Skip to main content

NEET 2022: ఇదంత ‘నీట్’ కాదేమో!

NEET 2022
ఇదంత ‘నీట్’ కాదేమో!

మొదలైన ముహూర్తబలమో ఏమో కానీ, కొన్ని నిత్యం వివాదాస్పదమే. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం కేంద్రం కొన్నేళ్ళ క్రితం ఆరంభించిన ‘జాతీయ ఉమ్మడి అర్హత – ప్రవేశ పరీక్ష’ (NEET) అందుకు ఓ ఉదాహరణ. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కొంతకాలంగా ఉన్న ‘నీట్‌’ వ్యతిరేకత చాలదన్నట్టు, ఆదివారం నాటి పరీక్ష వివాదాల్లో మరో మెట్టు పైకెక్కింది. ఆడవారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడానికి వేదికైంది. కేరళలోని ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులతో ‘బ్రాసరీలు’ విప్పించి, ఆ తర్వాతే పరీక్ష రాయడానికి అనుమతించిన ఘటన అత్యంత హేయమైనది. ‘నీట్‌’ సహా అనేక పరీక్షల్లో ఆడపిల్లల్ని వేధించడానికి అనువుగా మారిన అర్థరహిత ‘దుస్తుల నిబంధ నల’పై చర్చ జరగాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోంది. ఒక్క మార్కుతో జాతకాలే మారే చోట మాస్‌ రిగ్గింగ్‌తో ‘నీట్‌’ ప్రయోజనమే ప్రశ్నార్థకమవుతోంది.

చదవండి: NEET 2022 Rank Predictor : నీట్‌-2022 ప‌రీక్ష రాశారా..? మీకు వ‌చ్చే మార్కుల‌కు ఎంత ర్యాంక్ వ‌స్తుందో తెలుసా..?

‘నీట్‌–2022’కు దేశవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. జూలై 17న 497 పట్నాల్లో 3,570 కేంద్రాల్లో ‘National Testing Agency’ (NTA) పరీక్ష నిర్వహిం చింది. త్వరలోనే ఫలితాలు విడుదల చేయాలి. తీరా పరీక్షలో అక్రమాల నేపథ్యంలో మళ్ళీ పరీక్ష పెట్టాలనే వాదన వినిపిస్తోంది. ఇన్నేళ్ళయినా నిక్కచ్చిగా ఒక పరీక్ష పెట్టలేకపోవడం సర్కారీ చేతకానితనమే. కరోనా వల్ల తరగతులే సరిగా జరగలేదంటూ, పరీక్ష వాయిదా కోరుతూ విద్యా ర్థులు వీధికెక్కినా, వారి గోడు విన్నవారు లేరు. ఇప్పుడేమో హిందీ మాధ్యమ అభ్యర్థులకు ఆంగ్ల ప్రశ్నపత్రాల పంపిణీ, ఆడవారి ఆత్మ గౌరవాన్ని హరించే ‘డ్రెస్‌ కోడ్‌’ లాంటివి మరింత తల వంపులు తెచ్చాయి. కనీసం అభ్యర్థి రాసే మీడియమ్‌లోని పేపరైనా ఇవ్వలేకపోతే, మార్కుల నష్టానికి పూచీ ఎవరు?

చదవండి: NEET 2022: మధ్యస్తం నుంచి కఠినం

రాష్ట్రాల స్థానిక ప్రవేశపరీక్షలతో పోలిస్తే, ‘నీట్‌’ లోపరహితమనీ, వైద్యవిద్యలో ప్రవేశాలు పారదర్శకంగా సాగుతాయనీ కేంద్ర వర్గాల మాట. పరీక్షలో ప్రమాణాలు పెంచడం ఓకే కానీ, నిర్వహణలో లోపాలే విద్యార్థులకు శాపాలు. తాజా ‘నీట్‌’లో మాస్‌రిగ్గింగ్‌కు తెర తీసిన 8 మంది నిందితులను సీబీఐ అరెస్టు చేయడం అందుకు మచ్చుతునక. పరీక్ష రాయాల్సిన అసలు అభ్యర్థుల స్థానంలో వేరొకరెళ్ళి రాస్తున్నారంటే ‘నీట్‌’లో అక్రమాలకు ఆస్కారమే లేదని ఎలా అంటాం? పైగా, ఢిల్లీ, హరియాణా ల్లోని పలు కేంద్రాల్లో ఇదే తంతు! పరీక్ష మర్నాడు పుంజీడు మంది పట్టుబడ్డా, దొరకని దొంగలు ఎందరున్నారో ఎవరు చెప్పగలరు?

చదవండి: NEET 2022 Question Paper with Key : నీట్‌-2022 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' కోసం క్లిక్ చేయండి.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

రాజస్థాన్‌లో ఓ చోట నిర్ణీత గడువు ముగిసిన తర్వాతా పరీక్ష కొనసాగుతూనే ఉంది. సాక్షాత్తూ ఓ ఎంపీ ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కొన్నిచోట్లయితే... బయో మెట్రిక్‌ హాజరు తీసుకోకుండానే అందరినీ పరీక్షకు అనుమతించారనీ, అయినవాళ్ళయిన అభ్యర్థులకు అనుకూలంగా ఉండేలా ‘నీట్‌’ పేపర్లనే మార్చేశారనీ వార్త. ప్రతిష్ఠాత్మక ‘ఎన్టీఏ’ పరీక్షలు నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఇంత సంబడంగా సాగుతోందంటే ‘నీట్‌’ ఏ మాత్రం నీటుగా నడుస్తోందో వేరే చెప్పనక్కర్లేదు.

చదవండి: NEET -SS 2021 : సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో చేరాల‌నుకుంటున్నారా? అయితే ఇది మీ కోస‌మే..

వాములు తింటున్న స్వాముల్ని వదిలేసి, కనబడని సూదుల కోసం వెతికినట్టు... అక్రమార్కుల కన్నా ఆడవారి లోదుస్తులకుండే లోహపు కొక్కీ ‘నీట్‌’ పరీక్షకులకు అభ్యంతరకరంగా, ప్రమాద కరంగా కనిపించడం పరాకాష్ఠ. పరీక్ష రాయాల్సిన పిల్లలు ఏడుస్తున్నా కరగక, ‘లోదుస్తులు ముఖ్యమా, భవిష్యత్తు ముఖ్యమా’ అని ప్రశ్నించి, లోదుస్తులు విడిస్తే తప్ప పరీక్ష రాయనివ్వని పరిస్థితి కల్పించారంటే మనం ఏ నాగరక సమాజంలో ఉన్నట్టు? ఆ షాక్‌లోనే పరీక్ష రాసిన పిల్లల్ని తిరిగి చాటుగా ఆ దుస్తులను ధరించనివ్వక, అదేదో పరీక్షా కేంద్రం బయటకెళ్ళి చేసుకొమ్మనడం ఎంత రాక్షసత్వం? ఈ కర్కశత్వంతో హృదయం గాయపడిన ఆ చిన్నారులకు ఏ మందు రాస్తే గాయం మానుతుంది? జీవితాంతం వేధించే దారుణ అనుభవానికి తోడు అసలేమీ జరగలేదనీ, విద్యార్థిని అబద్ధమాడుతోందనీ ‘ఎన్టీఏ’ బుకాయించడం విడ్డూరం. చివరకు మరో నలుగురు పిల్లలు ముందుకొచ్చి, తమకూ ఎదురైన అదే అనుభవాన్ని వెల్లడించాల్సి వచ్చిందంటే మన ప్రవేశ పరీక్షల్లోని పాశవిక నిబంధనల్ని ఏమనాలి?

చదవండి: NEET-UG 2021: నీట్‌ రాసారా.. ఇది మీ కోసమే!

గతంలోనూ ‘నీట్‌’లో ఇలాంటివే జరిగాయి. 2017లో కేరళలోనే కన్నూరులోని ఓ పరీక్షా కేంద్రంలో లోదుస్తుల్ని విప్పమని నలుగురు స్కూలు టీచర్లు ‘అతిగా ప్రవర్తించి’, ఆనక సస్పెండ య్యారు. అప్పట్లో సీబీఎస్‌ఈ నిర్వహించిన ‘నీట్‌’ ఇప్పుడు ‘ఎన్టీఏ’ చేతికొచ్చింది. పాత ‘అతి’ మాత్రం మారలేదు. చీటీలు పెట్టకుండా, ఆధునిక పరికరాలను వాడకుండా కట్టుదిట్టంగా పరీక్ష నిర్వహించాలనుకోవడం తప్పు కాదు. పొడుగు చేతుల దుస్తులు, బూట్లు వేసుకోకూడదన్నదీ అర్థం చేసుకోవచ్చు. కానీ, ‘ఆభరణాలు, లోహపు వస్తువులు ధరించ రాద’న్న నిబంధనను సాకుగా చేసు కొని, లోహపు కొక్కీతో ధరించే లోదుస్తులు విప్పేయాలనడం విపరీతం, వితండవాదం. వచ్చే జేఈఈ లాంటి అనేక ప్రవేశపరీక్షలకూ దాదాపు ఇవే నిబంధనలు గనక ఆడపిల్లల ఆత్మగౌరవ హననం అక్కడా పునరావృతం కాదన్న గ్యారంటీ లేదు. కేరళ విద్యా శాఖ మహిళా మంత్రి ఖండిం చినా, ఇప్పటికీ పెదవి విప్పని కేంద్ర పెద్దలు, బాధ్యులు ఇలాంటి ఘటనలకు తెరపడేలా చర్యలు చేపట్టాలి. ఇప్పటికే వివాదాలు, రిగ్గింగ్‌లతో ‘నీట్‌’ నవ్వులపాలైంది. రీ–ఎగ్జామ్‌ అంటూ పెట్టాల్సి వస్తే, అధికారుల వైఫల్యానికి మూల్యం చెల్లించేది – అమాయక విద్యార్థులు, వారి కుటుంబాలే!

Published date : 20 Jul 2022 06:31PM

Photo Stories