Skip to main content

NEET 2024: ‘నీట్‌’ పరీక్షలో ఆలిండియా టాపర్స్‌.. ఈసారి కటాఫ్‌ మార్కులు పెరగడంతో

NEET 2024  Gugulot Venkata Nripesh  NEET Top Ranker in ST Category

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్‌’పరీక్షలో ఎస్టీ కేటగిరీలో ఆలిండియా టాప్‌ ర్యాంకర్‌గా తెలంగాణకు చెందిన గుగులోత్‌ వెంకట నృపేష్‌ నిలిచాడు. రెండో ర్యాంకర్‌గా లావుడ్య శ్రీరామ్‌ నాయక్‌ ప్రతిభ చాటాడు. టాప్‌ ర్యాంకర్‌గా నిలిచిన నృపేష్‌కు 720 మార్కులకుగాను, 715 వచ్చాయి. జాతీయస్థాయిలో అతను జనరల్‌ కేటగిరీలో 167వ ర్యాంకు సాధించాడు. అలాగే తెలంగాణ రాష్ట్రస్థాయి టాపర్‌గా అనురాన్‌ ఘోష్‌ ప్రతిభ చాటాడు. అతను జాతీయస్థాయిలో జనరల్‌ కేటగిరీలో 77వ ర్యాంకు సాధించాడు. 

ఆలిండియా టాప్‌ ర్యాంకర్‌గా నిలిచిన మహారాష్ట్రకు చెందిన వేద్‌ సునీల్‌ కుమార్‌ షిండే సహా 67 మందికి ఫస్ట్‌ ర్యాంకులు ప్రకటించారు. ఫస్ట్‌ ర్యాంకర్‌కు 99.997129 పర్సంటైల్‌ రాగా, తెలంగాణ ఫస్ట్‌ ర్యాంకర్, జాతీయస్థాయి 77వ ర్యాంకర్‌ అనురాన్‌ ఘోష్‌కు 99.996614 పర్సంటైల్‌ వచ్చింది. ఎస్టీ టాపర్‌ నృపేష్‌కు 99.987314, అదే కేటగిరీలోని రెండో ర్యాంకర్‌ లావుడ్య శ్రీరామ్‌ నాయక్‌కు 99.969357 పర్సంటైల్‌లు వచ్చాయి. గతంలో తెలంగాణ నుంచి టాప్‌ ర్యాంకర్లు ఎక్కువగా ఉండేవారనీ, ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో ర్యాంకర్లు లేరని ఒక విద్యా నిపుణుడు వ్యాఖ్యానించారు. 

రాష్ట్రం నుంచి 47,371 మంది అర్హత 
ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 5న నీట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. గతేడాది దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 20.38 లక్షల మంది హాజరు కాగా, ఈసారి 23.33 లక్షల మంది హాజరయ్యారు. గతేడాది 11.45 లక్షల మంది అర్హత సాధించగా, ఈసారి 13.16 లక్షల మంది అర్హత సాధించడం విశేషం. రాసినవారూ అర్హత సాధించివారూ పెరిగారు. తెలంగాణ నుంచి గతేడాది 72,842 మంది హాజరుకాగా, 42,654 మంది అర్హత సాధించారు. ఈసారి 77,849 మంది హాజరు కాగా, 47,371 మంది అర్హత సాధించారు.  

NIT: నిట్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..


అర్హత మార్కు జనరల్‌ కేటగిరీ 164 
ఈసారి అర్హత మార్కు పెరిగింది. నీట్‌ పరీక్ష సులువుగా ఉండటం వల్లే ఈసారి అర్హత మార్కు పెరిగిందని నిపుణులు అంటున్నారు. గతేడాది జనరల్‌ కేటగిరీ/ ఈడబ్ల్యూఎస్‌లో అర్హత మార్కు 137 ఉండగా, ఈసారి అది 164 ఉండటం గమనార్హం. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్‌ పీహెచ్, ఎస్సీ అండ్‌ పీహెచ్‌ల అర్హత మార్కు గతేడాది 107గా ఉండగా, ఈసారి 129గా ఉంది. అన్‌ రిజర్వుడు/ఈడబ్ల్యూఎస్‌ అండ్‌ పీహెచ్‌ల అర్హత మార్కు గతేడాది 121 ఉండగా, ఈసారి 140గా ఉంది. 

ఎస్టీ అండ్‌ పీహెచ్‌లో గతేడాది అర్హత మార్కు 108 ఉండగా, ఈసారి 129గా ఉంది. గతేడాది 450 మార్కులు వచ్చిన వారికి జనరల్‌ కేటగిరీలో కన్వీనర్‌ కోటాలో సీటు రాగా, ఈసారి 500 మార్కులు దాటిన వారికి కూడా కన్వీనర్‌ కోటాలో సీటు రావొచ్చని శ్రీచైతన్య సంస్థల డీన్‌ శంకర్‌రావు విశ్లేషించారు. గతేడాది 600 మార్కులు వచ్చిన వారికి ఆలిండియా ర్యాంకు 30 వేలు ఉండగా, ఈసారి అదే మార్కు వచ్చినవారికి 82 వేల ర్యాంకు రావడం గమనార్హం. అంతేకాదు గతేడాది 720కి 720 మార్కులు వచ్చినవారు దేశవ్యాప్తంగా ఇద్దరు మాత్రమే ఉండగా, ఈసారి 67 మంది ఉన్నారు. 

త్వరలో రాష్ట్రస్థాయి ర్యాంకులు 
ఆలిండియా ర్యాంకులు ప్రకటించిన జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)... తదుపరి రాష్ట్రాల వారీగా అభ్యర్థుల జాబితాను తయారు చేస్తుంది. అనంతరం ఆ డేటాను రాష్ట్రాలకు పంపిస్తుంది. ముందుగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కోసం ఆలిండియా ర్యాంక్‌ ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. అభ్యర్థులు తమ రాష్ట్రానికి దరఖాస్తు చేసినప్పుడు, వారు రాష్ట్ర కేటగిరీ జాబితా ప్రకారం విభజిస్తారు. రాష్ట్ర కౌన్సెలింగ్‌ అధికారులు తదనుగుణంగా వారి మెరిట్‌ జాబితాను తయారు చేస్తారు. 15 శాతం ఆలిండియా కోటా సీట్లను డీమ్డ్‌ వర్సిటీలు, సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఈఎస్‌ఐసీ, ఏఎఫ్‌ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూలోని ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. 

JEE Advanced 2024: 9న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు.. రెస్పాన్స్‌ షీట్‌ మాత్రం ఈ రోజే..

అభ్యర్థులు మరింత సమాచారం కోసం www.mcc.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అభ్యర్థులు 15 శాతం ఆలిండియాకోటా సీట్లకు దరఖాస్తు చేస్తారు. సీట్లు అయిపోయిన తర్వాత కౌన్సెలింగ్‌ నిలిపివేస్తారు. కౌన్సెలింగ్‌ వివరాలు, షెడ్యూల్‌ను ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహా రాష్ట్రాల వైద్య విద్యా డైరెక్టరేట్ల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర కోటా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఇతర సీట్ల కోసం అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆలిండియా ర్యాంక్‌ ఆధారంగా సంబంధిత కౌన్సెలింగ్‌ అధికారులతో మెరిట్‌ జాబితా తయారు చేస్తారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ కూడా సంబంధిత స్టేట్‌ కౌన్సెలింగ్‌ అథారిటీనే నిర్వహిస్తుంది. నీట్‌ ఫలితాల డేటాను బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలకు కూడా వినియోగించుకోవచ్చు. గుర్తింపు పొందిన వెటర్నరీ కళాశాలల్లో 15 శాతం కోటా కింద బీవీఎస్‌సీ అండ్‌ ఏహెచ్‌ కోర్సుల అడ్మిషన్లకూ ఈ ఫలితాల డేటాను ఉపయోగించుకోవచ్చు.  

Published date : 05 Jun 2024 12:54PM

Photo Stories