Skip to main content

పేదరికం చదువుకు అడ్డు కాదు.. వాటిని అధిగమించే మార్గాలను వెతకాలి!!

సాక్షి, తుగ్గలి (కర్నూలు జిల్లా) :పేద కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు విదేశాల్లో శిక్షణ, పరిశోధనల ప్రజెంటేషన్ ఇస్తూ పేదరికం చదువుకు అడ్డు కాదని నిరూపించాడు.
ఒకప్పుడు పగిడిరాయి గ్రామాన్ని పసిడిరాయి అని పిలిచేవారని ఇక్కడి పెద్దలు చెబుతారు. ఈ ఊరిలో బంగారం నిక్షేపాలకు కొదువ లేదు. విద్యార్థులు కూడా బంగారమేనని నిరూపిస్తున్నాడు నిరుపేద విద్యార్థి లక్ష్మన్న. తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి చెందిన బళ్లారి భీమన్న, మాతమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఐదుగురు కుమారులు. ఉన్న ఏడు ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ, కూలీనాలీకి పోతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. తల్లిదండ్రులకు చదువు లేదు. అన్నదమ్ముల్లో ఒక్కరే పదో తరగతి వరకు చదివారు. ఇంత మంది ఉన్నా ఎవరికీ చదువులేదు. ఎలాగైనా ఉన్నత చదువులు చదవాలనుకున్నాడు చిన్న కుమారుడైన లక్ష్మన్న. ఆ ఆశయంతోనే ముందుకు సాగాడు. 1 నుంచి 5వ తరగతి వరకు గ్రామంలో ప్రాథమిక పాఠశాల, 6 నుంచి 10 వరకు జొన్నగిరి జెడ్పీ ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వైఎస్సార్ జిల్లా కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ (జియాలజీ) చదువుకున్నాడు. ఎంఎస్సీలో డిస్టింక్షన్ క్లాస్‌ఫస్ట్ వచ్చాడు. ఆ తర్వాత అక్కడే పీహెచ్‌డీ (మైరైన్ జియాలజీ) చేశాడు. ప్రొఫెసర్ ఎన్.జయరాజు ఆధ్వర్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో కాలుష్యంపై పరిశోధనలు ప్రారంభించాడు. ఇంటర్మీడియట్‌లో ఉండగా తల్లి మాతమ్మ మరణించింది. 2017లో తండ్రి కూడా మృతి చెందాడు. అయినా లక్ష్మన్న కుంగిపోలేదు. తల్లిదండ్రుల పేరు నిలపాలనే లక్ష్యంతో సోదరులు, తన గైడ్ సహకారంతో విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. కేంద్రం ఇచ్చే ఇన్‌స్పైర్ ఫెలోషిప్‌తో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. 2019లో గైడ్ జయరాజు నేతృత్వంలో నిజాంపట్నం లంకవానిదిబ్బలో పరిశోధన ప్రారంభించాడు. పీహెచ్‌డీ చేసే సమయంలోనే (2015) అంతర్జాతీయ శిక్షణ నిమిత్తం జర్మనీకి వెళ్లాడు. చెన్నై ఐఐటీలో ఇండో-జర్మనీ సభ్యులతో కలసి శిక్షణలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో విదేశీ ప్రతినిధులతో కలసి శిక్షణ తీసుకున్నాడు. 2019 నవంబర్ 18 నుంచి 21 వరకు ఫ్రాన్స్ లో జరిగిన వర్క్‌షాప్‌లో భూగర్భ పరిశోధనలపై ప్రజెంటేషన్ ఇచ్చాడు. ప్రస్తుతం పరిశోధక విద్యార్థిగా ముందుకు సాగుతున్నాడు.

మంచి సైంటిస్టు కావాలనేదే లక్ష్యం..
‘మంచి శాస్త్రవేత కావాలన్నదే నా లక్ష్యం. ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో జరిగిన శిక్షణ, వర్కషాప్‌లలో పాల్గొని చాలా విషయాలు నేర్చుకున్నా. పేదరికం కారణంగా చదవలేమోనని ఎవరూ నిరాశకు లోనుకాకూడదు. వాటిని అధిగమించే మార్గాలను వెతుక్కుని ముందుకు సాగాలి.
-లక్ష్మన్న, పగిడిరాయి
Published date : 23 Dec 2019 03:48PM

Photo Stories