Microsoft: మైక్రోసాఫ్ట్‌లో 75 వేల మహిళా డెవలపర్లకు నైపుణ్య శిక్షణ

దీని కింద ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్, కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో లింగ అసమానతలను తొలగించడంలో తోడ్పడే ఉద్దేశంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని తొమ్మిది దేశాల్లో 2021లో ఈ ప్రోగ్రాంను ఆవిష్కరించినట్లు ఆయన చెప్పారు. దీని కింద మహిళా డెవలపర్లు, కోడర్స్‌కు శిక్షణ, నెట్‌వర్కింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు.
మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మరోవైపు శిక్షణ ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షా కోపైలట్ ప్రోగ్రాం.. ప్రధానంగా ఉపాధ్యాయులకు సాధికారత కల్పించేందుకు ఉద్దేశించినదని సత్య నాదెళ్ల తెలిపారు. అజూర్ ఓపెన్‌ఏఐ మోడల్ తోడ్పాటుతో పాఠ్యాంశాలను విద్యార్థులు మరింత సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు శిక్షా కోపైలట్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని 30 గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు.