికూలతను మీలోకి ఆహ్వానించకండి. మీరు జరిగిపోయిన వాటి గురించి చెడుగా ఆలోచిస్తున్నారనే విషయం గ్రహించండి, మీ యధాస్థితికి తిరిగి రావడానికి ఇదే మంచి సమయం అని భావించి మీరు సాధించేంత వరకూ అదే విధమైన ఆలోచనలో ఉండండి. పతనం నుంచి త్వరగా సాధారణ స్థితికి రావడం సాధన చేయండి. చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి. అపజయాలనేవి సర్వసాధారణం, వాటినుంచి ఈ విధంగా బయటపడటానికి ప్రత్నించాలి. తద్వారా పడిపోయే పరిస్థితులు సంభవించినప్పుడు భయపడరు. మీ స్వప్రయత్నాల వల్లనే మీ జీవితాన్ని పైకి తీసుకువెళ్లాలనే విషయం మరచిపోకండి.
మీ జీవితానికి మీరే స్పూర్తి. మీ ప్రిపరేషనే మీకు మోటివేషన్‌. ప్రిపరేషన్‌ సమయంలో ఫలితం గురించిన ఆలోచనను మీ మైండ్‌నుంచి పూర్తిగా తీసివేయండి. ఫలితం గురించి ఆలోచిస్తూ ప్రిపేర్‌ అవ్వలేరు. మీ పూర్తి ఏకాగ్రతను ప్రిపరేషన్‌ మీద ఉంచినట్లయితే భయంకానీ, ఆందోళన కానీ మీ దరి చేరదు. అప్పుడు తగిన ఫలితం దానంతట అదే మీ ముందుంటుంది.

24. డిప్రెషన్‌ ను ఏ విధంగా అధిగమించాలి ?
జ. మనుషులందరికీ వారిదైన రీతిలో డిప్రెషన్‌ (నిరాశ లేదా కుంగుబాటు) ఉంటుంది. డిప్రెషన్‌ నుంచి బయటబడటానికి బెస్ట్‌ టెక్నిక్‌ ఏమిటంటే రోజూ చేసే పనుల నుంచి డైవర్ట్‌ అవ్వడం. మీరు నిజంగా మీ వర్క్‌ లేదా పరిస్థితుల వల్ల డిప్రెషన్‌లోకి వెళ్తే, మీరు తిరిగి మీ యథాస్థితికి చేరుకొనేంతవరకూ కొంత సమయం తీసుకోండి. సినిమాకు వెళ్లడం లేదా ఏదైనా మోటివేషనల్‌ బుక్‌ చదవడంవంటివి చెయ్యాలి.
25. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబ నేపథ్యమున్న వ్యక్తులు సివిల్స్‌కు ప్రయత్నించవచ్చా ?
జ. వాస్తవిక అనుభవాల నుంచి వేగంగా నేర్చుకోవడానికి కుటుంబ మార్గదర్శకత్వం ఉపయోగపడుతుంది. ఏదేమైనా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబ నేపథ్యమున్న వ్యక్తులు మరియు ఫస్ట్‌ జనరేషన్‌ ఎడ్యుకేటెడ్‌ వ్యక్తులు సివిల్స్‌ రాయడానికి సంకోచించనవసరం లేదు. దేశంలో ప్రతిష్టాత్మకమైన సర్వీసులకు పోటీ పడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నిబద్ధత మరియు కష్టపడేతత్వం కలిగినవారు ఎవరైనా ఈ సర్వీసులను చేపట్టవచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ను సాధించడానికి పేదరికం ఎప్పటికీ అడ్డంకి కాదు. ఆత్మవిశ్వాసం, నేర్చుకునేసామర్ధ్యం, అడ్డంకులను అధిగమించే లక్షణం ఇవన్నీ ఉంటే ఏదీ మిమ్మల్ని ఆపలేదు.

26. 20 లేదా 30 మార్కులకు సమాధానాలు రాసేటప్పుడు ఎన్నో అంశాలు, ఎన్నొన్నో పాయింట్లు ఏవిధంగా గుర్తుంచుకోవాలి ?
జ. చదివినవన్నీ గుర్తుంచుకోవడం అసాధ్యం. కాన్సెప్టులవారీగా చదివి, అర్ధం చేసుకోవడం మాత్రమే దీనికి ఏకైక మార్గం. ఈ విధంగా చేయడం ద్వారా మీ మెదడు చాలా విషయాలను గుర్తుంచుకోగలుగుతుంది. కంటెంట్‌ను సమర్ధవంతంగా గుర్తుంచుకోవడానికి మంచి పద్ధతి ఏంటంటే... చదివిన పుస్తకాలనే/మెటీరియల్‌ను తరచుగా మళ్లీ మళ్లీ చదవడం, రివిజన్‌ చేయడం. కాన్సెప్ట్‌లను గుర్తుకు తెచ్చుకుంటూ ఆన్సర్‌ పేపర్లు రాయడం తరచుగా ప్రాక్టీస్‌ చేయాలి.

27. ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్‌ పేపర్లకు ఏవిధంగా ప్రిపేర్‌ అవ్వాలి ?
జ. ఇవి వ్యక్తి నైతిక ప్రవర్తనకు సంబంధించినవి. ఎగ్జామినేషన్‌ దృక్కోణంలో, సివిల్‌ సర్వెంట్లుగా పనిచేయడానికి ఉండవల్సిన ప్రాముఖ్యమైన అంశాలను పరీక్షిస్తారు. చేసే పనిలో నీతి, పాలన, రాజకీయాలు అనేవి ప్రస్తుతం దేశంలో ప్రాధమిక చర్చనీయాంశాలు అదేవిధంగా వివాదస్పధమైనవి కూడా. ప్రజా పాలన, అధికారం అనేవి అనేక స్కాములు, లంచగొండితనంతో నశించిపోతున్నాయి. నీతి, నిజాయితీలను సమర్ధులైన వ్యక్తులు మాత్రమే కనబరచగలరు. ఈ లక్షణాలను పరీక్షించడానికే ఇటీవల కాలంలో జనరల్‌ స్టడీస్‌లో వీటిని కలపడం జరిగింది.

28. చదవాల్సిన ముఖ్యమైన న్యూస్‌ పేపర్లు, మ్యాగజైన్లు ఏవి?
జ. ఈ కింది మాస పత్రికల్లో (మ్యాగజైన్స్‌) ఏదైనా ఒకటి చదవండి
  • సివిల్‌ సర్వీసెస్‌ క్రానికల్‌
  • సివిల్‌ సర్వీసెస్‌ టైమ్స్‌

ఈ రెండింటిలో.. కంటెట్‌ను బట్టి ఎది ఉపయోగకరమో దానిని సెలెక్ట్‌ చేసుకోండి. పై వాటిలో ఒక రెగ్యులర్‌ మ్యాగజైన్‌తో పాటు యోజన మరియు కురుక్షేత్ర మాసపత్రికలను కూడా చదవాలి. ఫ్రంట్‌లైన్, ది ఎకనమిస్ట్‌ మ్యాగజైన్లలో విషయ ప్రాతిపదికన ఏదైనా ఒకటి చదవండి. ఇవి ఉపయోగకరమైనవే కానీ ఖచ్చితంగా చదవాలనే నియమమేమీ లేదు.
న్యూస్‌ పేపర్లు: ది హిందు, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేపర్లు చదవాలి. వీటిల్లో ప్రచురితమయ్యే వ్యాసాల్లో (ఆర్టికల్‌) ని సారాంసాన్ని సంక్షిప్తంగా పాయింట్ల వారీగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి.

Published date : 07 Oct 2021 01:27PM

Photo Stories