Skip to main content

విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలి...

‘ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత అన్ని విధాలుగా ముందుండేలా నైపుణ్యాలను పెంచుకునేందుకు కృషి చేయాలి. కరిక్యులంలోనూ ఎప్పటికప్పుడు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలి. మా ఇన్‌స్టిట్యూట్‌లో మేం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం’ అంటున్నారు ప్రముఖ బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజ్.. ధ్రువ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ చైర్మన్ డాక్టర్ ఎస్.ప్రతాప్ రెడ్డి. విద్యా రంగంలో దాదాపు అయిదు దశాబ్దాల అనుభవం గడించి.. పలు అవార్డులు అందుకున్న డాక్టర్ ఎస్.ప్రతాప్ రెడ్డితో గెస్ట్ కాలం.
మేనేజ్‌మెంట్ విద్యలో మార్పులు :
ప్రస్తుతం మేనేజ్‌మెంట్ విద్యలో పలు మార్పులు జరుగుతున్నాయి. పరిశ్రమ అవసరాలు మారుతుండటమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు కూడా సొంతం చేసుకోవాల్సిన అవసరముంది. ప్రధానంగా బిజినెస్ అనలిటిక్స్, ఏఐ, ఐఓటీ, బిగ్‌డేటా కీలకంగా మారుతున్నాయి. మా ఇన్‌స్టిట్యూట్‌లో వీటికి సంబంధించిన అంశాలపై విద్యార్థులకు శిక్షణనిస్తున్నాం. ఇతర కళాశాలల్లో ఎంబీఏ చదువుతున్న విద్యార్థులు కూడా ఇలాంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి.

ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెరగాలంటే..
మేనేజ్‌మెంట్ విద్యార్థుల్లో ఏడు శాతం మందికే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్నాయని ఇటీవల ఫిక్కీ అంచనా వేసింది. మరికొన్ని సంస్థల అంచనాల ప్రకారం- మేనేజ్‌మెంట్ విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన వారు 20 శాతంలోపే ఉంటున్న సంగతి తెలిసిందే. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మెరుగవ్వాలంటే.. విద్యార్థుల్లో ప్రాక్టికల్ అప్రోచ్, క్రిటికల్ థింకింగ్ పెరిగేలా బోధన ఉండాలి. మా ఇన్‌స్టిట్యూట్‌లో ఇలాంటి విధానాలు అమలు చేస్తున్నాం. అందుకే మా దగ్గర పీజీడీఎం విద్యార్థుల్లో ఏటా 95 శాతం మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధిస్తున్నారు. మిగతా ఇన్‌స్టిట్యూట్‌లలోనూ ఈ తరహా విధానాలు అమలుచేస్తే విద్యార్థుల్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మెరుగవుతాయి.

టెక్, మేనేజ్‌మెంట్.. రెండూ కీలకమే
ప్రస్తుతం మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో 50 శాతం మందికిపైగా ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉంటున్నారన్న మాట వాస్తవమే. ఇక్కడ రెండు ప్రధాన విషయాలు గుర్తించాలి. టెక్నికల్ స్కిల్స్, మేనేజ్‌మెంట్ నైపుణ్యాల కలయికతో పనిచేస్తే అత్యంత సమర్థవంతమైన ఫలితాలు సాధించొచ్చు. ముఖ్యంగా ఇంజనీరింగ్ వల్ల ఎఫిషియన్సీ లభిస్తుంది. ఎంబీఏ/పీజీడీఎంతో ఎఫెక్టివ్‌నెస్ వస్తుంది. ఇలా.. ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్‌నెస్ రెండూ కలిస్తే.. సంస్థ నిర్వహణ పరంగా అద్భుత ఫలితాలు సాధించే వీలుంటుంది. అంతేకాకుండా ఈ రెండు నైపుణ్యాలుంటే.. విధి నిర్వహణ పరంగా అన్ని విభాగాలపై చక్కటి అవగాహన లభిస్తుంది.

మేథో వలసకు అడ్డుకట్ట వేయాలి :
ప్రస్తుతం డెమొగ్రాఫిక్ డివిడెండ్ అని ఘనంగా చెప్పుకుంటున్నప్పటికీ.. మనకు ఎదురవుతున్న సమస్య మేథోవలస. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు ఐఐటీల్లో పలు రాయితీలు, మినహాయింపులతో కూడిన విద్యను పొందిన విద్యార్థుల్లో అధిక శాతం మంది ఉన్నత విద్య, లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిపోతున్నారు. కాబట్టి ఐఐటీల్లో చదువు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా కొన్ని సంవత్సరాలపాటు దేశంలోనే ఉద్యోగం చేసేలా నిబంధనలు రూపొందించాలి.తద్వారా మేథో వలసను కొంత వరకు అరికట్టొచ్చు. ఇది భవిష్యత్తులో దేశ ప్రగతికి దోహదం చేస్తుంది.

ఆ కళాశాలలనూ పెంచాలి :
సామాజికంగా, భౌగోళికంగా అన్ని వర్గాలకు ఉన్నత స్థాయి సంస్థల్లో చదివే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐఐటీలు, ఐఐఎంలను విస్తరించడం వల్ల భవిష్యత్తు ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయి. వీటితోపాటు ఇతర విభాగాలకు సంబంధించిన కోర్సులు అందించే కళాశాలల సంఖ్యను పెంచాలి. ఫలితంగా ఇతర కోర్సులపై ఆసక్తి ఉన్న వారికి ఉపయుక్తంగా ఉంటుంది.

విలువలతో కూడిన విద్య :
ప్రస్తుతం మనం ఆధునిక యుగంలో ఉన్నప్పటికీ.. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడం చాలా అవసరం. ముఖ్యంగా విలువలు, జీవన నైపుణ్యాలు(లైఫ్ స్కిల్స్), వ్యక్తిత్వం ఈ కోవలోకి వస్తాయి. ఏ రంగంలో రాణించేందుకైనా ఇవి ఎంతో ముఖ్యం. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లల వ్యవహార శైలిపై దృష్టిపెట్టాలి. విద్యార్థులు యాంత్రికంగా చదివే విధానానికి స్వస్తి పలికి.. సమాజంపైనా, సామాజిక పరిస్థితులపైనా అవగాహన పెంచుకునేందుకు కృషి చేయాలి. అప్పుడే వ్యక్తిగతంగా, వృత్తి పరంగా పరిపూర్ణత లభిస్తుంది. ఇతరుల సమస్యల పట్ల స్పందించే గుణం అలవడుతుంది.

ఉన్నతాశయాలు లక్ష్యంగా..
కోర్సు ఏదైనా విద్యార్థులు ఉన్నత ఆశయాలను నిర్దేశించుకోవాలి. ఏదో కోర్సులో చేరాం.. సర్టిఫికెట్ చేతికొచ్చాక ఏదో ఒక ఉద్యోగంలో చేరుదాం అనే దృక్పథం వీడాలి. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో అద్భుతాలు ఆవిష్కరించేలా ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. అలా లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు వాటిని సాధించాలనే తపన మొదలవుతుంది. ఫలితంగా నైపుణ్యాలు సొంతం చేసుకోవడంలోనూ ముందుంటారు!!
Published date : 13 Jun 2019 11:32AM

Photo Stories