PM-YASAVI Scheme: 15000 పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. అర్హతలు ఇవే..
నేటికీ ఎంతోమంది ప్రతిభావంతులు ఫీజుల భారం కారణంగా చదువుకు దూరమవుతున్న పరిస్థితి!! ముఖ్యంగా..పేద విద్యార్థులు..ఆర్థిక పరిస్థితులు అనుకూలించక.. విద్యను మధ్యలోనే ఆపేస్తున్న వైనం! దీనికి పరిష్కారంగా.. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రోత్సాహకంగా.. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత శాఖ తాజాగా ప్రవేశ పెట్టిన పథకమే.. పీఎం యంగ్ ఎచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా ఫర్ ఓబీసీస్ అండ్ అదర్స్ (పీఎంయశస్వి)!! ఈ పథకం ద్వారా.. తొమ్మిదో తరగతి, పదకొండో తరగతిలో చేరి.. ప్రతి నెల స్కాలర్‌షిప్ పొందొచ్చు. యంగ్ ఎచీవర్స్ టెస్ట్(వైఈటీ) ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షకు ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. పీఎంయశస్వి పథకంతో ప్రయోజనాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం...
- యంగ్ ఎచీవర్స్ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు ప్రకటన విడుదల
- వెనుకబడిన వర్గాలకు ఆర్థిక ప్రోత్సాహం
- 9, 11 తరగతుల విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు
- ఎన్‌టీఏ నిర్వహించే వైఈటీ ద్వారా అర్హుల ఎంపిక
పీఎం యంగ్ ఎచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా(యశస్వి) పేరుతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా.. ప్రభుత్వ గుర్తింపు పొందిన టాప్ పాఠశాలల్లో చదువుతున్న ఓబీసీ, ఈబీసీ, డీనోటిఫైడ్ ట్రైబ్స్(డీఎన్‌టీ) వర్గాలకు చెందిన పిల్లలకు తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి నెల నిర్దిష్ట మొత్తంలో స్కాలర్‌షిప్ అందిస్తారు.
- తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఏటా రూ.75 వేలు; పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థులకు ఏటా రూ.1.25 లక్షలు చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తారు.
- ఇలా.. ఏటా జాతీయ స్థాయిలో దాదాపు 15000 మందికి ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తారు.
చదవండి: Govt Scholarships: తపాలా శాఖ–స్పర్ష్ యోజన స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ విడుదల..
విద్యార్హత
- తొమ్మిదో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 202122లో ఎనిమిదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
- పదకొండో తరగతికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 202122లో పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి
- తొమ్మిదో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్ 1, 2006 మార్చి 31, 2010 మధ్యలో జన్మించి ఉండాలి.
- పదకొండో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్ 1, 2004 మార్చి 31, 2008 మధ్యలో జన్మించి ఉండాలి.
పాఠశాలలకు ప్రామాణికాలు
ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ వర్గాలకు టాప్ క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. కాబట్టి సదరు పాఠశాలలకు కొన్ని ప్రామాణికాలను నిర్దేశించారు. సదరు పాఠశాలలో 10, 12 తరగతుల్లో వంద శాతం ఫలితాలు ఉండాలని సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. ఇలాంటి పాఠశాలలను గుర్తించేందుకు జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. అంటే.. ఈ స్కాలర్‌షిప్ అందుకోవాలంటే.. ఇలాంటి పాఠశాలల్లోనే విద్యార్థులు చదువుతుండాలి లేదా ప్రవేశం ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
చదవండి: PM YASASVI Scheme 2022: పాఠశాల విద్యార్థులకు ఎన్‌టీఏ–యశస్వి స్కాలర్‌షిప్
విద్యార్థులకూ నిబంధనలు
- పీఎం యంగ్ ఎచీవర్స్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు కూడా కొన్ని నిబంధనలు రూపొందించారు. అవి..
- కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి.
- మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్యలో 30 శాతం స్కాలర్‌షిప్స్‌ను మహిళా విద్యార్థులకు కేటాయించాలి.
- స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులకు కచ్చితంగా 75 శాతం హాజరు ఉంటేనే తదుపరి ఏడాది స్కాలర్‌షిప్‌ను కొనసాగిస్తారు.
ఎన్‌టీఏవైఈటీ ఇలా
పీఎం యంగ్ ఎచీవర్స్ స్కాలర్‌షిప్‌నకు విద్యార్థులను ఎంపిక చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో..యంగ్ ఎచీవర్స్ టెస్ట్(ఎన్‌టీఏవైఈటీ)ను నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌ను తొమ్మిదో తరగతి, పదకొండో తరగతి విద్యార్థులకు వేర్వేరుగా నిర్వహిస్తారు.
నాలుగు విభాగాలు.. 400 మార్కులు
- వైఈటీ పరీక్షను నాలుగు విభాగాల్లో 400 మార్కులకు నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు120 మార్కులు, సైన్స్ 20 ప్రశ్నలు80 మార్కులు, సోషల్ సైన్స్ 25 ప్రశ్నలు100 మార్కులు, జనరల్ అవేర్‌నెస్/నాలెడ్జ్ 25 ప్రశ్నలు100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు. పరీక్షను ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమంలో నిర్వహిస్తారు.
- తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ ఎనిమిదో తరగతి సిలబస్ ఆధారంగా, పదకొండో తరగతి విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలను రూపొందిస్తారు.
రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా
- ఎన్‌టీఏ నిర్వహించే వైఈటీలో విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా.. రాష్ట్రాల వారీగా ఆయా వర్గాలకు నిర్దిష్ట సంఖ్యలో స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తారు. మెరిట్ జాబితా, ఆయా వర్గాలకు కేటాయించిన స్కాలర్‌షిప్‌ల సంఖ్య ఆధారంగా ముందు వరుసలో ఉన్న వారికి వీటిని మంజూరు చేస్తారు.
- ఎంపికైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ మొత్తాన్ని విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే విధానం (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) అమలు చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులు సొంతగా బ్యాంకు ఖాతాను కలిగుండాలి. అదే విధంగా ఆధార్ కార్డ్ కూడా ఉండాలి.
మంచి స్కోర్‌కు మార్గాలివే
వైఈటీలో మంచి మార్కులు సాధించడానికి తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ ఏడు, ఎనిమిది తరగతుల పుస్తకాలు.. పదకొండో తరగతి అభ్యర్థులు ఎన్‌సీఈఆర్‌టీ పదో తరగతి పుస్తకాలు అభ్యసనం చేయాలి. అన్ని సబ్జెక్ట్‌లలోని ముఖ్యాంశాలను చదవాలి. ముఖ్యంగా సైన్స్, మ్యాథమెటిక్స్‌లో ఆయా సిద్ధాంతాలు, సూత్రాలు, భావనలను చదవాలి. నేచురల్ సైన్స్‌కు సంబంధించి వ్యాధులు, బ్యాక్టీరియాలు, మానవ శరీర నిర్మాణం, కణజాలం, కిరణజన్య సంయోగ ప్రక్రియ వంటి కీలకమైన అంశాలను చదవాలి. సోషల్ సైన్సెస్‌లో హిస్టరీ, జాగ్రఫీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఎబిలిటీ విభాగంలో రాణించేందుకు.. జనరల్ నాలెడ్జ్ అంశాలను తెలుసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులు, నూతన నియామకాలు, సదస్సులు, సమావేశాలు, ముఖ్యమైన ప్రదేశాలు,క్రీడలువిజేతలు, వ్యక్తులుఅవార్డులు, దేశాలురాజధానులు, దేశాలుకరెన్సీ వంటివాటిపై అవగాహన పెంచుకోవాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ప్రతి అధ్యాయం చివరలో ఉండే కొశ్చన్స్/ఎక్సర్‌సైజ్‌లను ప్రాక్టీస్ చేయడం మేలు చేస్తుంది.
వైఈటీకి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు
పీఎం యంగ్ ఎచీవర్స్ స్కాలర్‌షిప్‌నకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించే యంగ్ ఎచీవర్స్ టెస్ట్‌కు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి.. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డ్; పుట్టిన తేదీ ధ్రువ పత్రం; ఆధార్ నెంబర్; విద్యార్హతల సర్టిఫికెట్లు; ఫొటోగ్రాఫ్; సంతకం; కుల ధ్రువీకరణ పత్రం; ఆదాయ ధ్రువీకరణ పత్రం; దివ్యాంగ విద్యార్థులు పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌ను కూడా అప్‌లోడ్ చేయాలి.
ఎన్‌ఐటీవైఈటీ 2022 ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్ట్ 26, 2022
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: సెప్టెంబర్ 5 నుంచి
- ఎన్‌టీఏవైఈటీ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 11(మధ్యాహ్నం 2 గంటల నుంచి 5గంటల వరకు)
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అమరావతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://yet.nta.ac.in, www.nta.ac.in, https://socialjustice.gov.in