Skip to main content

సహానుభూతే నా విజయ రహస్యం... సత్య నాదెళ్ల

సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు సారథిగా.. ఆధునిక విజ్ఞాన ప్రపంచానికి వారధిగా సత్య నాదెళ్ల సుపరిచితుడు! ఆయనలో నిష్ణాతుడైన సాంకేతిక నిపుణుడే కాదు ఓ సాహిత్యాభిలాషి కూడా ఉన్నారు. ఈ అభిరుచే మైక్రోసాఫ్ట్‌లో పాతికేళ్ల అనుభవ సారానికి ‘హిట్ రిఫ్రెష్’గా అక్షర రూపమిచ్చేలా చేసింది. వ్యక్తులు కావచ్చు.. సమూహాలు కావచ్చు.. సమాజం కావచ్చు.. ఎందుకు పరిణామం చెందాలి..? మార్పులకు అనుగుణంగా ఎందుకు సంస్కరించుకోవాలి..? అనే విషయాలను నాదెళ్ల ఈ పుస్తకంలో వివరించారు. ‘హిట్ రిఫ్రెష్’లో నాదెళ్ల విలువైన అనుభవాలు, యువతకు పనికొచ్చే అనేక విషయాలను ప్రస్తావించారు. ఆ వివరాల సమాహారం! ఆయన మాటల్లోనే..
At the core, Hit Refresh is about us humans and the unique quality we call empathy, which will become ever more valuable in a world where the torrent of technology will disrupt the status quo like never before. - Satya Nadella

ఆ చిత్రం కలవర పెట్టింది :
నిరంతరం ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చటానికి ప్రయత్నిస్తున్న సంస్థలో పనిచేయాలన్నది చిన్నతనం నుంచి నా కోరిక. అందుకే 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరాను. కంప్యూటర్ విప్లవానికి కారణమై.. ప్రపంచ తీరుతెన్నులను మార్చేసిన సంస్థలో పనిచేయడం గర్వంగా ఉంది. చాలాకాలం వరకు మైక్రోసాఫ్ట్, ఐబీఎం మాత్రమే కంప్యూటర్లను తయారు చేసేవి. కాలంతోపాటు మైక్రోసాఫ్ట్ పనితీరు కూడా మారుతూ వచ్చింది. ఇన్నోవేషన్ స్థానంలో బ్యూరోక్రసీ వచ్చింది. సృజనను అధికారస్వామ్యం మింగేసింది. టీమ్‌వర్క్ స్థానంలో ఆఫీసు రాజకీయాలు మొదలయ్యాయి. ఫలితంగా అభివృద్ధి మందగిస్తూ వచ్చింది. అదే సమయంలో ఓ కార్టూనిస్ట్ మైక్రోసాఫ్ట్‌పై వ్యంగ్యంగా ఓ చిత్రం గీశాడు. అందులో.. మైక్రోసాఫ్ట్ సిబ్బంది గ్రూపులుగా విడిపోయి, ఒకరిపై ఒకరు తుపాకులు ఎక్కుపెట్టుకుంటూ ఉంటారు. సంస్థలో నెలకొన్న పరిస్థితికి ఆ చిత్రం అద్దం పట్టింది. సీనియర్ ఉద్యోగిగా ఆ కార్టూన్ నన్ను చాలా కలవర పెట్టింది. సంస్థ పెద్దలు ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం నచ్చలేదు.

మొదలైన అంతర్మథనం :
ఈ పరిస్థితిని మార్చాలంటే.. ఏం చేయాలి? అన్న అంతర్మథనం అప్పుడే మొదలైంది. గతంలో ఇదే సంస్థలో అనేక హోదాల్లో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఈ పరిస్థితిని పునరుద్ధరించడం అసాధ్యమని నాకనిపించలేదు. అందుకే 2014 ఫిబ్రవరిలో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సిబ్బందికి ఒక లేఖ రాశాను. అందులో ఈ సంస్థ స్థాపించిన నేపథ్యం.. సిద్ధాంతాలు, సంస్కృతిని వివరించాను. వీటన్నింటినీ తిరిగి తీసుకురావడమే నా లక్ష్యమని స్పష్టంగా చెప్పాను. మా సంస్థలో ప్రతివారం సీనియర్ లీడర్‌షిప్ టీమ్ (ఎస్‌ఎల్‌టీ) సమావేశమవుతుంటుంది. గతంలో నేను కూడా ఇందులో సభ్యుడినే. అందుబాటులో ఉన్న అవకాశాలు, లక్ష్యాలు, సవాళ్లను ఇందులో సమీక్షిస్తాం. ఈ టీమ్‌లో ఇంజనీర్లు, పరిశోధకులు, మేనేజర్లు, మార్కెటింగ్ సిబ్బంది ఉంటారు. అంతా వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన వారే. కానీ, ప్రతి ఒక్కరికీ టెక్నాలజీ అంటే మహా ఇష్టం. అదే అందరినీ ఒక్కతాటి పైకి తీసుకొచ్చింది.

సమస్య అర్థమైంది :
మేమంతా మా శక్తియుక్తులనూ, మేధస్సును అనుసంధానిస్తే అద్భుతాలు సృష్టించవచ్చనేది నా ప్రగాఢ నమ్మకం. నేను సీఈవో అయ్యే ముందు మా హోమ్ టీం ‘సీటెల్ సీహ్యాక్స్’ ఫుట్‌బాల్ సూపర్ బౌల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకుంది. ఆ విజయానికి కారణం సైకాలజిస్ట్ డాక్టర్ జెర్వైస్. ఫుట్‌బాల్ టీమ్‌లో ఉత్సాహం నింపడానికి ఆయన వాడిన టెక్నిక్స్ చాలామందిని ఆకర్షించాయి. ఒత్తిడి వాతావరణంలో పనిచేస్తున్న మా టీమ్‌కి కూడా జెర్వైస్ సలహాల వల్ల ఉపయోగం ఉంటుందని అనిపించింది. ఎప్పట్లానే జరిగే ఓ శుక్రవారం ఎస్‌ఎల్‌టీ సమావేశానికి జెర్వైస్‌ని ఆహ్వానించాం. ఆ సమావేశంలో జెర్వైస్ ‘మీలో ఎవరికైనా అద్భుత వ్యక్తిగతానుభవం కావాలా’ అని అడిగారు. అందరం కావాలన్నాం. అయితే ఒకరు ముందుకు రండి అన్నారు. ఎవరూ వెళ్లలేదు. అందరికీ ఏదో సంకోచం. ప్రతి ఒక్కరూ పక్కవారిని చూడటం మొదలుపెట్టారు. ఆ టైంలో మా సీఎఫ్‌వో ‘అమి హుడ్’ ముందుకొచ్చారు. తనకు జెర్వైస్ ఇచ్చిన టాస్క్ ‘ఇంగ్లిష్ అక్షరాలను అంకెలతో కలిపి లెక్కపెట్టడం’ (ఏ1, బీ2, సీ3 ఇలా..) ఈ టాస్క్ తర్వాత అందరూ రిలాక్స్ అయ్యారు. తర్వాత జెర్వైస్ అడిగిన ప్రశ్న.. టాస్క్ చెప్పిన వెంటనే మీలో ఎవరూ ముందుకు రాలేదు ఎందుకు? మీది అత్యున్నత సామర్థ్యం ఉన్న గ్రూపు కాదా? అద్భుతాలు చేయగలమని నమ్మడం లేదా? ఆ ప్రశ్నలకు మా వద్ద సమాధానాలు లేవు. ఈ సంఘటన సమస్య ఏంటో తెలిసేలా చేసింది.

నిరాసక్తతకు అదే కారణం :
మైక్రోసాఫ్ట్‌లో 22 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన తర్వాత కొత్త సీఈవో ఎంపిక ప్రక్రియ మొదలైనప్పుడు నాకు పెద్దగా ఆసక్తి లేదు. ఆ ప్రక్రియను వేదాంత ధోరణిలోనే చూశాను. ఇంట్లో పిల్లలను చూసుకోవడం, ఆఫీసులో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అభివృద్ధి పైనే దృష్టంతా ఉండేది. నా నిరాసక్తతకు కారణం అదే. సీఈవో ఇంటర్వ్యూకి నన్ను కూడా పిలిచారు. ఆ బోర్డులో ఒక సభ్యుడు.. నువ్వు సీఈవో కావాలంటే ఆ పోస్టు కోసం నువ్వు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు కనిపించాలి అని సూచించారు. అలా ఆయన ఎందుకు అన్నారా అని ఆలోచించా. స్టీవ్ బామర్ (అప్పటి మైక్రోసాఫ్ట్ సీఈవో) దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే తను నవ్వి ‘భిన్నంగా ఉండటానికి ఇప్పటికే ఆలస్యమైంది’ అన్నాడు.

ఆ ఆలోచనతోనే పుస్తకం రాశాను :
సాధారణంగా లీడర్లు తమ జీవిత అనుభవాలను పంచుకోవడానికి పుస్తకాలు రాస్తుంటారు. కానీ, వృత్తిలో బిజీగా ఉన్నప్పుడు రాయరు. పదవీ విరమణ తర్వాతే మొదలుపెడతారు. అలాకాకుండా సీఈవో స్థానంలో ఉండగానే అనుభవాలను ఇతరులతో పంచుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనే నాతో ఈ పుస్తకం రాయించింది.

ముఖ్యంగా మూడు ముచ్చట్లు..
  1. హైదరాబాద్‌లో జన్మించిన తాను మైక్రోసాఫ్ట్ పగ్గాలు అందుకున్న క్రమం. ఆ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు తదితర విషయాలను తన హిట్ రిఫ్రెష్‌లో పొందుపరిచారు సత్య నాదెళ్ల. తన క్రీడా ఉత్సుకతను, ఇండియన్ బ్యాట్స్‌మెన్ జయ సింహపై గల అభిమానాన్ని, 20 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లడం, ఆపై అనూతో పెళ్లయ్యాక ఆమె కోసం గ్రీన్‌కార్డ్ వదులు కోవడం.. సాఫ్ట్‌వేర్ రంగంలో పరిణామాలను సత్య తన పుస్తకంలో వివరించారు.
  2. నాలుగు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న మైక్రోసాఫ్ట్ నేటి ఆధునిక తరంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో వివరించారు.
  3. నేడు మనిషి జీవితంలో పెను మార్పులు సృష్టిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివి సమాజంలో ఎలా అంతర్భాగం కానున్నాయో పేర్కొన్నారు.

అదే నా విజయ రాహస్యం...
‘‘Empathy (సహానుభూతి), 'learning from life's experiences' (అనుభవాల నుంచి నేర్చుకోవడం) ఇవే నా విజయ రహస్యాలు. నేను మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోసం ఎదుర్కొన్న ఇంటర్వ్యూ ముగిశాక... చివర్లో అక్కడి మేనేజర్ అడిగిన ప్రశ్న నాపై తీవ్ర ప్రభావం చూపింది. (ప్రశ్న: ఎవరో ఒక పిల్లవాడు రోడ్డుపై ఏడుస్తూ కనిపిస్తే నువ్వు ఆ సమయంలో ఏం చేస్తావు? నాదెళ్ల: 911కు ఫోన్ చేస్తాను. మేనేజర్: 911కు ఫోన్ చేసే ముందు ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఓదార్చాలి. సాటి మనుషులు పట్ల కొంతైనా సహానుభూతితో వ్యవహరించాలి). ఆ రోజు మేనేజర్ అన్న ఆ మాటలు నా దృక్పథాన్ని సమూలంగా మార్చేశాయి. అలాగే నా కుమారుడు జైన్ శిశు పక్షవాతం (cerebral palsy)తో జన్మించడం కూడా సహానుభూతి అవసరాన్ని తెలియజేసింది. ఇతరులు చెప్పేది సహానుభూతితో వినడంపైనే ఎక్కువ దృష్టిపెడతాను. ఆ లక్షణమే నన్ను మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి ఎదిగేలా చేసిందని చెప్పొచ్చు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. నా నాయకత్వ మంత్రం.. నా విజయ రహస్యం.. సహానుభూతి! (Empathy)
  • హిట్ రిఫ్రెష్ పుస్తకం ముందుమాట బిల్‌గేట్స్ రాశారు. గత 20 ఏళ్లుగా నాదెళ్ల తనకు తెలుసుననీ, సంస్థపై తనదైన ముద్ర వేశార ని ప్రశంసించారు.
  • తన జీవితాన్ని తీర్చిదిద్దిన రెండు కుటుంబాలకు నాదెళ్ల ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చా రు. వారిలో ఒకరు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఒక కుటుంబం కాగా, మైక్రోసాఫ్ట్ సంస్థ రెండో కుటుంబం.
Published date : 12 Dec 2017 12:07PM

Photo Stories