Skip to main content

స్కిల్ గ్యాప్ కాదు..అటిట్యూడ్ గ్యాప్‌తోనే అసలు సమస్య!!

దేశంలో విద్యా రంగ వ్యాప్తికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వట్లేదా.. విద్యార్థులు కూడా ఉన్నత విద్యకు అనవసర ప్రాధాన్యం ఇస్తున్నారా.. ప్రొఫెషనలిజం రావాలంటే ప్రొఫెషనల్ కోర్సులే చదవక్కర్లేదా.. వీటంన్నిటికీ అవుననే సమాధానం ఇస్తున్నారు సుబ్రతో బాగ్చి. అకడెమిక్స్‌కు.. ప్రొఫెషనల్ కెరీర్‌కు ఏమాత్రం పొంతన లేకుండా.. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసి.. జీవితంలో ఎన్నో సవాళ్లను, ఆటుపోట్లను ఎదుర్కొని.. నిబద్ధతతో పని చేస్తే శాశ్వత ఫలితాలు లభిస్తాయి అని నిరూపించిన మైండ్ ట్రీ ఐటీ సొల్యూషన్స్ కో ఫౌండర్, చైర్మన్ సుబ్రతో బాగ్చితో ఇంటర్వ్యూ...

క్వాలిటీ.. క్వాంటిటీకి సంబంధించి మన విద్యా వ్యవస్థపై మీ అభిప్రాయం?
ఏ రంగంలోనైనా క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాధాన్యమివ్వాలి. విద్యా రంగంలో ఇది ఇంకా ఎక్కువగా ఉండాలి. కానీ మన దేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వాలు, విద్యా సంస్థలు.. ఏ కోణంలో చూసినా క్వాంటిటీపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇది కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్, లేదా మెడికల్ సెన్సైస్‌కే పరిమితం కాలేదు. అన్ని కోర్సుల్లోనూ ఇదే పరిస్థితి. దీనివల్ల నాణ్యత లోపిస్తోంది. పర్యవసానంగా మనం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే వెనుకంజలో ఉన్నాం. కాబట్టి మనం క్వాలిటీకి ప్రాధాన్యమిచ్చేలా స్కిల్ ఎడ్యుకేషన్ రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇది ఒక రకంగా మన విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో ముఖ్యమైంది. మరో ముఖ్యమైన సవాలు.. తల్లిదండ్రుల ప్రమేయం. చాలామంది తల్లిదండ్రులు బలవంతంగా తమ పిల్లలను డిగ్రీలు చదివేలా ఒత్తిడి చేస్తున్నారు, తప్ప నైపుణ్యాల గురించి ఆలోచించట్లేదు.

ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలు?
ఇన్‌స్టిట్యూట్‌లను నెలకొల్పుతూ.. అవసరమైనప్పుడు సంస్కరణలు చేపడుతున్న ప్రభుత్వం అక్కడికే పరిమితం అవుతోంది. పూర్తి స్థాయిలో విద్యాభివృద్ధి బాధ్యతను విస్మరిస్తోందనే చెప్పొచ్చు. శత్రువులను ధీటుగా ఎదుర్కోవడానికి, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లుగా.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి విషయంలో ఎందుకు ఇవ్వడం లేదు. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి నాణ్యమైన విద్య మాత్రమే పరిష్కారం అని ఇప్పటికైనా గుర్తించాలి.

విద్యార్థుల్లో స్కిల్ గ్యాప్‌పై మీ కామెంట్స్?
ఇండస్ట్రీ, అకడెమిక్‌కు మధ్య స్కిల్ గ్యాప్ ఉన్న మాట వాస్తవం. దీనికంటే మరో ముఖ్యమైన సమస్య.. అటిట్యూడ్ గ్యాప్. అంటే.. విద్యార్థుల దృక్పథం, పరిశ్రమల అవసరాలకు తగిన రీతిలో ఉండట్లేదు. విద్యార్థుల్లో అధిక శాతం మందికి నిజమైన ప్రొఫెషనలిజం అంటే ఏంటో తెలియదు. డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికెట్.. ప్రొఫెషనల్‌గా రూపొందిస్తుందనే భావనలో ఉన్నారు. కానీ ప్రొఫెషనలిజం అనేది ఎన్నో అంశాల సమ్మిళితం. అకడెమిక్ నైపుణ్యాలు, పరిశ్రమ అవసరాలతోపాటు పర్సనల్ అటిట్యూడ్, ఆప్టిట్యూడ్, పీపుల్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్.. ఇలా అన్నింటినీ సొంతం చేసుకుంటేనే ప్రొఫెషనలిజం లభిస్తుంది.

ఐఐటీలు, ఎన్‌ఐటీలలో ప్రవేశం పొందలేకపోయిన విద్యార్థులకు మీ సలహా?
ముందుగా.. నాణ్యమైన విద్యకు ఐఐటీలు, ఎన్‌ఐటీలు మాత్రమే వేదికలు అనే అపోహ వీడాలి. వ్యక్తిగత ఆసక్తి ఉంటే ఎలాంటి ఇన్‌స్టిట్యూట్ అయినా.. ఎక్కడ చదివినా క్వాలిటీ ఎడ్యుకేషన్ సొంతం చేసుకోవడం కష్టం కాదు. దీనికి ‘మైండ్ ట్రీ’ చైర్మన్స్ అవార్డ్ విజేతలే నిదర్శనం. ప్రతి ఏటా మైండ్ ట్రీ సంస్థలోని ఉద్యోగుల్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్‌ని ఎంపిక చేసి వారికి చైర్మన్ అవార్డ్ అందిస్తాం. ఈ ఏడాది మొత్తం 13 వేల మంది ఉద్యోగుల్లో తొమ్మిది మంది ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు. వీరిలో ఎనిమిది మంది ద్వితీయ, తృతీయ శ్రేణి ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి డిగ్రీలు పూర్తి చేసుకున్న వారే. తపన, ఆసక్తి, అభిరుచి ఉంటే నాణ్యమైన విద్యను అభ్యసించడానికి పరిమితులు లేవు.

ఉన్నత విద్య తప్పనిసరి అనే అభిప్రాయంపై మీ స్పందన?
వాస్తవానికి మనం ఉన్నత విద్య అనే అంశానికి అనవసరంగా అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నది నా భావన. ఎలాంటి ఉన్నత చదువులు అభ్యసించని.. అనుభవం ద్వారా నైపుణ్యాలు సొంతం చేసుకునే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, డ్రైవర్, ఫిజియో థెరపిస్ట్, నర్స్, షాప్ వర్కర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగార్హత పొందుతున్నారు. అంతేకాకుండా.. ద్వితీయ, తృతీయ శ్రేణి ఎంబీఏ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో పోల్చితే అధికంగా సంపాదిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. అంటే.. ఎంప్లాయబుల్ స్కిల్స్ రావాలంటే ఉన్నత చదువులే అవసరం లేదనేది నా అభిప్రాయం.

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరగడానికి చేపట్టాల్సిన చర్యలు?
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విషయంలో ఫార్ములాలు, అకడెమిక్ కాన్సెప్ట్స్, కరిక్యులంలో మార్పులు వంటి వాటి కంటే మానసిక దృక్పథాలపై దృష్టిపెట్టాలి. విద్యార్థులను వారు సొంతంగా ఆలోచించేలా ప్రోత్సహించాలి. ఈ క్రమంలో పొరపాట్లు చేసినా నిరుత్సాహానికి గురి చేయకూడదు. ఇన్నోవేషన్ అంటే ఉదాహరణలతో చూపించాలి. దీనికి కరిక్యులంలో మార్పులు అవసరం లేదు. మంచి అధ్యాపకులు, వారి ప్రోత్సాహమే చక్కటి స్ఫూర్తిదాయకాలు.

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు ప్రభుత్వం, పరిశ్రమల నుంచి ఎలాంటి మద్దతు కావాలి?
ప్రభుత్వం చిన్న తరహా సంస్థల నిర్వహణ సులభతరం చేసే విధంగా వ్యవహరించాలి. చిన్నతరహా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఆర్థిక సంరక్షణనిచ్చే ప్రదేశంగా దేశం మొత్తాన్ని రూపొందించాలి. కానీ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. మీరు ఏదైనా ఒక చిన్న కంపెనీని ప్రారంభిస్తే.. వ్యవస్థ, విధానాలు, నిబంధనలు మిమ్మల్ని వేటాడతాయి. పరిశ్రమ విషయానికొస్తే.. పెద్ద సంస్థలు, కొత్త, చిన్నతరహా ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను కేవలం సరఫరాదారులుగానే భావించకుండా.. తమ వ్యాపారానికి అమూల్యమైన భాగస్వాములుగా గుర్తించాలి. అంతేకాకుండా తమ సక్సెస్ ఫార్ములాలను నవతరానికి అందించాలి.

ఒక విద్యార్థి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలంటే ఎలాంటి స్కిల్స్ పెంచుకోవాలి?
ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడానికి మూడు ముఖ్యమైన అంశాలపై స్పష్టత ఉండాలి. అవి.. వ్యాపారం అనే ఆలోచనను నిరంతరం ఇష్టపడాలి. అదేవిధంగా ప్రజల వాస్తవ సమస్యలను పరిష్కరించేందుకు ఉత్సుకతతో ముందుకు సాగాలి. ఇవే కాకుండా.. నెగోషియేషన్ స్కిల్స్ సొంతం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ‘పాత్ డిపెండెన్స్’ కంటే ‘పాత్ క్రియేషన్’ అనే ఆలోచనను అమితంగా ఇష్టపడాలి. ఓటములు ఎదురైనా ఫీనిక్స్ పక్షిలా తిరిగి నిలబడే ఆత్మస్థైర్యం అవసరం. గ్రేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సక్సెస్ స్టోరీలు స్ఫూర్తి, ప్రేరణగా తీసుకుంటే రాణించడం సులువే. ఇటీవల కాలంలో ఎంటర్‌ప్రెన్యూర్ రంగంలో పెరుగుతున్న యువతను స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రయత్నం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదు. నేను తొలుత 28 ఏళ్ల వయసులో సొంతం గా ఒక కన్సల్టింగ్ సంస్థను నెలకొల్పాను. కానీ మూడేళ్లకే ఆ వెంచర్ విఫలమైంది. ఆ తర్వాత పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేసి.. 13 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత వెంచర్ ఆలోచనకు రూపమిచ్చాను. అలా ఏర్పాటైన సంస్థ మైండ్ ట్రీ. అంటే.. పట్టుదల, ఆసక్తి ఉంటే కొంత ఆలస్యంగానైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

విద్యార్థులకు మీరిచ్చే సలహా?
మిమ్మల్ని.. మీరు ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దు. మీ నైపుణ్యాలపై ఆందోళన చెందొద్దు. మీ గురించి మీకు తెలిసిన నైపుణ్యాల కంటే అంతర్గతంగా మరెన్నో నైపుణ్యాలు దాగి ఉంటాయి. వాటిని వెలికి తీయండి. వినూత్నంగా ఆలోచించండి. అప్పుడు ఎంతటి విజయాలైనా ఇట్టే లభిస్తాయి!!
Published date : 28 Jul 2014 04:13PM

Photo Stories