Skip to main content

తొలి కొలువు ఎంపికపైనే భవిష్యత్తు ప్రగతి

‘నేటి తరం విద్యార్థులు కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి సోపానమైన తొలి ఉద్యోగం ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
తమకు సరితూగే ఉద్యోగాలపై కసరత్తు చేసి కచ్చితమైన ప్లాట్‌ఫాంపై కాలు పెట్టాలి’ అంటున్నారు హెచ్.ఆర్.సర్వీసెస్ గ్రూప్ టీఎంఐ నెట్‌వర్క్ వ్యవస్థాపక డెరైక్టర్ టి.మురళీధరన్. తొలి కొలువు ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలతో ఇటీవల 'An Expert Guide to Your Right First Job' పుస్తకం రాశారు. ఆయనతో గెస్ట్ కాలమ్...

ప్రస్తుతం మన దేశంలో ఏటా దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు వివిధ డిగ్రీలతో జాబ్ మార్కెట్లో అడుగుపెడుతుంటే మరో 1.2 కోట్ల మంది ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. వీరిలో అధికశాతం నేటి జాబ్ మార్కెట్ అవసరాల మేరకు ఏదో ఒక ఉద్యోగంలో చేరుతున్నారు. కానీ కొన్ని రోజులకే అందులో నిలదొక్కుకోలేక అనాసక్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇది కంపెనీలో వారి పనితీరుపై, కెరీర్ అభ్యున్నతిపై ప్రతికూల ప్రభావం చూపడంతో నెలల వ్యవధిలోనే ఉద్యోగాలు వదిలేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు ఐటీ రంగం క్రేజ్ కారణంగా మొత్తం ఉద్యోగార్థుల్లో దాదాపు 50 శాతం మంది క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్, ఇతర మార్గాల ద్వారా అందులో అడుగుపెడుతున్నారు. కానీ, విధుల్లో చేరాక తమ వ్యక్తిగత ఆసక్తులకు భిన్నంగా ఉండే కెరీర్‌లో రాణించలేక ఆరేడు నెలల్లోనే రాజీనామా చేసి మళ్లీ కొత్త కెరీర్ అన్వేషణ ప్రారంభిస్తున్నారు.

తొలి జాబ్ ఎంపిక కీలకం:
ఇలాంటి కారణాలను పరిగణలోకి తీసుకుంటే.. సరైన మొదటి జాబ్ ఎంపిక అనేది ఎంతో ముఖ్యం. ఈ ఎంపికలో వ్యక్తిగత ఆసక్తులు, అకడమిక్ నైపుణ్యాలు, సరితూగే పరిశ్రమ/ సంస్థ ఇలాంటివెన్నో పరిశీలించి దరఖాస్తు ప్రక్రియకు ఉపక్రమించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా ’An Expert Guide to Your Right First Job' అనే పుస్తకం రాశాను. తొలి జాబ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి అనేక విషయాలు సవివరంగా పొందుపర్చాను. మొత్తం 18 చాప్టర్లుగా ఉన్న ఈ పుస్తకంలో వ్యక్తిగత ఆసక్తులకు అనుగుణంగా వ్యక్తిత్వానికి సరితూగే జాబ్ ప్రొఫైల్, పరిశ్రమ, సంస్థ, సరితూగే ప్రదేశం వంటి వాటికి సంబంధించి విలువైన సూచనలు సలహాలు ఉన్నాయి.

హోదా.. లేదా సంస్థ ప్రాధాన్యం:
ప్రస్తుతం చాలా మంది విద్యార్థులను వేధిస్తున్న సమస్య.. పెద్ద సంస్థలో చిన్న ఉద్యోగంలోనైనా చేరడమా? లేదా చిన్న సంస్థలో పెద్ద ఉద్యోగంలో చేరడమా? ముఖ్యంగా టైర్-1 ఇన్‌స్టిట్యూట్స్ (ఉదా: ఐఐఎంలు; ఐఐటీలు)లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ డ్రైవ్‌లో ఎంపికవుతున్న విద్యార్థుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం.. ఉద్యోగ హోదా కంటే తమకు సరితూగే సంస్థకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉద్యోగ విధుల్లో రాణించి అనతి కాలంలోనే సదరు రంగంలో గుర్తింపు పొందుతారు. ఫలితంగా భవిష్యత్తులో ఉన్నత అవకాశాలు స్వాగతం పలుకుతాయి.

శిక్షణ ద్వారా జాబ్ రెడీ స్కిల్స్
ఇటీవల కాలంలో వినిపిస్తున్న మరో మాట విద్యార్థుల్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉండట్లేదని లేదా కేవలం 20 నుంచి 25 శాతం విద్యార్థుల్లోనే జాబ్‌రెడీ స్కిల్స్ ఉంటున్నాయని! అయితే ఇక్కడ రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. స్కిల్ గ్యాప్ సమస్య ఎక్కువగా సాఫ్ట్‌వేర్ సంస్థలను వేధిస్తోంది. విద్యార్థుల డొమైన్ ఏరియాతో సంబంధం లేకుండా క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో ఆయా సంస్థలు అవకాశాలు అందిస్తున్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సైతం సాఫ్ట్‌వేర్ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ఇలాంటి వారి విషయంలోనే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సమస్య తలెత్తుతోంది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ నిర్వహించే సంస్థలు ఏడో సెమిస్టర్‌కే ఆ ప్రక్రియ పూర్తిచేసి.. ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలలపాటు ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లోనే తమ సంస్థ అవసరాలకు తగిన రీతిలో శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తే ఉద్యోగంలో చేరే తొలి రోజు నాటికి జాబ్ రెడీ స్కిల్స్ సొంతమవుతాయి.

ఎస్‌ఎంఈ సెక్టార్‌లో భారీ అవకాశాలు:
విద్యార్థులు, ఉద్యోగార్థులు కేవలం టాప్ కంపెనీలు, టాప్ పొజిషన్లు అనే ఆలోచనకే పరిమితం కాకుండా ముందుగా తమ అర్హతలు, ఆసక్తులకు సరితూగే ఉద్యోగంలో చేరాలి. ఈ క్రమంలో చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎస్‌ఎంఈ) భారీ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కానీ విద్యార్థులు వీటివైపు చూడట్లేదు. ఈ రంగంలోని సంస్థలు కూడా నియామకాల పరంగా శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబించకపోవడంతో నిపుణులైన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించే దిశగా టీఎంఐ గ్రూప్ ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో జాబ్స్‌డైలాగ్ సంస్థను ప్రారంభించాం. దీన్ని అటు రిక్రూటర్లకు, ఇటు ఉద్యోగార్థులకు ఉమ్మడి వేదికగా రూపొందించాం. ఈ జాబ్స్‌డైలాగ్ సంస్థలో ఎంఎస్‌ఎంఈ రంగలోని సంస్థలకు ఉద్యోగార్థులు రిజిస్టర్ చేసుకుంటే.. సంస్థల అవసరాలకు సరితూగే ప్రొఫైల్ ఉన్న అభ్యర్థులను వాటితో సంప్రదించే ఏర్పాటు చేశాం.

కొంత అనుభవం తర్వాతే స్టార్టప్స్
ఇటీవల కాలంలో మనదేశంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న రంగం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్ట్-అప్. ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించేందుకు కొన్ని పెద్ద సంస్థలు, వ్యక్తులు సీడ్ ఫండింగ్‌ను అందిస్తుండటం కూడా అభిలషణీయమే. అకడమిక్ స్థాయిలో ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ అందించే విధంగా పలు చర్యలు తీసుకోవడం కూడా ఆహ్వానించదగినదే. అయితే ఎంటర్‌ప్రెన్యూర్ ఔత్సాహికులు నేరుగా స్టార్టప్ దిశగా అడుగులు వేయకుండా.. కనీసం నాలుగేళ్లు పని అనుభవం గడించాక తమ ఆలోచనలను అమలు చేయడం ద్వారా వాస్తవ పరిస్థితులపై అవగాహన లభించడంతోపాటు నిర్వహణ నైపుణ్యాలు కూడా సొంతమవుతాయి. నేరుగా స్టార్టప్ ఏర్పాటు చేసి అనుభవ లేమితో నిరాశాజనక ఫలితాలు చవిచూస్తే అది జీవితంపైనే ప్రభావం చూపుతుంది.
Published date : 19 Jun 2015 12:58PM

Photo Stories