సామాజిక సేవే లక్ష్యంగా అడుగులు...
Sakshi Education
ఇది మన దేశం. మనమే మార్చుకోవాలి! సమస్యలుంటే మనమే పరిష్కరించుకోవాలి తప్ప... ఎవరో, ఎక్కడి నుంచో రారు!! ఇబ్బందులొస్తే మనమే ఎదుర్కోవాలి. అవసరమైతే ఎదురు నిలబడాలి. పరిస్థితులతో పోరాడాలి... గెలవాలి. అంతిమంగా.. అనుకున్న మార్పును సాధించాలి!!
సమస్యల్ని చూసి... మనకెందుకులే అని వెళ్లిపోయే వారు కొందరు! బాధపడి ఊరుకునేవారు ఇంకొందరు!! మరికొందరు మాత్రం... దాని పరిష్కారానికి దిగుతారు. అవసరమైతే అందరినీ కూడగడతారు. ఇదిగో... ఇక్కడ ప్రస్తావించిన వాళ్లూ అలాంటివాళ్లే. చేతిలోని డిగ్రీలను ఉద్యోగం తెచ్చే పాస్‌పోర్టులుగా వారు చూడలేదు. జీవితాల్ని బాగు చేయటానికి తమకు దక్కిన అర్హతగా భావించారు. అందులోనే తమ కెరీర్‌ను చూసుకున్నారు. జీవితాన్ని వెతుక్కున్నారు. కార్పొరేట్ ఉద్యోగాల్లో లేనిది... ఇక్కడేముందని ఎవరైనా అడిగితే వీరు చెప్పేదొక్కటే!! ‘‘నచ్చిన పని చేస్తున్నాం. కొన్ని జీవితాల్లోనైనా వెలుగు నింపుతున్నాం. మేమూ సంతృప్తిగా జీవిస్తున్నాం.’’ అని. సామాజిక రంగంలో కెరీర్‌ను వెతుక్కోవాలని, రాణించాలని కోరుకునే వారికి స్ఫూర్తినిచ్చే అలాంటి వారి విజయ గాథలివిగో...
సామాజిక విప్లవానికి నాంది! సులభ్ ఇంటర్నేషనల్... ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు! ఎందుకంటే బహిరంగ విసర్జన గురించి ఇప్పుడైతే ప్రభుత్వాలు సైతం ప్రకటనలిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్నాయి కానీ... దీన్ని ఐదు దశాబ్దాల కిందటే ఆచరణలో పెట్టారు డాక్టర్. బిందేశ్వర్ పాఠక్!. ఇంగ్లిష్, సోషియాలజీ సబ్జెక్ట్‌లలో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసిన బిందేశ్వర్ పాఠక్.. తనకు చిన్నప్పుడు ఎదురైన అనుభవాలే పాఠాలుగా... అందరికీ కొత్తదారిని చూపించారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన బిందేశ్వర్.. చిన్నతనంలో ఓ పారిశుద్ధ్య కార్మికుడిని ముట్టుకుని ఇంటికొచ్చారు. అది తెలిసిన కుటుంబ సభ్యులు స్నానం చేశాకే ఇంట్లోకి రానిచ్చారు. మరో సందర్భంలో డిగ్రీ పూర్తయ్యాక.. బీహార్ గాంధీ సెనెటరీ సెలబ్రేషన్స్ కమిటీకి చెందిన భంగి-ముక్తిలో (పారిశుద్ధ్య కార్మికుల సమాఖ్య) చేరిన బిందేశ్వర్ పాఠక్ వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు కళ్లారా చూశారు. వారితో కలిసి కొన్ని రోజులు గడిపాక.. వారి జీవితాల్లో మార్పు తేవాలని, వారికి సమాజంలో గౌరవం లభించేలా చేయాలని భావించారు. ఈ ఆలోచనకు ప్రతిరూపంగా 1970లో సులభ్ ఇంటర్నేషనల్ పేరుతో సామాజిక సేవా సంస్థను ప్రారంభించారు. ఇందులో భాగంగానే సులభ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, పారిశుద్ధ్య కార్మికుల హక్కుల పరిరక్షణ, సులభ్ కాంప్లెక్స్‌ల నుంచి వెలువడే వ్యర్థాలను వినియోగించి బయోగ్యాస్ తయారీ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వీటికోసం ఇప్పటివరకు దాదాపు 70వేల మంది వాలంటీర్లను నియమించుకున్నారు. ఫలితంగా ఇప్పుడు ఎందరికో ఉపాధి లభిస్తోంది. యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి బిరుదులు కూడా బిందేశ్వర్ అందుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆదాయం సంగతి మాట పక్కన పెడితే.. సులభ్ ఇంటర్నేషనల్ ద్వారా ఒక సామాజిక విప్లవానికి నాంది పలికారు!! - బిందేశ్వర్ పాఠక్, సులభ్ ఇంటర్నేషనల్ |
జాలర్ల జీవితాల్లో వెలుగు.. దీనబంధు సాహును... ప్రఖ్యాత చిల్కా సరస్సును విడివిడిగా చూడలేం. ఎందుకంటే ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా తన విధులకు మాత్రమే సాహు పరిమితమైపోలేదు. దశాబ్దాలుగా నాచుపై (అల్గే) తాను సాగిస్తున్న పరిశోధనలు... విదేశాల్లో దాని వినియోగానికి సంబంధించి చూసిన పరిస్థితులు ఇక్కడా పనికిరావాలనుకున్నారు. అందుకే... చిల్కా సరస్సు సమీపంలోని మత్స్యకారులకు వచ్చిన ఆపదను.. చక్కని అవకాశంగా మార్చేశారు. అక్కడి వందల కుటుంబాలకు చుక్కాని అయ్యారు!! ఒకప్పుడు చిల్కా సరస్సు సమీపంలోని మత్స్యకార కుటుంబాలకు చేపల వేటే ప్రధాన ఆదాయం. కానీ పర్యావరణ కాలుష్యం, కమర్షియల్ అగ్రికల్చర్ వారి ఆదాయానికి గండికొట్టాయి. చేపల వేట సాగించలేక, దానిద్వారా ఆదాయం లభించదని అర్థమయ్యాక వందల కుటుంబాలు వలసల బాటపట్టాయి. అప్పటికే ఫైకాలజీలో పరిశోధనలు చేస్తూ.. ఢిల్లీ వర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న దీనబంధు సాహు... వాళ్లకో పరిష్కారం చూపించాలనుకున్నారు. సరస్సు అడుగు భాగంలో పేరుకుపోయిన నాచునే ఆధారంగా చేసుకున్నారు. మనం నిత్యం వాడే టూత్‌పేస్ట్, కాస్మొటిక్స్, టిష్యూ కల్చర్, బయో ఫ్యూయల్స్ తయారీలో ఈ నాచులో ఉండే రసాయనాలు ఉపయోగపడతాయి. వీటిని వెలికి తీయాలంటే శాస్త్రీయ పద్ధతిలో సాగు చేయాలి. ఈ పద్ధతులనే.. చిల్కా ప్రాంత ప్రజలు అవలంబించేలా.. దానిద్వారా ఆదాయం పొందేలా కృషి చేశారు. ప్రారంభంలో ఎన్నో చిక్కులు!! కొత్త పద్ధతికి మళ్లటానికి వారెవరూ ఆసక్తి చూపలేదు. అయినా వారిని మోటివేట్ చేస్తూ ఎట్టకేలకు ఆ దిశగా అడుగులు వేయించగలిగారు. ఇదంతా అక్కడి స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జరిగేలా చేశారు. 45 రోజుల వ్యవధిలోనే హార్వెస్టింగ్ కూడా పూర్తయ్యే పద్ధతి ఫలితంగా.. ఇప్పుడు ఆ ప్రాంత కుటుంబాలు మెరుగైన ఆదాయం పొందుతున్నాయి. సాహు మాత్రం 30 ఏళ్లుగా అల్గేపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ‘‘దీన్ని ఇండియా మొత్తానికి విస్తరించాలన్నది నా కల. ఎందుకంటే అల్గే సాగు పర్యావరణానికి చాలా మంచిది. పైగా కొన్ని లక్షల మంది దీనిద్వారా మెరుగైన ఆదాయాన్ని ఆర్జించే అవకాశముంది’’ అంటారాయన. ప్రొఫెసర్‌గా తను యూనివర్సిటీలో చెప్పే పాఠాన్ని... ఇంకాస్త ముందుకొచ్చి నేరుగా జనానికే మేలు చేసేలా చెప్పారు సాహు! -దీనబంధు సాహు |
మహిళా శక్తికి మరో రూపం రంగసూత్ర అంటే ఒక్కరిది కాదు. కొన్ని వందల మంది మహిళలు నిర్వహిస్తున్న కంపెనీ!! ఫ్యాబ్ ఇండియా, ఐకియా వంటి అగ్రగామి సంస్థలతో భాగస్వామ్యం పెట్టుకుని వాటికి వస్త్రాల్ని సరఫరా చేస్తున్న ఈ సంస్థకు ప్రాణం పోసి... మహిళలకు శిక్షణనిచ్చి, వారందరినీ వాటాదారులుగా చేసింది మాత్రం సుమితా ఘోష్! కోల్‌కతాలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సుమిత ఘోష్‌కు చిన్నప్పటి నుంచీ ఒకటే ఆలోచన. తన చుట్టూ ఉండే వారికి ఏదో ఒక రకంగా సాయపడాలని!! ఆ ఆలోచనే ముంబై యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీజీని, అమెరికాలోని ఈస్ట్రన్ మెనోనిట్ యూనివర్సిటీ నుంచి పొందిన కాన్‌ఫ్లిక్ట్ రిసొల్యూషన్ పట్టాను పక్కన పెట్టి.. సమాజ సేవకు నడుం బిగించేలా చేసింది. భర్త సంజయ్ ఘోష్ తోడ్పాటు ఆమె తపనకు మరింత ఊతమిచ్చింది. సుమిత ఘోష్ పదేళ్లపాటు రాజస్థాన్‌లోని ఉత్తరీ రాజస్థాన్ మిల్క్ యూనియన్ ట్రస్ట్‌తో కలిసి పనిచేశారు. దుర్భిక్షం కారణంగా 1987లో ఆ సంస్థ మూతపడింది. దీంతో అసోంకు చేరుకున్న ఈ జంట.. గ్రామాల్లో తిరుగుతూ స్థానిక మహిళలకు చేతి వృత్తులపై నైపుణ్యం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపే పనిలో పడ్డారు. ఇలా సాఫీగా సాగుతున్న ఈ జంట ప్రయాణంలో ఊహించని దుర్ఘటన ఉల్ఫా తీవ్రవాదుల రూపంలో ఎదురైంది. అప్పట్లో ఉల్ఫా తీవ్రవాదులు సంజయ్ ఘోష్‌ను అపహరించారు. ఇప్పటికీ ఆచూకీ లేదు. మనోస్థయిర్యాన్ని కోల్పోని సుమిత విషాదం నుంచి కొద్ది రోజుల్లోనే తేరుకున్నారు. అప్పుడు వేసిన ముందడుగు ఫలితంగా రూపుదిద్దుకున్నదే రంగసూత్ర సంస్థ. ఇదేమీ అంత ఈజీగా సాధ్యం కాలేదు. చేతిలో ఉన్న పది లక్షలతో సంస్థను ఎలా ఆరంభించాలని ఆమె మధనపడుతున్న సమయంలో... ఆవిష్కార్ ఫౌండేషన్ సంస్థ రూ.30 లక్షలు, ఫ్యాబ్ ఇండియా మరో రూ.23 లక్షలు సమకూర్చి ఆమెకు దన్నుగా నిలిచాయి. గ్రామీణ పేద మహిళలకు సాధికారిత కల్పించాలనే గొప్ప ఆశయంతో నడుస్తున్న ఈ సంస్థ అందించే ఉత్పత్తులన్నీ గ్రామీణ మహిళలు స్వయంగా తయారుచేస్తున్నవే..! వారు వాటాదారులు కూడా. రంగ సూత్రలో పనిచేస్తున్న మహిళలు నెలకు కనీసం రూ.15 వేలు సంపాదిస్తున్నారు. ఇలా సంపాదిస్తున్న వారి సంఖ్య ఇపుడు 20వేలకు పైనే ఉంది!! -సుమిత ఘోష్\, రంగసూత్ర |
అక్షరాస్యతకు... ఆ ఒక్క అడుగు మాధవ్ చవాన్‌ది కలిగిన కుటుంబం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-ముంబై నుంచి ఎంఎస్సీ చేశాక అమెరికాలోని ఒహయో స్టేట్ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. కొన్నాళ్లు యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్, ఐఐసీటీ- ముంబైలో అధ్యాపకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్ని చేస్తున్నా... ఏదో వెలితి!! మన డిగ్రీలు మనం జీవించడానికేనా..!? మరో నలుగురికి ఉపయోగపడవా? అనే ఆలోచన మొదలైంది చవాన్‌లో! అదే... ఆయనతో అక్షరాస్యత దిశగా అడుగులేయించింది. కొన్ని లక్షల మంది పిల్లల్ని, పెద్దల్ని విద్యావంతుల్ని చేసింది. సమాజంలో మార్పు రావాలంటే.. ప్రగతి కావాలంటే ముందుగా చదువుండాలనేది మాధవ్ చవాన్ గట్టి నమ్మకం. చదువులేక.. చదువుకోలేక ఎందరో చిన్నారులు బంగారం లాంటి భవిష్యత్తుకు దూరమవుతున్న పరిస్థితిని దూరం చేయాలనుకున్నారు. ముంబై మురికివాడల్లోని పిల్లలకు విద్యనందించి.. వారి జీవితాల్లో కాంతులు నింపాలనే లక్ష్యంతో కదిలారు. తొలుత నేషనల్ లిటరసీ మిషన్‌తో చేతులు కలిపారు. కొన్నాళ్లు ముంబై మురికి వాడల్లోని పెద్దలకు వయోజన విద్య అందించే పనిలో నిమగ్నమయ్యారు. వయోజన విద్యను దేశమంతటికీ విస్తరించారు. అనంతరం చిన్నారుల చదువు కోసం ప్రథమ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. మొదట ముంబైకే పరిమితమైన ప్రథమ్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించింది. చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి కలిగేలా వినూత్న బోధన, అభ్యసన పద్ధతులను రూపొందించి అందించడం ప్రథమ్ లక్ష్యం. దీనికి అన్ని ప్రాంతాల నుంచి ఆదరణ లభించడంతో 1995లో ప్రారంభమైన ప్రథమ్.. ఇప్పుడు 23 రాష్ట్రాల్లో విస్తరించింది. ఇప్పటికే దాదాపు ఎనభై లక్షల మంది చిన్నారులకు, హైస్కూల్ స్థాయి విద్యార్థులకు నైపుణ్యాలు అందించింది. అంతేకాదు... దాదాపు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యా బోధన ఎలా జరుగుతోందో, ఇంకా ఏం చేయాలో సాధికారికంగా చెప్పేంత డేటా ప్రథమ్ చేతిలో ఉంది. ఆ డేటానే ఇప్పుడు వివిధ ప్రభుత్వాలతో దిద్దుబాటు చర్యలు తీసుకునేలా చేస్తోంది. చవాన్ తన చదువేదో అయిపోయింది... అధ్యాపక వృత్తి దొరికింది... ఇకచాలు అనుకుంటే... ఆ ఒక్క అడుగూ వేయకుంటే... ఇన్ని లక్షల మంది చదువుకు దగ్గరయ్యే వారా?! -మాధవ్ చవాన్, ప్రథమ్ |
కలలు గెలిచే కర్మాగారం ! ఆనంద్ లెక్కలు ఎప్పుడూ తప్పలేదు. ఇక లెక్కల్లో తప్పే అవకాశమే లేదు. ఎందుకంటే గణితంలో జీనియస్ కాబట్టి!! అందుకే... ఆర్థిక స్థోమత లేకున్నా తల్లి సాయంతో, ట్యూషన్లు చెబుతూ డిగ్రీ పూర్తిచేశాడు. తనలాంటి వారికి తోడ్పాటునివ్వటానికి సూపర్-30ని ఏర్పాటు చేశాడు. ఐఐటీలో చేరాలని కలలు కనే 30 మంది నిరుపేద విద్యార్థులకు శిక్షణనిచ్చి... వారిని ఐఐటీల్లో అడుగుపెట్టేలా చేయటమే తన కల. అనంద్ అంకిత భావం... వీళ్లందరి కలలనూ నిజం చేస్తోంది!! ఐఐటీలో సీటు లభించాలంటే... జేఈఈ అడ్వాన్స్ డ్‌లో ర్యాంకు రావాలి. అందుకు లక్షలు కుమ్మరించి కోచింగ్ తీసుకోవాలి. లక్షలు లేని నిరుపేద విద్యార్థుల సంగతో..? అలాంటి వారి కోసమే సూపర్-30ని ఏర్పాటు చేశాడు ఆనంద్ కుమార్. పాట్నా సమీపంలోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన ఆనంద్‌ది నిరుపేద నేపథ్యం. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో రోజు గడవటమే భారమైంది. నీకింకా చదువెందుకు అన్నారు బంధువులు. తల్లి ఇంట్లో అప్పడాలు చేస్తూ మద్దతివ్వటంతో ఆనంద్ కాలేజీలో చేరాడు. బీహార్ నేషనల్ కాలేజ్ నుంచి బీఎస్‌సీ పూర్తిచేశాడు. తర్వాత కేంబ్రిడ్‌జ యూనివర్సిటీలో ప్రవేశం లభించినా.. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో చేరలేదు. అయినా కుంగిపోని ఆనంద్... తన గణిత నైపుణ్యాన్ని ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు అందించడానికి రామానుజన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పేరుతో ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు. అంతటితో ఆగిపోతే బీహార్లో అంతమంది పిల్లలకు ఐఐటీల్లో సీట్లెలా వస్తాయి? 2000వ సంవత్సరంలో ఓ విద్యార్థి ఆనంద్ దగ్గరకు వచ్చి ఐఐటీ-జేఈఈ శిక్షణ ఇస్తారా? ఫీజు చెల్లించుకోలేను!! అని ప్రాధేయపడ్డాడు. తన చిన్ననాటి అనుభవాలు గుర్తొచ్చాయి ఆనంద్‌కు! ఎందరో విద్యార్థులకు ఐఐటీ కలలున్నా.. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎంట్రెన్స్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారని గమనించాడు. దాంతో పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణనివ్వటానికి 2002లో సూపర్ 30 పేరిట ఐఐటీ-జేఈఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. కొన్నాళ్లకది ఏటా 30కి 30 మందీ ఐఐటీ సీట్లు సాధించే స్థాయికి చేరింది. ఇప్పటిదాకా 400 మందికిపైగా విద్యార్థులు సూపర్ 30 నుంచి ఐఐటీ క్యాంపస్‌లలో అడుగుపెట్టారంటే చిన్న విషయమేమీ కాదు. వీరికి ఉచితంగా శిక్షణనివ్వటానికి కావాల్సిన డబ్బుల్ని రామానుజన్ స్కూల్ ద్వారా ఆర్జించిన మొత్తం నుంచి సర్దుబాటు చేస్తుంటారు ఆనంద్!! సూపర్ 30 సక్సెస్‌తో ఆనంద్ కుమార్‌కు అంతర్జాతీయంగా లభించిన ఖ్యాతి, అవార్డులకు లెక్కలేదు. కానీ వీటన్నిటికన్నా తన విద్యార్థి ఐఐటీలో సీటు సంపాదించినపుడు అతని కళ్లలోని వెలుగే ఎక్కువ సంతృప్తినిస్తుందంటారు ఆనంద్!! -ఆనంద్ కుమార్, సూపర్ 30 |
మనం పోరాడితేనే...మార్పు! త్రిలోచన్ శాస్త్రి పేరు రాజకీయ వర్గాలందరికీ దాదాపు తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులంతా ఎన్నికల సమయంలో తమ ఆస్తులు, అప్పులు, తమపై ఉన్న కేసుల వివరాలను వెల్లడిస్తూ అఫిడవిట్లు వేస్తున్నారంటే... అది త్రిలోచన్ శాస్త్రి తెచ్చిన మార్పే!! అంతేకాదు. రైతుల జీవితాల్లోనూ మార్పుకోసం కృషి చేస్తున్నారాయన. త్రిలోచన్ శాస్త్రి ఐఐటీ ఢిల్లీలో బీటెక్ చేశారు. ఐఐఎం-అహ్మదాబాద్‌లో పీజీ... ఆ తరవాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ!!. ఇండియాకు తిరిగి వచ్చేసిన త్రిలోచన్ శాస్త్రి... ఐఐఎం-బెంగళూరులో ప్రొఫెసర్‌గా చేరిపోయారు. జీవితం సౌకర్యవంతంగా సాగిపోతున్నా.. రాజకీయాల్లోకి నేరగాళ్లు సైతం ప్రవేశిస్తుండటం ఆయన్ను కుదురుగా ఉండనివ్వలేదు. ‘‘వారిని ఎన్నుకోకపోవటం.. ఎన్నుకోవటమనేది జనం ఇష్టం. కనీసం వారి చరిత్ర ఎలాంటిదో, ఆస్తిపాస్తులెంత ఉన్నాయో జనానికి తెలియాలి కదా? తాము ఎన్నుకునే నేత గురించి తెలుసుకోవటం వారి హక్కు కదా?’’ అని ఆలోచించారు త్రిలోచన్. దానికోసమే 1999లో యాక్షన్ ఫర్ డెమొక్రటిక్ ఫోరమ్ (ఏడీఆర్) పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ... ఎన్నికల్లో పాల్గొనే నేతలు తప్పనిసరిగా తమ నేర చరిత వివరాలను బయటపెట్టాలని స్పష్టంచేసింది. అప్పటినుంచి ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏడీఆర్ ‘ఎలక్షన్ వాచ్’ కనిపిస్తోంది. అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపేందుకూ త్రిలోచన్ శాస్త్రి అడుగులేశారు. సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్‌మెంట్ (సీసీడీ) పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి.. రైతులకు పలు రకాలుగా సాయపడుతున్నారు. దిగుబడి పెంచే విధానాలు, చేతికందిన పంటకు మార్కెట్లో సరైన ధర దక్కేలా చేయటం, నేరుగా మిల్లర్లు, రైతుల మధ్యే లావాదేవీలు జరిగేలా చూడటం వంటివి చేస్తున్నారు. ‘‘సగటున ఒక్కో రైతు కుటుంబం ఏటా రూ.20 వేలు ఆర్జిస్తోంది. కానీ, సగటు రుణం రూ.50 వేలుగా ఉంది. ఈ పరిస్థితి పోవాలంటే.. సాగులో ఆధునిక పద్ధతులు కావాలి. దళారీ వ్యవస్థ పోవాలి’’ అంటారు శాస్త్రి. ఇందుకోసం సీసీడీ సెంటర్లలో రైతులకు శిక్షణనిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 17 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. -త్రిలోచన్ శాస్త్రి, ఏడీఆర్ |
ఆశ్రయమే... ఆశయం ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి బీటెక్ పూర్తిచేశారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఐఐఎం కోల్‌కతా నుంచి పీజీ పట్టా చేతికొచ్చింది!. ఎవరికై నా ఇంకేం కావాలి చెప్పండి!! కెరీర్‌లో మరింత ముందుకు పోవటమే కదా చేయాల్సింది!! కానీ వినాయక్ లోహానీకి ఇదేమీ సంతృప్తినివ్వలేదు. అలా ఉద్యోగం చేసుకుంటే సమాజానికి లాభమేంటని ఆలోచించారు వినాయక్ లోహాని. విధివంచితులైన వ్యభిచారుల పిల్లలకు, అనాథ పిల్లలకు ఆశ్రయమివ్వాలని సంకల్పించారు. తోటివాళ్లు దూరం పెట్టినా... తక్కువ చేసి మాట్లాడినా కుంగిపోలేదు. ’పరివార్ ఆశ్రమ్’ను ఏర్పాటు చేసి... ఆ పిల్లలే తన పరివారమనుకున్నారు. 2003లో వినాయక్ పరివార్ ఆశ్రమ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. తొలుత చిన్న గదిలో ముగ్గురు పిల్లలతో ప్రారంభమైన ఈ సంస్థ నిర్వహించేందుకు వినాయక్ చేతిలో ఆర్థిక వనరులు అంతంతమాత్రమే. ఆ తర్వాత వినాయక్ ఆలోచనకు మెచ్చి ఇన్ఫోసిస్ ఫౌండేషన్, థెర్మాక్స్, సిటీ బ్యాంక్, ఎస్‌బీఐ.. ఇలా పదుల సంఖ్యలో సంస్థలు విరాళాలిచ్చాయి. ఫలితంగా పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురితో ప్రారంభమైన పరివార్ ఆశ్రమ్.. ఇప్పుడు రెండువేల మంది విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. అంతేకాదు. పరివార్ ద్వారా పెద్ద చదువులు చదువుకున్న పిల్లలు కూడా ఇప్పుడా ఆశ్రమానికి ఊతమిస్తున్నారు. కొందరు అక్కడే విద్యాబుద్ధులు చెబుతుండగా... మరికొందరు ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. ‘‘ఆ పిల్లలంతా నా పిల్లలే. అది నా పరివారం’’ అని చెప్పే వినాయక్‌కు ఆ ఆశ్రమంలోని 2వేల మందీ పేర్లతో సహా గుర్తుంటారు. అదంతా కుటుంబ పెద్దగా తన బాధ్యతంటారాయన!! -వినాయక్ లోహాని, పరివార్ ఆశ్రమ్ |
బడి పిల్లల బాంధవుడు! రోజూ మధ్యాహ్నమయ్యేసరికి ఏకంగా 18 లక్షల మంది బడి పిల్లలకు అన్నం పెడుతుంది అక్షయపాత్ర!!. అది కూడా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో!!. ఇంకా చెప్పాలంటే.. కార్పొరేట్ సంస్థల్ని తలదన్నే క్రమశిక్షణతో! ఊహించటానికే అసాధ్యమైన ఈ మహా క్రతువు వెనుక ఉన్న వ్యక్తి... ఐఐటీ ముంబై పూర్వ విద్యార్థి మధు పండిట్ దాసా!. ఇస్కాన్ చక్రం కింద ఆయన చేపట్టిన ఈ యజ్ఞంలో భాగస్వాములంతా స్వచ్ఛంద సేవకులే!! ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన మధు పండిట్.. బీటెక్ పూర్తయ్యాక ఎంటెక్‌లో సీటు సాధించారు. కానీ.. తాను చదువుతున్న చదువుకు, తన మనసులోని ఆలోచనలకు పొంతన కుదరటం లేదని భావించారు. దాంతో ఎంటెక్‌ను వదిలేసి.. సామాజిక, ఆధ్యాత్మిక సేవవైపు అడుగులు వేశారు. ‘నో చైల్డ్ గోయింగ్ హంగ్రీ’... స్వామి ప్రభుపాద రాసిన ఒక పుస్తకంలోని మాట! ఇదే మధు పండిట్ దాసాలో సామాజిక సేవ వైపు అడుగులేసేలా చేసింది. ఇస్కాన్‌లో చేరినప్పటి నుంచి ఏదో ఒక రకంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రారంభమైనప్పటి నుంచి (2000 నుంచి) దీని బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. దీని ద్వారా వేల మందికి ఉపాధి కూడా లభిస్తోంది. నిజానికి అక్షయపాత్ర అనే పేరు కూడా చిత్రంగానే వచ్చింది. అప్పట్లో ఈ కార్యక్రమం గురించి నాటి కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషితో మధు పండిట్ మాట్లాడారు. అప్పుడు జోషి... అక్షయపాత్రలా అన్న మాట!! అన్నారు. అంతే! అదే పేరు ఖరారైపోయింది. ఈ ఫౌండేషన్‌కు దండిగా నిధులేమీ లేవు. వాటిపై ఆదాయమూ లేదు. కానీ... ఎప్పటికప్పుడు కావాల్సిన నిధులు వస్తూనే ఉన్నాయి. నిరాటంకంగా ఈ క్రతువు సాగుతూనే ఉంది. భగవంతుడిపై భారం వేసి నడిపిస్తే అంతా ఆయనే చూసుకుంటాడనేది మధు పండిట్ దాసా చెప్పే మాట. అది ఆయన నమ్మకం మాత్రమేనని అనుకోవచ్చు గానీ... ఆ నమ్మకానికి ఎన్నడూ దెబ్బ తగలకపోవటమే ఆశ్చర్యం. - అక్షయపాత్ర, మధు పండిట్ దాసా |
ఇది బధిరుల ‘మిరాకిల్’! మిరాకిల్ కొరియర్స్!! ఇది కూడా అన్నిట్లానే ఒక కొరియర్ సంస్థయితే పెద్దగా చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. దీని వ్యవస్థాపకుడు ధ్రువ్ లక్రా గురించీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దీనికో ప్రత్యేకత ఉంది. మిరాకిల్‌లో కస్టమర్లిచ్చే పార్శిల్ తీసుకునే వారి నుంచి... ఆ పార్శిల్‌ను మీ ఇంటికి డెలివరీ చేసే వారి వరకూ... అంతా బధిరులే. ‘‘బధిరులు గౌరవ ప్రదంగా చేయగలిగే ఉద్యోగం ఇది. వారు ఎవరితోనూ మాట్లాడాల్సిన పని లేదు. ఎవరికీ తల వంచాల్సిన పనిలేదు’’ అంటారు ధ్రువ్. ముంబైకు చెందిన ధ్రువ్ లక్రా... బీకాం పూర్తిచేశాక మెరిల్ లించ్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. కానీ, ఆరు నెలలకే తన ఆలోచనలకు ఉద్యోగం సరిపోదని తెలుసుకున్నారు. ఇంట్లోవారి ఒత్తిడితో రెండేళ్లు నెట్టుకొచ్చారు. ఇక తన ఆలోచనకే ఓటేసి ఉద్యోగం వదిలేశారు. ముంబైలోనే దస్రా అనే సోషల్ ఆర్గనైజేషన్‌లో చేరారు. దస్రాలో పనిచేస్తున్న సమయంలోనే తమిళనాడులో సునామీ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయాల్సి వచ్చింది. ఫలితంగా సామాజిక సమస్యలెన్నో అతని దృష్టికి వచ్చాయి. వాటి పరిష్కారానికి చేసిన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక స్కాల్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ లభించడంతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఎస్‌ఏఐడీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన ధ్రువ్‌కు ఎదురైన ఒక అనుభవమే అతని జీవితాశయాన్ని నిర్ణయించింది. ఒకరోజు బస్సులో వెళ్తుండగా... కండక్టర్ ప్రతి స్టేషన్ పేరునూ గట్టిగా చెబుతున్నాడు. తన పక్కనున్న కుర్రాడిలో మాత్రం దిగాల్సిన ప్రాంతం గురించి చాలా ఆందోళన ఉంది. అప్పుడు ధ్రువ్‌కు అర్థమైంది.. అతను బధిరుడని! ఇలా బధిరుల ఇబ్బందులు గమనించిన ధ్రువ్.. వారికోసం ఏదైనా చేయాలనుకున్నారు. అలా రూపుదిద్దుకుందే మిరాకిల్ కొరియర్ సంస్థ! ఉద్యోగులంతా బధిరులే. కొరియర్ సంస్థకు మాటలతో సంబంధం లేదు. డెలీవరీ బాయ్ ఇచ్చే కవర్ తీసుకుని సంతకం పెడితే సరిపోతుంది. ప్రస్తుతం వందమంది బధిర ఉద్యోగులతో నెలకు 65 వేలకు పైగా షిప్‌మెంట్స్‌తో బిజినెస్ సాగిస్తున్న మిరాకిల్ కొరియర్స్ స్థాపకుడు ధ్రువ్ లక్రాకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. త్వరలో మరిన్ని నగరాలకు తమ శాఖలను విస్తరిస్తామని, వాటిని కూడా పూర్తిగా బధిరులతోనే నిర్వహిస్తామని ధ్రువ్ చెబుతున్నారు. - ధ్రువ్ లక్రా, మిరాకిల్ కొరియర్స్ |
అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో.. టీచ్ ఫర్ ఇండియా..ఇప్పుడీ పేరు దేశమంతటా సుపరిచితమే. విద్యా విధానంలో మార్పు రావాలని, అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని లక్షించే టీచ్ ఫర్ ఇండియాలో... వలంటీర్లు చాలామంది ఐఐటీలు, ఐఐఎంలలో చదువుకున్న వారే. మరి ఇంత ఘనమైన సంస్థను ఏర్పాటు చేసి నడిపిస్తున్న షహీన్ మిస్త్రీ... ఇండియాలో పుట్టలేదు. పైగా ఒంటరి మహిళ. వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల్ని తట్టుకుని... ఇద్దరు పిల్లలుండగా విడాకుల్నీ చూసినా ధైర్యంగా నిలబడ్డారు. ఇంతటి మహా క్రతువుకు శ్రీకారం చుట్టారు!! షహీన్ మిస్త్రీ తండ్రి సిటీ బ్యాంక్ ఉద్యోగి కావడంతో 18 ఏళ్లలోపు వయసులోనే 13 దేశాల్లో చదివారామె. ముంబైకు తిరిగొచ్చి యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి సోషియాలజీలో బీఏ పూర్తి చేశారు. అప్పట్లో ఫీల్డ్ వర్క్‌లో భాగంగా పాఠశాలలకు వెళ్లిన ఆమె.. అక్కడి విద్యా విధానాలు చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడే నిర్ణయించుకున్నారు ‘‘విద్యా విధానంలో మార్పు రావాలి. నాణ్యత పెరగాలి. అందుకోసం తన వంతుగా ఏదైనా చేయాలి’’ అని! ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో ఎంఏ పూర్తిచేసి.. మళ్లీ ఇండియాకు తిరిగొచ్చారు. 1989లో ఆకాంక్ష ఫౌండేషన్ పేరుతో ముంబై కేంద్రంగా స్వచ్ఛంద సంస్థను ఆరంభించారు. ముంబై మురికివాడలకు వెళ్లి అక్కడి చిన్నారులకు చదువు చెప్పడం మొదలెట్టిన ఈ సంస్థకు ఎంతో ఆదరణ లభించింది. దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకు వినూత్న రీతిలో పాఠాలు చెప్పాలనే లక్ష్యంతో 2008లో ‘టీచ్ ఫర్ ఇండియా’ను ఏర్పాటు చేశారు. జాతీయస్థాయిలో పాఠశాలల్లో రెండేళ్ల వ్యవధికి టీచర్లుగా పనిచేసేందుకు ఫెలో మెంబర్ పేరుతో వలంటీర్లను నియమిస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మూడు వందలకు పైగా పాఠశాలల్లో 1250 మంది ఫెలోషిప్ మెంబర్లు పిల్లలకు వినూత్న రీతిలో పాఠాలు చెబుతున్నారు. ఇప్పటివరకు 1500 మంది ఫెలోషిప్ పూర్తిచేసుకున్నారు. ఈ ఫెలోషిప్ దరఖాస్తు దారుల్లో ఐఐటీ, ఐఐఎంల పట్టభద్రులూ ఎక్కువే. అంత ప్రాధాన్యం సంతరించుకున్న టీచ్ ఫర్ ఇండియా అంకురార్పణకు కారణం... ముంబై మురికి వాడల్లో కనిపించిన దృశ్యాలేనంటారు షహీన్. - షహీన్ మిస్త్రీ, టీచ్ ఫర్ ఇండియా |
Published date : 21 Nov 2018 03:43PM